Monday, November 25, 2024

రాజకీయ నిర్ణయంతోనే వ్యవస్థలో మార్పు

- Advertisement -
- Advertisement -

విద్యార్ధులు సమాజానికి మూల స్థంభాలు : మంత్రి కొప్పుల
ఉత్తమ విద్యార్ధులకు ల్యాప్ ట్యాప్ ల పంపిణీ

మన తెలంగాణ / హైదరాబాద్ : రాజకీయ నిర్ణయంతోనే వ్యవస్థలో మంచి మార్పు వస్తుందని రాష్ట్ర ఎస్‌సి అభివృద్ధి, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. విద్యార్దులు విద్యతో పాటు సమాజం., రాజకీయాలపై దృష్టి సారించాలన్నారు. విద్యార్ధులు సమాజానికి మూల స్థంబాల లాంటి వారని ఆయన చెప్పారు. తెలంగాణ సచివాలయంలో గురువారం తన చాంబర్ లో సిఓఇ ( కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్సీ) విద్యార్ధులకు మంత్రి కొప్పుల ఈశ్వర్ ల్యాప్ ట్యాప్ లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలే విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తాయని గుర్తించాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం విద్యా రంగంలో అనేక మార్పులు తెచ్చిందని, ముఖ్యమంత్రి కెసిఆర్ ముందు చూపుతో ఏ రాష్ట్రంలో లేని విధంగా గురుకుల విద్యావిధానాన్ని అభివృద్ధి చేశారని చెప్పారు.

ముఖ్యంగా ఎస్‌సి, ఎస్‌టి విద్యార్ధులు విద్యకు దూరం కాకుండా ఉండేందుకు అధిక ప్రాధాన్యత కల్పించిన విషయాన్ని అందరు గమనించాలన్నారు. తెలంగాణ గురుకుల పాఠశాలల్లో చదివిన విద్యార్ధులు ఐఐటి, నీట్, ట్రిపుల్ ఐటిల్లో సీట్లు సాధించారన్నారు. 2022-23 సంవత్సరంలో ఐఐటిలో 62 మంది, నీట్, ట్రిపుల్ ఐటిల్లో 113 మంది విద్యార్ధులు, ఎంబిబిఎస్ 205 మంది, ఇంజనీరింగ్ కాలేజీల్లో ఎనిమిది వందల మంది విద్యార్ధులు సీట్లు సాధించారని వెల్లడించారు. గతంలో ఒక్క కాలేజీ ఆఫ్ ఎక్సలెన్సీ(సిఓఈ) ఉండగా తెలంగాణ ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన తర్వాత వాటి సంఖ్యను 38కి పెంచిందని చెప్పారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పిన ప్రకారం విద్యార్ధుల భవిష్యత్తు వారి చేతుల్లోనే ఉంటుందని, ప్రతి విద్యార్ధి మంచి విద్యావంతునిగా ఎదగాలని ఆకాంక్షించారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న విద్యావిధానాలు ఇతర రాష్ట్రాల ప్రతినిధుల బృందం సైతం వచ్చి పరిశీలించి వెళుతున్నారని చెప్పారు.

తమ తమ రాష్ట్రాల్లోనూ కాలేజీ ఆఫ్ ఎక్సలెన్సీ విధానం అమలు చేసేందుకు చర్యలు చేపడుతున్నాయని చెప్పారు. ఇది తెలంగాణ ప్రభుత్వానికే గర్వకారణమన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న మౌళిక వసతులు విద్యార్ధులు సద్వినియోగం చేసుకొని మంచి ప్రయోజకులుగా ఎదగాలని, తెలంగాణకు ప్రత్యేక గుర్తింపు తీసుకురావాలన్నారు. ఇప్పటికే గురుకుల విద్యాలయాల్లో చదువుకున్న మారుమూల పల్లెల విద్యార్ధులు ఎందరో ఉన్నత స్థాయిలో ఉన్నారని కొనియాడారు. గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న వారికి అందుబాటులోనే గురుకుల పాఠశాలలు ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని చెప్పారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్ధులను మంత్రి అభినందించారు. ఈ కార్యక్రమంలో గురుకుల విద్యాసంస్థల కార్యదర్శి డాక్టర్ నవీన్ నికోలస్, సాంఘీక సంక్షేమ శాఖ అడిషనల్ డైరెక్టర్ హన్మంత్ నాయక్, ఓఎస్ డి రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News