Monday, December 23, 2024

ఫ్రెంచ్ క్వీన్ ఇగా స్వియాటెక్

- Advertisement -
- Advertisement -

ఫ్రెంచ్ క్వీన్ ఇగా స్వియాటెక్
ఫైనల్లో ముచోవాపై విజయం
నేడు పురుషల సింగిల్స్ తుది సమరం
పారిస్: ప్రతిష్టాత్మకమైన ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్‌లో టాప్ సీడ్ ఇగా స్వియాటెక్ (పోలండ్) ఛాంపియన్‌షిప్‌గా నిలిచింది. శనివారం హోరాహోరీగా సాగిన ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ స్వియాటెక్ 6-2, 5-7, 6-4 తేడాతో చెక్ రిపబ్లిక్‌కు చెందిన అన్ సీడెడ్ కరోలినా ముచోవాను ఓడించింది. స్వియాటెక్‌కు ఇది వరుసగా రెండో ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ కావడం విశేషం. ఇక ముచోవాతో జరిగిన ఫైనల్లో టాప్ సీడ్ స్వియాటెక్‌కు చివరి రెండు సెట్లలో గట్టి పోటీ ఎదురైంది. అయినా చివరి వరకు నిలకడైన ఆటను కనబరిచిన ఇగా టైటిల్‌ను సొంతం చేసుకుంది. తొలి సెట్‌లో స్వియాటెక్ దూకుడుగా ఆడింది. అద్భుత షాట్లతో ముచోవాను ఒత్తిడికి గురి చేసింది.

ఇగా ధాటికి ముచోవా తొలి సెట్‌లో ఎదురు నిలువలేక పోయింది. పూర్తి ఆధిపత్యం చెలాయించిన స్వియాటెక్ ఎలాంటి ప్రతిఘటన లేకుండానే సెట్‌ను దక్కించుకుంది. రెండో సెట్ ఆరంభంలో కూడా ఇగా ఆధిపత్యం చెలాయించింది. తన మార్క్ షాట్లతో ముచోవాను ఉక్కిరిబిక్కిరి చేసింది. అయితే ముచోవా కూడా పట్టువీడకుండా పోరాడింది. ఇగా జోరుకు బ్రేక్ వేస్తూ అనూహ్యంగా ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఇదే క్రమంలో టైబ్రేకర్‌లో సెట్‌ను కైవసం చేసుకుంది. మూడో సెట్ ఆరంభంలో కూడా ముచోవా జోరును కొనసాగించింది. స్వియాటెక్‌ను హడలెత్తిస్తూ విజయం దిశగా అడుగులు వేసింది. ఒక దశలో ముచోవా విజయం ఖాయంగా కనిపించింది.

అయితే కీలక సమయంలో స్వియాటెక్ పుంజుకుంది. అద్భుత షాట్లతో ముచోవాపై విరుచుకుపడింది. ఒత్తిడిని సయితం తట్టుకుంటూ ముందుకు సాగింది. అంతేగాక ముచోవా ఆధిక్యాన్ని దాటుకుంటూ సెట్‌తో పాటు మ్యాచ్‌ను సొంతం చేసుకుని ఛాంపియన్‌గా నిలిచింది. ఇగా కెరీర్‌లో ఇది నాలుగో గ్రాండ్‌స్లామ్ సింగిల్ టైటిల్. కిందటిసారి కూడా ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్‌ను ఇగానే సొంతం చేసుకుంది. ఈసారి కూడా విజేతగా నిలిచి వరుసగా రెండో టైటిల్‌ను తన ఖాతాలో వేసుకుంది. మరోవైపు కెరీర్‌లో తొలిసారి గ్రాండ్‌స్లామ్ ఫైనల్ ఆడిన ముచోవాకు నిరాశే మిగిలింది. సెమీ ఫైనల్లో రెండో సీడ్ సబలెంకపై సంచలన విజయం సాధించిన ముచోవా ఫైనల్లో మాత్రం అలాంటి ఫలితాన్ని పునరావృతం చేయలేక పోయింది. ఇగా స్వియాటెక్‌కు చివరి వరకు గట్టి పోటీ ఇచ్చినా రన్నరప్‌తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయితే అన్ సీడెడ్‌గా బరిలోకి దిగిన ముచోవా స్ఫూర్తిదాయక ఆటతో ఫైనల్‌కు చేరి టోర్నమెంట్‌లో పెను ప్రకంపనలు సృష్టించింది.

చరిత్రకు అడుగు దూరంలో జకోవిచ్
పురుషుల సింగిల్స్‌లో సెర్బియా యోధుడు, మూడో సీడ్ నొవాక్ జకోవిచ్ చారిత్రక విజయానికి ఒక గెలుపు దూరంలో నిలిచాడు. ఆదివారం నార్వేకు చెందిన నాలుగో సీడ్ కాస్పర్ రూడ్‌తో జరిగే ఫైనల్లో విజయం సాధిస్తే జకోవిచ్ గ్రాండ్‌స్లామ్ చరిత్రలోనే అత్యంత అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకుంటాడు. గ్రాండ్‌స్లామ్ సింగిల్స్‌లో జకోవిచ్, స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ 22 టైటిల్స్‌తో సంయుక్తంగా అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. ఈ ఏడాది గాయం వల్ల నాదల్ ఫ్రెంచ్ ఓపెన్‌కు దూరమయ్యాడు. అతను లేక పోవడంతో అరుదైన రికార్డును సాధించే ఛాన్స్ జకోవిచ్‌కు ఏర్పడింది. రూడ్‌తో జరిగే తుది సమరంలో జకోవిచ్ విజయం సాధిస్తే అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ సాధించిన ఆటగాడిగా ప్రపంచ రికార్డు సృష్టిస్తాడు.

జకోవిచ్ ఫామ్‌ను చూస్తే టైటిల్ సాధించడం ఖాయంగా కనిపిస్తోంది. సెమీ ఫైనల్లో అగ్రశ్రేణి ఆటగాడు అల్కరాస్‌ను అలవోకగా ఓడించడంతో జకోవిచ్ ఆత్మవిశ్వాసం రెట్టింపు అయ్యింది. ఈ మ్యాచ్‌లో కూడా అదే జోరును కొనసాగించాలనే పట్టుదలతో ఉన్నాడు. రూడ్‌పై గెలిచి టెన్నిస్ చరిత్రలోనే అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకోవాలనే పట్టుదలతో జకోవిచ్ కనిపిస్తున్నాడు. మరోవైపు రూడ్ కూడా కెరీర్‌లో తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించాలనే లక్షంతో పోరుకు సిద్ధమయ్యాడు. ఆదివారం సాయంత్రం ఆరు గంటల నుంచి ఫైనల్ పోరు జరుగనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News