Wednesday, January 22, 2025

నష్ట నివారణ చర్యలను చేపట్టిన టి-కాంగ్రెస్

- Advertisement -
- Advertisement -

రెబల్స్‌గా పోటీ చేస్తున్న వారిని బుజ్జగించాలని అధిష్టానం ఆదేశం
టికెట్‌లు రాని అసంతృప్తులతో మాణిక్‌రావ్ ఠాక్రే భేటీ
రెబల్స్ వేసిన నామినేషన్లను ఉపసంహరించుకోవాలని వినతి
రానున్న రోజుల్లో కీలక పదవులను అప్పగిస్తామని హామీ

మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నష్ట నివారణ చర్యలకు రంగం సిద్ధం చేసింది. రెండో, మూడు, నాలుగో జాబితాలో టికెట్లు దక్కని నేతలను బుజ్జగించే పనిని జాతీయ, రాష్ట్ర నాయకత్వం చేపట్టింది. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జీ మాణిక్‌రావ్ ఠాక్రే నేతృత్వంలో టికెట్ రాని నేతలతో ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో మంగళవారం భేటీ అయ్యారు. ఇందులో ప్రధానంగా సూర్యాపేట, బోథ్, వైరాతో పాటు పలు నియోజకవర్గాలకు చెందిన టికెట్ రాని నేతలకు ఆయన పిలిపించుకొని మాట్లాడారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు బుధవారం (నేటి)తో ముగియనుండటంతో తిరుగుబాటు అభ్యర్థులను కాంగ్రెస్ నాయకత్వం బుజ్జగించే పనిలో పడింది. ఈ మేరకు హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో ఆ పార్టీ నేతలతో ఠాక్రే సమావేశమయ్యారు.

కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జీ మాణిక్‌రావ్ ఠాక్రే , నాయకులు విష్ణునాథ్, మహేశ్ కుమార్ గౌడ్‌లు తిరుగుబాటు అభ్యర్థులతో ఉదయం నుంచి భేటీ అయ్యారు. అందులో సూర్యాపేట, బోథ్, వైరా, ఇబ్రహీంపట్నం, ఆదిలాబాద్, వరంగల్ వెస్ట్, నర్సాపూర్ ఇలా రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 15 నియోజకవర్గాల్లో తిరుగుబాటు చేసిన అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్‌కు పిలిపించుకుంది. ఒక్కొక్కరిని పిలిచి మాణిక్‌రావ్ ఠాక్రే మాట్లాడారు. నామినేషన్లు వెనక్కి తీసుకోవాలని వారికి సూచించారు. నేటితో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియనుండగా తిరుగుబాటు చేసిన వారు తగ్గుతారా, లేదంటే పోటీకి సిద్ధమవుతారా? అనేది పోటీ ఉన్న కాంగ్రెస్ అభ్యర్థుల్లో ఆందోళనకు గురిచేస్తోంది.

పార్టీ కోసం పనిచేసినా మాకు గుర్తింపు లేదు..!
కాంగ్రెస్ నాలుగు విడతల్లో అభ్యర్థులను ప్రకటించింది. అయితే ఈ జాబితాలో టికెట్ దక్కని కాంగ్రెస్ అభ్యర్థులు బహిరంగంగానే కాంగ్రెస్ అధిష్టానంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. గాంధీభవన్‌కు వెళ్లి టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నిరసన గళం విప్పారు. ఇలా టికెట్ రాని నేతలంతా రెబల్స్‌గా దిగారు. దీంతో కాంగ్రెస్ నాయకత్వం అప్రమత్తమై వారితో మాట్లాడింది. ఇలా దాదాపు 15 నియోజకవర్గాలకు చెందిన వారిని బుజ్జగించే పనిలో కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. ఎక్కువ మంది ఇతర పార్టీల నుంచి చేరిన వారికే టికెట్లు ఇచ్చారని ఇన్నాళ్లు పార్టీ కోసం పని చేసిన తమకు ఎలాంటి గుర్తింపు లేదని వారు మాణిక్‌రావ్ ఠాక్రే ఎదుట తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొదటి జాబితాలో అందరూ మాజీ నాయకులే టికెట్‌లు కేటాయించడంతో ఆశావహులు పెద్దగా స్పందించలేదు. కానీ రెండో జాబితా ప్రకటించినప్పుడే పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. ఆ 45 మందితో రెండో జాబితా వచ్చినప్పటి దగ్గర నుంచి టికెట్లు రాని నేతలు అసమ్మతి నేతలు గళం వినిపిస్తు న్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ కూడా ఇంత పెద్ద ఎత్తున నిరసనలు వస్తాయని ముందుగా ఊహించలేదు. అందుకే నామినేషన్ల గడువు ముగిసే లేపు నష్ట నివారణ చర్యలకు పూనుకుంది.

అధిష్టానం ఆదేశాలతో రంగంలోకి ఠాక్రే…
నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసేలోపే దిద్దుబాటు చర్యలు చేపట్టాలని అధిష్టానం ఠాక్రేకు సూచించడంతో ఆయన రంగంలోకి దిగారు. బరి నుంచి వారిని తప్పుకునేలా అసంతృప్తులతో ఆయన చర్చలు జరిపారు. నామినేషన్లు రిజెక్ట్ అయినా, ఉపసంహరించుకున్నా వారి ద్వారా నియోజకవర్గంలో ఓట్లు దూరం కాకుండా, చీలిక రాకుండా ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ ముందుజాగ్రత్త చర్యలు మొదలుపెట్టింది. ఇందులో టికెట్ రాని అసంతృప్తులు కొద్దిమంది స్వతంత్ర అభ్యర్థులుగా పోటీచేస్తుంటే మరికొందరు ఫార్వార్డ్ బ్లాక్ లాంటి పార్టీ టికెట్ తరఫున పోటీచేస్తున్నారు.

రెబల్ అభ్యర్థుల వివరాలు ఇలా…
ఇప్పటివరకు కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడ్డ రెబల్ అభ్యర్థులుగా బరిలో ఉన్నవారి వివరాలు ఇలా ఉన్నాయి. సూర్యాపేట నుంచి పటేల్ రమేశ్ రెడ్డి, ఆదిలాబాద్ నుంచి సంజీవ్ రెడ్డి, బోథ్ నుంచి వెన్నెల అశోక్, నరేష్ జాదవ్‌లు, వరంగల్ వెస్ట్ నుంచి జంగా రాఘవ రెడ్డి, నర్సాపూర్ నుంచి- గాలి అనిల్ కుమార్, ఇబ్రహీంపట్నం నుంచి దండెం రాంరెడ్డి, డోర్నకల్ నుంచి నెహ్రు నాయక్, పాలకుర్తి నుంచి జంగా రాఘవరెడ్డి, బండి సుధాకర్ గౌడ్, జుక్కల్ నుంచి సౌదాగర్ గంగారం, బాన్సువాడ నుంచి కాసుల బాలరాజు, షాద్‌నగర్ నుంచి విష్ణువర్ధన్ రెడ్డిలు ఉన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News