హైదరాబాద్: రక్త సంబంధ క్యాన్సర్లలో లింఫోమా ఒకటి. రొమ్ము క్యాన్సర్ చికిత్సలో ఉన్న వారిలో లింఫెడెమా సర్వసాధారణ సంఘటన. చికిత్స తరువాత రోజులు ,నెలల తరబడి కూడా సంభవించవచ్చు. చేయి, కాలు, శరీర భాగాల్లో ఏ చోటనైనా వాపు కనిపిస్తే లింఫెడెమాగా భావించక తప్పదు. శరీరం చుట్టూ అదనపు ద్రవాలను తరలించే శోషరస వ్యవస్థ పనితీరుకు అంతరాయం ఏర్పడినప్పుడు , లింఫెడెమా కనిపిస్తుంది. ద్రవం పేరుకుపోయి, లింఫెడెమా వాపు వస్తుంది. లింఫెడెమాలో రెండు రకాలు ఉన్నాయి. ప్రాథమికమైనది వారసత్వంగా లేదా జన్యుపరమైన కారణాలతో వచ్చేది కాగా, గాయం లేదా అడ్డంకి కారణంగా వచ్చేది రెండోది. ఈ సెకండరీ లింఫెడెమా కేసుల్లో ఎక్కువ భాగం క్యాన్సర్ లేదా రొమ్ము క్యాన్సర్ చికిత్స కారణంగా సంక్రమిస్తాయి.
తెల్ల రక్త కణాల్లో ఒకరకం కణాలైన లింఫోసైట్స్‌ను ఉత్పత్తి చేసి, వాటిని తరలించుకు వెళ్లే కణజాలాల్లో వచ్చే క్యాన్సర్ ఇది. దీనిలో ప్రాథమికంగా రెండు రకాలు ఉంటాయి. 1. హాడ్జ్‌కిన్ లింఫోమా, 2. నాన్‌హాడ్జ్‌కిన్ లింఫోమా. హాడ్జ్‌కిన్ లింఫోమా చాలా అరుదుగా రక్త క్యాన్సర్ (లింఫోమా) శోషరస గ్రంథులుపై ప్రభావం చూపుతుంది. ఇన్‌ఫెక్షన్లకు, వ్యాధులకు వ్యతిరేకంగా పోరాడడంలో శోషరస గ్రంథులు కీలక పాత్ర వహిస్తాయి. లింఫోసైట్లు అపారంగా పెరిగిపోవడంతో ఆయా భాగాల్లో కణతులు ఏర్పడి, లింఫోమాకు దారి తీస్తాయి. ఈ క్యాన్సర్ గురించి ప్రజల్లో అవగాహన తక్కువే. ఈ వ్యాధి తీవ్రత ఎక్కువ గానే ఉంటుంది. ప్రపంచంలో ప్రాణాంతకమైన క్యాన్సర్లలో ఆరోస్థానంలో లింఫోమా ఉంది. ఏటా ఏడు లక్షల కేసుల వరకు నమోదవుతున్నాయి. భారత్‌లో వేగంగా వ్యాపించే రక్త క్యాన్సర్లలో లింఫోమా ప్రధానమైనదిగా ఒక అధ్యయనంలో వెల్లడైంది. దేశంలో ఏటా 90 వేల కొత్త కేసులు పుట్టుకొస్తున్నాయి.
ఇది సంక్రమించడానికి కచ్చితంగా ఇదీ కారణమని చెప్పలేక పోతున్నారు. రసాయన సంబంధ పరిశ్రమల్లో పనిచేసినా, రసాయన వ్యర్థాలకు చేరువలో జీవించినా, వ్యవసాయానికి వాడే పురుగుమందుల వల్ల ఇది సంక్రమిస్తుందని పరిశోధకులు భావిస్తున్నారు. మెడ, చంకలు, గజ్జల్లో శోషరస గ్రంథుల (లింఫ్‌నోడ్స్) వాపు, అకారణంగా బరువు తగ్గడం, మగతగా , బలహీనంగా ఉండడం, జ్వరం, రాత్రిపూట ధారగా చెమటలు రావడం, దురద, దద్దుర్లు, పొత్తి కడుపులో నొప్పి, వాపు, శ్వాసలో ఇబ్బంది, ఛాతీలో నొప్పి, దృష్టి దోషాలు, ఆకలి మందగించడం తదితర లక్షణాలు లింఫోమాలో కనిపిస్తాయి. ఈ లక్షణాలు ఇతర సమస్యల వల్ల కూడా కనిపించవచ్చు. అందువల్ల ఏది లింఫోమా క్యాన్సర్, ఏది సాధారణ శ్వాసకోశ సమస్య అన్నది ప్రాథమికంగా నిర్ధారణకు రాలేరు. కాబట్టి ఈ లక్షణాలు ఏ ఒక్కటైనా వారాల తరబడి కొనసాగితే వెంటనే డాక్టర్లను సంప్రదించడం మంచిది.