ప్రతిష్ఠాత్మకమైన పాన్ అమెరికన్ మాస్టర్స్ గేమ్స్‌లో భాగంగా జరిగిన స్విమ్మింగ్ పోటీల్లో భారత్‌కు ప్రాతినిథ్యం వహించిన తెలంగాణ స్విమ్మర్ షేక్ సాజిదా స్వర్ణ పతకం సాధించింది. అంతేగాక మరో కాంస్య పతకాన్ని కూడా సాజిదా గెలుచుకుంది. అమెరికాలోని క్లైవ్‌లాండ్ రాష్ట్రం వేదికగా జరుగుతున్న ఈ క్రీడల్లో ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలకు చెందిన క్రీడాకారులు పోటీ పడుతున్నారు. పలు క్రీడాంశాల్లో పోటీలు జరుగుతున్నాయి. కాగా, మహిళల 100 మీటర్ల బ్రెస్ట్‌స్ట్రోక్ విభాగంలో సాజిదా ప్రథమ స్థానంలో నిలిచి పసిడి పతకాన్ని దక్కించుకుంది.
అసాధారణ ప్రతిభను కనబరిచిన సాజిదా 03.31:54 నిమిషాల్లో గమ్యాన్ని చేరి స్వర్ణం సాధించింది. అంతేగాక మహిళల 100 మీటర్ల ఫ్రీస్టయిల్ విభాగంలో సాజిదా కాంస్య పతకాన్ని గెలుచుకుంది. ఇదిలావుంటే స్వర్ణ, కాంస్య పతకాలు సాధించిన దేశ, రాష్ట్ర ఖ్యాతిని ప్రపంచానికి చాటిన సాజిదాను తెలంగాణ స్విమ్మింగ్ అసోసియేషన్ కార్యదర్శి ఉమేశ్ అభినందించారు.