న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మకమైన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ట్వంటీ20 టోర్నమెంట్‌లో తమిళనాడు విజేతగా నిలిచింది. ఢిల్లీలోని అరుణ్‌జైట్లీ స్టేడియంలో జరిగిన ఫైనల్లో తమిళనాడు 4 వికెట్ల తేడాతో కర్ణాటకను ఓడించి వరుసగా రెండోసారి ఈ ట్రోఫీని సొంతం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన కర్ణాటక 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన తమిళనాడు చివరి బంతికి విజయాన్ని అందుకుంది. ఈ లక్ష్యాన్ని తమిళనాడు ఆరు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఊరిస్తున్న లక్షంతో బ్యాటింగ్‌కు దిగిన తమిళనాడుకు ఓపెనర్లు హరి నిశాంత్, జగదీషన్ మెరుగైన ఆరంభాన్ని ఇచ్చారు. కీలక ఇన్నింగ్స్ ఆడిన నిశాంత్ 12 బంతుల్లోనే రెండు సిక్సర్లు, ఒక ఫోర్‌తో 23 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇక వన్‌డౌన్‌లో వచ్చిన సాయి సుదర్శన్ ఆశించిన స్థాయిలో ఆడలేక పోయాడు.
కర్ణాటక బౌలర్లు కచ్చితమైన లైన్ అండ్ లెన్త్‌తో బౌలింగ్ చేస్తూ తమిళనాడు బౌలర్లను కట్టడి చేశారు. దీంతో తమిళనాడు ప్రతి పరుగు కోసం తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. మరోవైపు కెప్టెన్ విజయ్ శంకర్ (18) డిఫెన్స్‌కే పరిమితమయ్యాడు. సాంజయ్ యాదవ్ కూడా నిరాశ పరిచాడు. ఇక సమన్వయంతో బ్యాటింగ్ చేసిన జగదీషన్ రెండు ఫోర్లు, సిక్స్‌తో 41 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మరోవైపు కీలక సమయంలో షారుక్ ఖాన్ విధ్వంసక ఇన్నింగ్స్‌తో జట్టును ఆదుకున్నాడు. కర్ణాటక బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న షారుక్ 15 బంతుల్లోనే మూడు సిక్సర్లు, ఒక ఫోర్‌తో అజేయంగా 33 పరుగులు చేసి తమిళనాడును గెలిపించాడు.
ఆదుకున్న అభివన్, ప్రవీణ్
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన కర్ణాటకు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్ రోహన్ కదమ్ (౦) ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. కెప్టెన్ మనీష్ పాండే (13), కరుణ్ నాయర్ (18) కూడా నిరాశ పరిచారు. దీంతో కర్ణాటక 32 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో చిక్కుకుంది. ఈ దశలో ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లే బాధ్యతను అభినవ్ మనోహర్ తనపై వేసుకున్నాడు. ప్రత్యర్థి బౌలర్లపై ఎదురుదాడి చేసిన అభినవ 37 బంతుల్లో 4 ఫోర్లు, రెండు సిక్సర్లతో 46 పరుగులు చేశాడు. అతనికి వికెట్ కీపర్ శరత్ (16) అండగా నిలిచాడు. ఇక కీలక ఇన్నింగ్స్ ఆడిన ప్రవీణ్ దూబే మూడు సిక్సర్లు, ఒక ఫోర్‌తో 33 పరుగులు సాధించాడు. సుచిత్ ఏడు బంతుల్లో 18 పరుగులు చేశాడు. దీంతో కర్ణాటక స్కోరు 151 పరుగులకు చేరింది.