Thursday, December 12, 2024

సిరియాలో తిరుగుబాటు

- Advertisement -
- Advertisement -

కీలక దశకు చేరుకున్న అంతర్యుద్ధం
అసద్ నియంతృత్వ పాలనకు తెర
రాజధాని వీధుల్లో ప్రజల ఆనందాతిరేకం
సిరియాకు వెళ్ళొద్దని భారత ప్రజలకు కేంద్రం హితవు

రాజధాని డమాస్కస్ రెబల్స్ వశం… అధ్యక్షుడు అసద్ పరార్

డమాస్కస్ : సిరియన్ ప్రభుత్వం ఆదివారం తెల్లవారు జామున పతనమైంది. మెరుపు వేగంతో దూసుకువచ్చిన తిరుగుబాటువాదులు రాజధాని డమాస్కస్‌పై ఆధిపత్యం సాధించారు. అస్సద్ కుటుంబం 50 ఏళ్లుగా ఉక్కు పిడికిలితో సాగించిన పాలన ముగియగా జన సమూహం వీధుల్లోకి వెల్లువలా వచ్చి వేడుకలు చేసుకోసాగారు. అధ్యక్షుడు బాషర్ అస్సద్ ప్రభుత్వాన్ని కూల్చివేశారని, ఖైదీలు అందరినీ విడుదల చేశారని తెలియజేస్తూ కొందరు వ్యక్తుల బృందం వీడియో ప్రకటనను సిరియన్ అధికార టెలివిజన్ ప్రసారం చేసింది. ‘డమాస్కస్‌పై ఆధిపత్యానికి కార్యాచరణ విభాగం (ఒఆర్‌సిడి)గా పేర్కొంటున్న ప్రతిపక్ష గ్రూప్‘స్వేచ్ఛాయుత సిరియన్ రాజ్యం’ వ్యవస్థను పరిరక్షించవలసిందిగా తిరుగుబాటు యోధు లు అందరికీ, పౌరులకు పిలుపు ఇచ్చిందని ఆ ప్రకటనను చదివిన వ్యక్తి తెలియజేశారు. అస్సద్ దేశం వీడి అజ్ఞాత ప్రదేశానికి వెళ్లిపోయారని, దేశవ్యాప్తంగా గణనీయ వేగంతో ముందుకు సాగి డమాస్కస్‌లోకి ప్రవేశించిన తిరుగుబాటువాదుల కన్నా ముందుగానే అస్సద్ పరారైనారని సిరియన్ ప్రతిపక్ష సమర పర్యవేక్షణ వి భాగం అధిపతి తెలిపిన కొన్ని గంటల తరువాత ఆ ప్రకటన వెలువడింది. లక్షలాది మంది ప్రజలను బలిగొన్న, యుద్ధానికి ముందునాటి 2.3 కోట్ల దేశ జనాభాలో సగం మందిని నిర్వాసితులను చేసిన. పలు విదేశీ శక్తులను రానిచ్చిన సుమారు 14 ఏళ్ల అంతర్యుద్ధం తరువాత అస్సద్ దేశంపై తన పట్టును కోల్పోయిన వేగానికి రాజధాని వాసుల్లో అనేక మంది దిగ్భ్రమ చెందారు.
రాజధానిలో వేడుకల వెల్లువ
డమాస్కస్‌లో క్రమంగా తెల్లవారుతుండగా, జనం నగరంలోని మసీదుల్లో ప్రార్థనలకు సమీకృతమై, కూడల్లలో వేడుకలు చేసుకుంటూ, ‘భగవంతుడు మహోన్నతుడు’ అని నినదించారు. ప్రజలు అస్సద్ వ్యతిరేక నినాదాలు కూడా చేశారు, కారు హారన్లు మోగించారు. బహు శా భద్రత బలగాలు వదలివేసిన తుపాకులను యు వకులు చేతబూని గాలిలోకి కాల్పులు జరిపారు. వేడుకలకు దిగిన జనం రక్షణ మంత్రిత్వశాఖ కార్యాలయం ఉన్న నగర మధ్యంలోని ఉమయ్యాద్ కూడలిలో సమీకృతమయ్యారు. పురుషులు గాలిలోకి ఆనందంతో తుపాకులు కాల్చారు., అస్సద్ ప్రభుత్వం ముందునాటి, విప్లవకారులు ఆమోదించచిన మూడు నక్షత్రాల సిరియన్ ప తాకాన్ని కొందరు గాలిలో ఊపసాగారు. అక్కడికి కొన్ని కిలో మీటర్ల దూరంలో సిరియన్లు అధ్యక్ష ప్రాసాదాన్ని చుట్టుముట్టి, పదవీచ్యుతుడైన అధ్యక్షుని చిత్రపటాలను చించివేశారు. జవాన్లు, పోలీసు అధికారులు తమ స్థావరాలు వదలి పారిపోయారు. లూటర్లు రక్షణ మంత్రిత్వశాఖలోకి చొరబడ్డారు. అధ్యక్ష ప్రాసాదంలో కుటుంబాలు నడయాడుతుండడాన్ని డమాస్కస్ నుంచి వీడియోలు చూపాయి. వారిలో కొందరు కంచాలు, ఇతర గృహోపయోగ వస్తువులు తీసుకువెళ్లడం కనిపించింది. ‘నేను శనివారం రాత్రి అంతా నిద్ర పోలేదు, ఆయన పతనం వార్త వినేంత వరకు నిద్రించడానికి నిరాకరించాను’ అని విద్యుత్ రంగంలో పని చేస్తుండే 44 ఏళ్ల మొహమ్మద్ అమెర్ అల్‌ఔలాబీ చెప్పారు. ‘ఇద్లిబ్ నుంచి డమాస్కస్ వరకు వారికి (ప్రతిపక్ష బలగాలకు) కొన్ని రోజులు మాత్రమే పట్టింది, భగవంతునికి ధన్యవాదాలు. మమ్మల్ని గర్వించేలా చేసిన వారికి, సాహస సింహాలకు దైవం ఆశీస్సులు అందజేయుగాక’ అని ఆయన అన్నారు. కాగా, చారిత్రకంగా ప్రభుత్వానికి అనుకూమైన సిరియాకు చెందన అల్ వతన్ దినపత్రిక ‘మేము సిరియా కోసం కొత్త పేజీ ఎదుర్కొంటున్నాం. మరింత రక్తపాతం లేకుండా చేసినందుకు భగవంతునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. సిరియా అందరు సిరియన్ల కోసమే అని మేము భావిస్తున్నాం, విశ్వసిస్తున్నాం’ అని రాసింది. గతంలో ప్రభుత్వ ప్రకటనలు ప్రచురించినందుకు మీడియా సిబ్బందిని నిందించరాదని దినపత్రిక సూచించింది. ‘మేము ఉత్తర్వులు పాటించాం, వారు మాకు పంపిన వార్తలు ప్రచురించాం’ అని పత్రిక తెలిపింది. ‘అది తప్పు అని ఇప్పుడు స్పష్టమైంది’ అని అది పేర్కొన్నది. అస్సద్‌కు చెందిన అలవైట్ తెగ నుంచి వచ్చిన ఒక ప్రకటన ‘ప్రశాంతంగా, హేతుబద్ధంగా, నిజాయతీగా ఉండండి. మన దేశ సమైక్యతను దెబ్బ తీసే వ్యవహారాల్లోకి దిగకండి’ అని యువ సిరియన్లకు పిలుపు ఇచ్చింది.
అస్సద్ ఆచూకీ తెలియదు
ప్రతిపక్షానికి ‘చేయూత ఇచ్చేందుకు’, పరివర్తన ప్రభుత్వానికి తన విధుల బదలీకి ప్రభుత్వం సిద్ధమని సిరియా ప్రధాని మొహమ్మద్ ఘాజీ జలాలీ ఒక వీడియో ప్రకటనలో తెలియజేశారు. అస్సద్, రక్షణ శాఖ మంత్రి ఎక్కడ ఉన్నారో తనకు తెలియదని ప్రధాని జలాలీ ఆతరువాత సౌదీ టెలివిజన్ నెట్‌వర్క్ ‘అల్ అరబియా’తో చెప్పారు. శనివారం రాత్రి పొద్దుపోయిన తరువాత అస్సద్‌తో సంబంధాలు తెగిపోయాయని ఆయన తెలిపారు. కాగా, అస్సద్ ఆదివారం డమాస్కస్ నుంచి విమానంలో బయలుదేరినట్లు సిరియన్ మానవ హక్కుల పరిశీలన సంస్థకు చెందిన రామీ అబ్దుర్‌రెహ్మాన్ ‘ఎపి’ వార్తాసంస్థతో చెప్పారు. అస్సద్‌పై యుద్ధ నేరాల ఆరోపణలు ఉన్నాయి. రాజధాని శివార్లలో 2013లో రసాయన ఆయుధాలతో దాడి సహా యుద్ధం సమయంలో మానవాళిపై నేరాలకు పాల్పడినట్లు అస్సద్‌పై ఆరోపణలు వచ్చాయి. కాగా,అస్సద్‌కు తిరుగులేని మద్దతుదారు అయిన ఇరాన్ నుంచి ఈ పరిణామంపై వెంటనే ఎటువంటి వ్యాఖ్యా రాలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News