ఇటాలియన్ ఓపెన్
రోమ్: ప్రతిష్టాత్మకమైన ఇటాలియన్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్‌లో అగ్రశ్రేణి క్రీడాకారిణి ఇగా స్వియాటెక్ (పోలండ్) సెమీఫైనల్‌కు చేరుకుంది. పురుషుల సింగిల్స్‌లో రెండో సీడ్ అలెగ్జాండర్ జ్వరేవ్ (జర్మనీ), నాలుగో సీడ్ స్టెఫానొస్ సిట్సిపాస్ (గ్రీస్) క్వార్టర్ ఫైనల్లో విజయం సాధించారు. కాగా, మహిళల విభాగంలో రెండో సీడ్ పౌలా బడోసా (స్పెయిన్) క్వార్టర్ ఫైనల్లోనే ఇంటిదారి పట్టింది. మరోవైపు మూడో సీడ్ అరినా సబలెండా (బెలారస్) క్వార్టర్ ఫైనల్లో చెమటోడ్చి విజయం సాధించింది.
కెనడా క్రీడాకారిణి బియాంకా అండ్రెస్కొతో జరిగిన క్వార్టర్స్ పోరులో టాప్ సీడ్ స్వియాటెక్ 76, 60 తేడాతో విజయం సాధించింది. తొలి సెట్‌లో స్వియాటెక్‌కు ప్రత్యర్థి నుంచి గట్టి పోటీ ఎదురైంది. టైబ్రేకర్ వరకు వెళ్లిన సెట్‌లో ఇగా విజయం అందుకుంది. ఇక రెండో సెట్‌లో స్వియాటెక్ చెలరేగి ఆడింది. ప్రత్యర్థికి ఒక్క గేమ్ గెలిచే అవకాశం కూడా ఇవ్వకుండానే సెట్‌తో పాటు మ్యాచ్‌ను గెలిచి సెమీస్‌కు చేరుకుంది. మూడో సీడ్ సబలెంకా 46, 63, 62 తేడాతో అమెరికా క్రీడాకారిణి అమండా అనిసిమోవాను ఓడించింది. అయితే రెండో సీడ్ బడోసాకు క్వార్టర్స్‌లోనే చుక్కెదురైంది. రష్యా క్రీడాకారిణి డారియా కసట్కినాతో జరిగిన మ్యాచ్‌లో బడోసా ఓటమి పాలైంది. దూకుడైన ఆటను కనబరిచిన కసట్కినా 64, 64 తేడాతో బడోసాను ఓడించి సెమీస్‌కు చేరుకుంది.
జ్వరేవ్, సిట్సిపాస్ ముందుకు..
మరోవైపు పురుషుల సింగిల్స్‌లో రెండో సీడ్ జ్వరేవ్, నాలుగో సీడ్ సిట్సిపాస్ సెమీస్‌కు చేరుకున్నారు. జ్వరేవ్ క్వార్టర్ ఫైనల్లో క్రిస్టియాన్ గారిన్ (చిలీ)ను ఓడించాడు. పూర్తి ఆధిపత్యం చెలాయించిన జ్వరేవ్ 75, 62తో విజయం సాధించాడు. మరో పోటీలో సిట్సిపాస్ 76, 62తో జన్నిక్ సిన్నర్ (ఇటలీ)ను ఓడించాడు.