ఎయిమ్స్ డాక్టర్ నీరజ్ నిశ్చల్ వెల్లడి
న్యూఢిల్లీ : ఎక్కువ మంది ఒమిక్రాన్ బాధితుల్లో వ్యాధి లక్షణాలు స్వల్పం గానే ఉన్నాయని, ఆయా లక్షణాల బట్టి ఇంటి వద్దే చికిత్స తీసుకుంటూ మహమ్మారి కోరల్లో నుంచి బయటపడవచ్చని ఎయిమ్స్ వైద్యుడు డాక్టర్ నీరజ్ నిశ్చల్ తెలియజేశారు. ఎయిమ్స్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ మెడిసిన్ లో అదనపు ప్రొఫెసర్‌గా ఉన్న ఆయన ఒమిక్రాన్ విజృంభణ నేపథ్యంలో అనేక కీలక విషయాలు వెల్లడించారు. సానుకూల ఆలోచనా దృక్పథం, పారాసెటమాల్ మాత్రలతో అత్యధికులు కొవిడ్ నుంచి బయటపడవచ్చునన్నారు. ఇతర అనారోగ్యసమస్యలున్న వృద్ధులు, కరోనా టీకా వేసుకోని వారు వైరస్ బారిన పడితే మాత్రం వారి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని పేర్కొన్నారు. మోల్నుపిరవిర్‌ను మ్యాజిక్ పిల్‌గా భావించడం సరికాదని నిశ్చల్ అన్నారు. వారిపై ప్రయోగాల కోసం ఆధారపడిన కరోనా వేరియంట్ , అప్పటి పరిస్థితులతో పోలిస్తే ఇప్పటి పరిస్థితులు భిన్నమని చెప్పారు. తీవ్రస్థాయి అనారోగ్యానికి గురయ్యే ముప్పున్నవారి కోసమే .. ఆ ఔషధానికి అత్యవసర వినియోగ సంబంధిత అనుమతులు మంజూరు చేసిన సంగతిని గుర్తుంచుకోవాలన్నారు.