Friday, January 24, 2025

మొక్కజొన్న ధర పతనం!

- Advertisement -
- Advertisement -

ఏదేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం, పరపీడన పరాయణత్వం తప్ప అన్నాడు శ్రీశ్రీ. ఆయన మాటల్లోనే భారత రైతుల జీవితంలో ఏమున్నది గర్వించదగ్గది, పంట నష్టాలు, అప్పులు, ఆత్మహత్యలు తప్ప. ఇది దేశ రైతాంగ చిత్రపటం. ఈ చిత్ర పటంలో మొక్కజొన్న రైతు అగ్రస్థానం సంపాయించాడు. మొక్కజొన్న ప్రపంచంలోని 165 దేశాల్లో 190 మిలియన్ హెక్టార్ల సాగు చేస్తున్నారు. మొక్కజొన్న అనేక దేశాల్లో ప్రధాన ఆహార పంటగా ఉంది. గోధుమ, బియ్యం కన్నా ఎక్కువగా ఆహారానికి ఉపయోగిస్తున్నారు. ఇథనాల్ తయారీలో, పశుగ్రాసం, మొక్కజొన్న పిండి, కార్న్ సిరఫ్ వంటి ఉత్పత్తులకు కూడా మొక్కజొన్నను ఉపయోగిస్తున్నారు.

2021 అంచనా ప్రకారం మొత్తం ప్రపంచ ఉత్పత్తి కోటి 20 లక్షల టన్నులు. 2022-23 వార్షిక సంవత్సరం అంచనా ప్రకారం భారత దేశంలో మొక్కజొన్న ఉత్పత్తి ప్రాథమిక అంచనా 21.95 మిలియన్‌టన్నులు. మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లో ఉత్పత్తి పెరిగి కర్ణాటకలో తగ్గిన ఉత్పత్తిని భర్తీ చేసింది. కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ ప్రకారం అత్యధిక మొక్కజొన్న సాగు బీహార్ ఉంది. ఇక్కడ సంవత్సరానికి రెండు పంటలు పండిస్తారు. 20% భూమిని రైతాంగం వినియోగిస్తున్నారు. ఆ తర్వాత ఉత్తరప్రదేశ్ 11%, రాజస్థాన్ 10%, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ లలో 8% చొప్పున మొక్కజొన్న పండిస్తున్నారు.

ఇతర పంటల రైతుల మాదిరే మొక్కజొన్న పంట సేద్యపు రైతులు కూడా తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. మొక్కజొన్న సాగు మొదలు గాక ముందు ఉమ్మడి తెలుగు రాష్ట్రం లో రబీలో వరితో పాటు మినుము, పెసర మాగాణి సాగుగా ఉంటే, వేరుశనగ, కంది, మొక్కజొన్న మెట్ట భూమిలో సాగు చేసేవారు. రబీ వరి సాగుకి అనేక ప్రాంతాల్లో సాగు నీరు ఇవ్వటానికి ప్రభుత్వం నిరాకరించటం, ఖరీఫ్‌కు ఆగస్టు దాకా గత ప్రభుత్వాలు సాగునీరు విడుదల చేయకపోవటం, అపరాల సాగుకి సమయం లేకపోవటం, మినుము, పెసర పైర్లకు విపరీతంగా తెగుళ్ల వ్యాపించటంతో రైతాంగం ప్రత్యామ్నాయ పంటల ఆలోచన చేసి మొక్కజొన్న పంటను ఎంచుకున్నారు. ప్రారంభంలో ఈ పంట గుంటూరు, కృష్ణా జిల్లాలే పరిమితమైన ఆ తర్వాత రాష్ట్ర మంతటా విస్తరించింది. ఈ పంటతో పాటు జొన్న పంట కూడా రబీ సేద్యంలోకి వచ్చి మరో ముఖ్య పంటగా నిలిసింది. ప్రారంభంలో మొక్కజొన్న రైతులకు ఆశాజనకంగా ఉంది. వరి కన్నా ఎక్కువ ఆదాయం వచ్చింది. కొద్ది సంవత్సరాలు ఇలా కొనసాగిన తర్వాత మొక్కజొన్న రైతాంగానికి సంక్షో భం ప్రారంభమైంది. ప్రకృతి వైపరీత్యాలు మొక్కజొన్న పంటను చుట్టుముట్టాయి.

ప్రభుత్వం ప్రకటిస్తున్న మద్దతు ధరలు రైతుల ప్రయోజనాలను కాపాడటంతో విఫలమైనా యి. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరలు ఇలా ఉన్నాయి. 2014-15 సంవత్సరంలో క్వింటాకు 1310 రూపాయలు. సేద్యపు ఖర్చులు ఎకరాకి 25 వేల. సగటు దిగుబడి ఎకరాకి 25 క్వింటాళ్లు. చాలా మంది రైతులకు ఈ దిగుబడి కూడా రావటం లేదు. 25 క్వింటాళ్లు వచ్చే రైతుకు కూడా మిగిలేది చాలా తక్కువ. కౌలు రైతులకు పెట్టుబడి కూడా రాని పరిస్థితి. 2020-21లో 1850, 2021-22లో 1870, 2022- 23లో 1963 రూపాయలు క్వింటా మొక్కజొన్నకు ప్రభుత్వం మద్దతు ధరగా ప్రకటించింది. పంట ఖర్చులు రూ. 35 వేలకు పైగా పెరిగాయి. బయట మార్కెట్లో మొక్కజొన్న కొనటానికి వ్యాపారులు ముందుకు రాలేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మద్దతు ధర చెల్లించి రైతుల నుండి నామ మాత్రంగానే కొనుగోలు చేసి బాధ్యత తీరినట్లుగా వ్యహరించాయి. రైతుల వద్ద నిల్వలు పేరుకుపోయాయి. అయినకాడికి అమ్ముకుందామన్నా కొనేనాథుడు కన్పించలేదు. రైతుల పరిస్థితి దమనీయంగా మారింది.

2022లో అంతర్జాతీయంగాను, దేశీయంగాను మొక్కజొన్న దిగుబడులు తగ్గటం, ఎగుమతి ఆర్డర్లు ఎక్కువగా ఉండటం వలన వ్యాపారులు క్వింటాలుకు 2000 నుంచి 2200 ధర వరకు రైతుల నుంచి కొనుగోలు చేశారు. తెలుగు రాష్ట్రాల్లో 2023 మార్చి వరకు రైతులకు ఆ ధర లభించింది. ఈ సంవత్సరం కొత్త పంట చేతికి రావటం ప్రారంభం కావటం, ఉత్పత్తి గతం కన్నా పెరగటంతో అకస్మాత్తుగా వ్యాపారులు ధరను దారుణంగా తగ్గించారు. 16 వందల నుంచి 1850 రూపాయల లోపు మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. నెల లోపే నాలుగు వందలకు పైగా ధర తగ్గింది. బీహార్ రాష్ట్ర లోని భాగపూర్ జిల్లాలో క్వింటాకు 1050 రూపాయలు మాత్రమే రైతులకు లభిస్తున్నది.క్వింటా మొక్కజొన్న పండించటానికి 1300 దాకా ఖర్చు అవుతుంది. మండేల మార్కెట్లో వెయ్యి రూపాయలే క్వింటాలుకు లభిస్తున్నది.

గత సంవత్సరం ఇదే మార్కెట్లో రూ. 2200 ధరల భించింది. మార్కెట్ లో మద్దతు ధర కన్నా తక్కువ ధర ఉన్నప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల నుండి మొక్కజొన్నను మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయాలి. ఇంత వరకు తెలుగు రాష్ట్రాల్లో సేకరణ ప్రారంభం కాలేదు.
దేశంలో మొక్కజొన్న రైతులు న్యాయమైన ధర కోసం ఆందోళన చేస్తుంటే, మద్దతు ధరకు కొనుగోలు చేసే చర్యలు తీసుకోకుండా 50 లక్షల టన్నుల మొక్కజొన్నను దిగుమతి చేసుకోవాలని మోడీ ప్రభుత్వ నిర్ణయించింది. అందుకు దిగుమతి సుంకాన్ని 50% నుండి 15% తగ్గించింది. ఫలితంగా మొక్కజొన్న ధర మరింత పతనమై రైతాంగం తీవ్రంగా నష్టపోతారు. దేశంలో తగినంత ఉత్పత్తి జరిగినప్పుడు దిగుమతి సుంకం తగ్గించి మరీ దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఏమెచ్చింది. 2007లో పత్తి ధర క్వింటాలు రూ. 6 నుండి రూ. 7 వేలకు పెరిగి రైతాంగానికి మిగులు ఏర్పడింది.

అలాంటి సందర్భంలో కేంద్ర ప్రభుత్వం ఎగుమతులను నిలిపివేయాలని నిర్ణయించింది. ఫలితంగా రెండు రోజుల్లో పత్తి ధర రూ. 4 వేలకు పడిపోయింది. గత మార్చి దాకా 2200 ధర మొక్కజొన్నకు లభించి రైతాంగానికి ఊరటగా ఉన్న సమయంలో ధర తగ్గటమే కాకుండా, దిగుమతి చేసుకోవాలనే నిర్ణయం మూలంగా ధర పతనం ఎక్కడికి చేరుతుందోనని రైతాంగం ఆందోళనచెందుతున్నారు. ప్రభుత్వ నిర్ణయం రైతాంగ వ్యతిరేక విధానాలకు నిదర్శనం. సాంప్రదాయ సరఫరాదారు అర్జెంటైనాలో ఏర్పడిన తీవ్రమైన కరువు మొక్కజొన్న ఉత్పత్తి తగ్గించిన ఫలితంగా ఆసియాలోని ఫీడ్ మిల్లర్లు భారత దేశం నుండి మొక్కజొన్న కొనుగోలు చేయటానికి ఇద్దరు వ్యాపారులు వచ్చా రు. ఇలాంటి పరిస్థితుల్లో మొక్కజొన్న రైతాంగానికి మంచి ధర వచ్చేలా చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉంది. అందుకు భిన్నంగా రైతాం గం నష్టపోయే నిర్ణయం తీసుకుంది.

యూరోపియన్ యూనియన్ దేశాల్లో అవసరాల కన్నా తక్కు వ ఉత్పత్తి జరగటం వలన దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. దిగుమతుల వలన ఆ దేశాల రైతులు నష్టపోని విధంగా దిగుమతి సుంకాన్ని విధిస్తున్నది. ఫలితంగా ఆ దేశాల్లో దిగుమతుల వల్ల మొక్కజొన్న ధరలు తగ్గలేదు. మోడీ ప్రభుత్వం దిగుమతి సుంకాన్ని భారీగా తగ్గించి ధరల పతనానికి కారణమైంది. భారత్ టన్ను మొక్కజొన్న ఆగ్నేయాసియాకు 310 నుండి 315 అమెరికా డాలర్లకు విక్రయిస్తున్నదని, దక్షిణ అమెరికా 330 డాలర్లు ఇస్తున్నదని వ్యాపారులు తెలిపారు. దేశ రైతాంగాన్ని నష్టపర్చి విదేశీ వ్యాపారులకు మోడీ ప్రభుత్వం మొక్కజొన్నను చవకగా కట్ట పెడుతున్నది. అమెరికా, యూరోపియను యూనియన్ దేశాలు మొక్కజొన్న రైతులకు పెద్ద మొత్తంలో సబ్సిడీలు ఇస్తున్నాయి. అమెరికా అయితే 1930 నుంచి సబ్సిడీ ఇస్తున్నది.

1995 నుండి 2014 వరకు మొక్కజొన్న రైతులకు అమెరికా సంవత్సరానికి 4.7 బిలియన్ల డాలర్లను అందించింది. ఆ తర్వాత వ్యవసాయం, ఆహార కార్యక్రమాలపై సంవత్సరానికి 97.29 బిలియన్ డాలర్లు ఖర్చు చేస్తున్నది. మోడీ ప్రభుత్వం మాత్రం నామమాత్రంగా ఇస్తున్న సబ్సిడీలను తగ్గిస్తూ వస్తున్నది. భారత పాలకులు దేశంలో సరళీకరణ ఆర్థిక విధానాలను ఆమోదించటం, ప్రపంచ వాణిజ్య ఒప్పందంపై సంతకం చేయటం, ప్రపంచ వ్యవసాయ ఒప్పందానికి ఆమోదం తెలపటం ద్వారా రైతాంగ ప్రయోజనాలను విస్మరించి సామ్రాజ్యవాదుల, బహుళ జాతి సంస్థల ప్రయోజనాలకు అనుకూలమైన విధానాలు అమలు జరుగుతూ ఉండటం వల్లనే నేటి మొక్కజొన్న ధరలు తగ్గటానికి కారణం. మోడీ ప్రభుత్వ అనుసరిస్తున్న రైతాంగ వ్యతిరేక విధానాలను, సామ్రాజ్య వాద అనుకూల విధానాలను వ్యతిరేకిస్తూ, మొక్కజొన్న క్వింటాలుకు 2500 రూపాయల మద్దతు ధర ప్రకటించాలని యావన్మంది భారత రైతాంగం ఉద్యమించాలి.

బొల్లిముంత సాంబశివరావు
9885983526

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News