Monday, January 13, 2025

ఒక నియంత అనివార్య పతనం

- Advertisement -
- Advertisement -

సిరియాను ఒక నియంతవలె పాలించిన బషార్ అల్ అస్సద్, ప్రజల తిరుగుబాటు ధాటికి పతనమయ్యాడు. నియంతల రాజ్యం ఈ విధంగా కుప్పకూలటం తరచు జరిగేదే. కాని అది సిరియాలో జరిగిన తీరు, మెరుపు వేగం యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరచింది. తిరుగుబాటు మొదలైంది నవంబర్ 27న. అప్పటి నుంచి కేవలం 11 రోజులు గడిచి 12వ రోజు డిసెంబర్ 8వ తేది ఉదయం అయ్యే సరికి రాజధాని డమాస్కస్ తిరుగుబాటుదారుల వశమైంది. అధ్యక్షుడు అస్సద్ జాడ లేకుండా పోయాడు. ఈ వేగం నిజంగా నమ్మశక్యం కానిది. ఈ పరిణామం ఒక చిన్న దేశంలో జరిగి ఉంటే వేరుగా ఉండేది. కాని సిరియా పెద్ద దేశాలలో ఒకటి. అయినప్పటికీ ఈ విధంగా జరిగిందంటే అందుకు బలమైన కారణాలున్నాయి. వాటిలో అన్నింటి కన్న ప్రధానమైనది అస్సద్ నియంతృత్వం.
అస్సద్ తండ్రి హఫీజ్ అల్ అస్సద్ కూడా 30 సంవత్సరాల పాటు నియంత వలెనే పాలించినా, బషార్ అల్ అస్సద్ నియంతృత్వం హద్దులు మీరిపోయింది. దేశంలో చమురు నిల్వలు, తగినన్ని సారవంతమైన భూములు, తక్కువ జనాభాయే ఉన్నప్పటికీ ప్రజల వెనుకబాటుతనం, భూస్వామ్య వర్గాలు, ఇతర ధనిక వర్గాల దోపిడీ, తీవ్రమైన అసమానతలు ప్రజల అసంతృప్తికి మూల కారణాలయ్యాయి. విచిత్రమేమంటే, అస్సద్ కుటుంబం నడిపే రాజకీయ పార్టీ పేరు బాతిస్ట్ సోషలిస్ట్ పార్టీ. నామమాత్రంగా కొన్ని భూసంస్కరణలైతే చేపట్టింది. తాము సెక్యులర్ అని కూడా చెప్పుకుంది. కాని, ఆసియా, ఆఫ్రికా, దక్షిణ అమెరికాలలో ఇదే తరహా సిద్ధాంతాలను ప్రకటించుకున్న పలు ప్రభుత్వాల తరహాలోనే, ఆచరణలో మాత్రం ఆ లక్షణాలను చూపలేదు.
అది చాలదన్నట్లు, బాతిస్ట్ పార్టీని మాత్రమే చట్టబద్ధం చేసితక్కిన వాటికి అవకాశం లేకుండా చేశారు. ప్రజలలో ఒకవైపు వెనుకబాటుతనం వల్ల, మరొక వైపు ప్రజాస్వామిక స్వేచ్ఛ లేకపోవటం కారణంగా తలెత్తసాగిన వ్యతిరేకతలపై నిరంతరం నిఘా, ఆ నిరసన ఏ మాత్రం బయటకు కన్పించినా తీవ్రమైన నిర్బంధాలు, చట్టబద్ధమైన కేసులూ, విచారణలూ లేకుండా ఏళ్ల తరబడి జైళ్లలో పెట్టటం, వారిపై హింస, ఆ కారణంగా లెక్కలేనన్ని మరణాలు సర్వసాధారణమైపోయాయి. ఆ పరిస్థితులలో వేలాది మంది ఇతర దేశాలకు పారిపోయారు. సిరియా మొత్తం జనాభాయే ఆ దశలో రెండు కోట్ల లోపునుండగా ఈ నిర్భంధాలు, వలసలతో దేశ సామాజిక, ఆర్థిక స్థితిగతులు బలహీనపడుతూపోయాయి. అయినప్పటికీ అస్సద్ తను, తన వర్గాల వారి ప్రయోజనాలు, తన అధికార పరిరక్షణ అనే లక్షాలతో విధానాలను మాత్రం మార్చుకోలేదు. అటువంటి వైఖరే చివరకు ఈ రోజున ఆయనను ప్రజా గ్రహంతో అధికార భ్రష్టుడిని చేసింది.
ఇక్కడ గమనించదగిన మరొక విశేషం ఉంది. నియంతృత్వం, పేదరికం, అవినీతి, బంధుప్రీతి వంటి ధోరణులకు వ్యతిరేకంగా ‘అరబ్ స్ప్రింగ్’ పేరిట అరబ్ దేశాలలో ప్రజల తిరుగుబాట్లు 201012లో జరగటం, కొన్ని చోట్ల ప్రభుత్వ పతనాలు తెలిసిన విషయమే. ఆ విధంగా ట్యునీషియాలో మొదట తలెత్తిన తిరుగుబాటు లిబియా, ఈజిప్టు, యెమెన్, బహ్రెయిన్‌తో పాటు సిరియాకు కూడా వ్యాపించింది. అపుడు ఇతర అరబ్ దేశాలలోవలె సిరియాలోనూ ప్రజలు కేవలం ప్రజాస్వామిక సంస్కరణలను, అభివృద్ధిని కోరుతూ శాంతియుతంగా ఉద్యమించబూనారు. కాని 1970 ప్రాంతం నుంచి దేశాన్ని తమ కుటుంబ పాలనతో నియంతృత్వ రాజ్యంగా నడుపుతుండిన అస్సద్ వంశీకునికి ఇది ఎంత మాత్రం సరిపడలేదు. సిరియాలో అరబ్ స్ప్రింగ్ 2011లో, ఈసారి కూడా తిరుగుబాటు మొదలైన వాయవ్య ప్రాంతపు అలెప్పో నగరంలోనే త లెత్తింది. అప్పటి శాంతియుతమైన నిరసనను అస్సద్ నిరంకుశంగా అణచివేశాడు. ఆ ఉద్యమం అప్పటికైతే అణగిపోయింది గాని, ప్రజల ఆకాంక్షలు నివురుగప్పిన నిప్పువలె కొనసాగుతూనే వచ్చాయి.
ప్రస్తుత సాయుధ తిరుగుబాటుకు నాయకత్వం వహించిన అబూ మొహమ్మద అల్ జవ్లానీ, ఆయన సంస్థ హయాత్ తహరీర్ అల్ షామ్ (హెచ్‌టిఎస్) అప్పటి అరబ్ స్ప్రింగ్ నుంచే పుట్టుకురావటం గమనించదగ్గది. అయితే, ఆ ప్రాంతంతో పాటుగా, తూర్పున కుర్డ్‌లు, ఉత్తర, దక్షిణాలలో ఇతర అల్పసంఖ్యాక జాతులు కూడా ఇదే విధమైన సమస్యలతో ఉన్నాయి. ఇందుకు చివరిగా మతం తోడైంది. సిరియాలో 74 శాతం సున్నీలు కాగా, షియాలు 13 శాతం. షియాలలోని వేర్వేరు తెగలలోని అల్వాయీ అనే ఒక తెగకు చెందినవాడు అస్సద్. ఇతరత్రా ప్రజల నిరసనకు ఈ పరిస్థితి కూడా తోడవటంతో అబూ జవ్లానీ, అరబ్ స్ప్రింగ్‌ను అస్సద్ అణచివేయటంతో 2012లో మతాన్ని ఆధారం చేసుకుంటూ నుస్రా ఫ్రంట్‌ను స్థాపించి, దానిని అల్ కాయిదాకు అనుబంధంగా మార్చాడు. దానితో అమెరికా, ఇతర పాశ్చాత్య దేశాలు, చివరకు ఐక్య రాజ్యసమితి కూడా దానిని టెర్రలిస్టు సంస్థగా ప్రకటించాయి. ఆ స్థితిలో ఆబూ జవ్లానీ, అమెరికాను ఎదిరించి నిలవటం తమకు సాధ్యం కాదంటూ అల్ కాయిదా సంబంధాలను 2016లో తెంచి వేసుకున్నాడు.
తమ లక్షమంతా అస్సద్ నియంతృత్వాన్ని కూలదోయటం, దేశంలోని అన్నివర్గాలకు ప్రాతినిధ్యం ఇస్తూ, సకల జనుల అభివృద్ధి, సంక్షేమాల కోసం కృషి చేయటం, ప్రజాస్వామిక సంస్కరణలని ఆ దశలో ప్రకటించిన అబూ జవ్లానీ, ఇపుడు తిరుగుబాటు విజయవంతమైన స్థితిలోనూ అదే మాట చెప్పాడు. వెంటనే అన్ని జైళ్లలోని ఖైదీల విడుదల ప్రారంభించాడు. అస్సద్‌పై దేశవ్యాప్తంగా కూడా, అదే విధంగా సైన్యంలోనూ వ్యతిరేకతలు ఉన్నందునే తిరుగుబాటు ఇంత ఊహించని వేగంతో తన లక్షాన్ని సాధించిందనాలి. మరొక వైపు ఆ వెంటనే ప్రజల హర్షాతిరేకాలను, పొరుగు దేశాలకు వలస పోయినవారు కొద్ది గంటలలోనే తిరిగి వస్తుండటాన్ని గమనించినపుడు, అందరూ అబూ జవ్లానీని, ఆయన సంస్థను అస్సద్ నియంతృత్వానికి ప్రత్యామ్నాయంగా భావిస్తున్నట్లు అర్ధమవుతున్నది.
సిరియా అంతర్గత పరిణామాలు ఈ విధంగా ఆహ్వానించదగినట్లు ఉండగా, ఇక అంతర్జాతీయ శక్తులు ఏ వైఖరి తీసుకోవచ్చునన్నది గమనించవలసిన విషయమవుతున్నది. సిరియా పశ్చిమాసియా ప్రాంతాంలో ఒకవైపు మధ్యధరా సముద్రాన్ని, తక్కిన వైపుల తుర్కియే, ఇరాక్, జోర్డాన్, లెబనాన్, ఇజ్రాయెల్‌లను ఆనుకుని, ఇరాన్‌కు సమీపంలో ఉంటుంది. దీనిని బట్టి అది వ్యూహాత్మకంగా ఎంత కీలక ప్రదేశంలో ఉందో చెప్పనక్కరలేదు. అందువల్లనే అక్కడ రష్యా, ఇరాన్, తుర్కియే, ఇరాక్, ఇజ్రాయెల్‌లో పాటు అమెరికా క్రీడలు ప్రత్యక్షంగా, పరోక్షంగా సాగుతూ వస్తున్నాయి. రష్యా అక్కడి సోకాల్డ్ సోషలిస్టు పార్టీ ద్వారా మంచి పనులైతే చేయించలేదు గాని, ఇరాన్‌తో కలిసి ఆయుధ సరఫరాలు, సైనిక జోక్యంతో అస్సద్ ప్రభుత్వాన్ని కాపాడుతూ వస్తున్నది. కాని, అటు ఉక్రెయిన్ యుద్ధం, ఇటు గాజా, లెబనాన్ పరిణామాల మధ్య ఈ సారి ఏమీ చేయలేమని బోధపడి చేతులు ఎత్తేశాయి. అయినా ఎవరూ తమ ప్రయోజనాలను, జోక్యాలను వదలుకునేందుకు సిద్ధంగా లేరని అస్సద్ ప్రభుత్వ పతనానికి ముందు వెనుకలుగా వారు చేసిన ప్రకటనలు, తీసుకుంటున్న చర్యలు సూచిస్తున్నాయి.
అస్సద్ దేశాన్ని వదలి 24 గంటలు తిరగక ముందే ఇజ్రాయెల్ సిరియా సరిహద్దు భాగాలను ఆక్రమించింది. సిరియా ఇస్లామిస్టు తీవ్రవాదుల చేతికి లభించరాదంటూ దేశమంతాటా ఆయుధాగారాలపై, స్థావరాలపై వందలాది దాడులు ఆరంభించింది. మరొక వైపు అమెరికా సైతం దాడులు సాగిస్తున్నది. సిరియా వంటి కీలక ప్రాంతంలో తమ ప్రయోజనాలు దెబ్బ తినకూడదనే ఆలోచనతో రష్యా ఇరాన్, టర్కీలు కొత్త నాయకత్వంతో దౌత్యపరమైన సంప్రదింపులు ఆరంభించాయి. పరిపాలనను క్రమంగా చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తున్న తిరుగుబాటుదారులు ఈ విదేశీ సవాళ్లను ఎట్లా ఎదుర్కొనగలరో చూడవలసి ఉంటుంది.

టంకశాల అశోక్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News