మైనంపల్లికి, ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్‌లకు మొండిచేయి?
పార్టీలో చేరే వారు రెండు టికెట్‌లు ఆశించడంపై అధిష్టానం అసంతృప్తి
మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాలు హస్తిన కేంద్రంగా రసవత్తరంగా మారుతున్నాయి. అభ్యర్థుల కసరత్తుపై అధిష్టానం ఫోకస్ పెట్టడంతో కీలక నేతలంతా ఢిల్లీలోనే మకాం వేశారు. ఫస్ట్ లిస్ట్ కోసం అభ్యర్థుల ఎంపిక ప్రక్రియపై స్పీడ్ పెంచిన కాంగ్రెస్ అధిష్టానం ఇప్పటికే కొలిక్కి వచ్చిన 70 వరకు స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించడానికి సిద్ధమవుతుండగా, మరో వైపు కొత్తగా పార్టీలో చేరే నేతలు ఒక్కొక్కరుగా ఢిల్లీ బాట పడుతుండటంతో టి కాంగ్రెస్ రాజకీయం అంతా ఢిల్లీ అన్నట్లుగా సాగుతోంది. అయితే ప్రస్తుతం పార్టీలో చేరేందుకు చాలామంది ఆసక్తి చూపుతుండడంతో వారిలో ఎంతమందికి టికెట్ దక్కుతుందో తెలియని పరిస్థితి నెలకొంది.
ఈ కోవలోనే మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్‌లు ఉన్నారు. ప్రస్తుతం వీరి రెండు టికెట్‌లను అడుగుతుండడంతో కాంగ్రెస్ పార్టీలో సందిగ్ధత నెలకొంది. అసలు వీరికి ఒక టికెట్ ఇచ్చే విషయమై పార్టీలో చర్చలు జరుగుతుండగా అదనంగా మరో టికెట్ కావాలని అడగడంతో వారిని ఎలా దారికి తెచ్చుకోవాలో తెలియక కాంగ్రెస్ పార్టీ నాయకులు పునరాలోచనలో పడ్డట్టుగా తెలిసింది. ఈ నేపథ్యంలోనే పార్టీలో చేరే వారితో పాటు పార్టీ టికెట్ ఆశిస్తున్న వారు చలో ఢిల్లీ అంటూ అక్కడే మకాం వేయడంతో ఈ విషయమై త్వరగా నిర్ణయం తీసుకోవాలని కాంగ్రెస్ అధిష్టానం సైతం స్క్రీనింగ్ కమిటీకి సూచించినట్టుగా తెలిసింది.
చర్చనీయాంశంగా మారిన వ్యవహారం
బిఆర్‌ఎస్‌లో టికెట్ ఆశించి భంగపడిన ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్, తనతో పాటు తన కుమారుడికి టికెట్ ఆశిస్తుండగా, మైనంపల్లి హనుమంతరావు, నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం వంటివారు కాంగ్రెస్‌లో చేరికపై చర్చల కోసం ఢిల్లీకి చేరుకుంటున్నారు. వీరిలో మైనంపల్లి హనుమంతరావు, రేఖానాయక్‌లు తమ కుటుంబానికి రెండేసి టికెట్లు ఆశిస్తున్నారు. దీంతో వీరి వ్యవహారం కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. దీంతో రేఖానాయక్, మైనంపల్లిల చేరిక వ్యవహారం హాట్ టాపిక్ అవుతోంది. ముఖ్యంగా తన కుమారుడికి టికెట్ దక్కకపోవడంతోనే బిఆర్‌ఎస్‌కు గుడ్‌బై చెప్పిన మైనంపల్లికి కాంగ్రెస్‌లోనూ రెండు టికెట్లు రావని తెలిస్తే పరిస్థితి ఏమిటన్నది ఆసక్తిగా మారింది. అయితే వీరితో పాటు పలువురు కాంగ్రెస్ సీనియర్ నాయకులు రెండు టికెట్‌లను ఆశిస్తుండడంతో అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్న దానిపై కాంగ్రెస్ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
మైనంపల్లి, రేఖానాయక్ ఫ్యామిలీపై ఉదయ్‌పూర్ డిక్లరేషన్ !
ఒక కుటుంబానికి ఒక్కటే టికెట్ ఇవ్వాలని ఉదయ్‌పూర్‌లో చేసి తీర్మానంపై టి కాంగ్రెస్‌లో ఇప్పటికే చర్చ కొనసాగుతోంది. ఈ విషయంలో పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి వర్గం వర్సెస్ సీనియర్ల వర్గం మధ్య గతంలో మాటల యుద్ధం సైతం నడిచింది. గతంలో జరిగిన సమావేశంలోనూ ఉదయ్‌పూర్ డిక్లరేషన్ అంశాన్ని రేవంత్‌రెడ్డి తెరమీదకు తీసుకురావడంతో ఈ విషయమై ఉత్తమ్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. తాజాగా మైనంపల్లి ఫ్యామిలీ కాంగ్రెస్‌లో చేరుతారన్న ప్రచారం వేళ మరోసారి రెండు టికెట్ల పంచాయతీ తెరమీదకు వస్తోంది. దీంతో మైనంపల్లి, రేఖానాయక్ ఫ్యామిలీతో పాటు మిగతా వారిపై ఉదయ్‌పూర్ డిక్లరేషన్ ఎఫెక్ట్ ఎలా ఉండబోతున్నది సస్పెన్స్‌గా మారింది.