దేశంలో అతిపెద్ద భవనం, ప్రపంచంలోనే రెండో పెద్ద ఇంక్యుబేటర్‌గా నిలువనుంది : మంత్రి కెటిఆర్ ట్వీట్
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర ఇన్నోవేషన్ ఎకో సిస్టమ్ మణిహారమైన టి-హబ్ రెండో దశ ప్రారంభానికి సిద్ధం అయింది. త్వరలో అందుబాటులోకి రానున్న ఈ భవనం దేశంలోనే అతిపెద్దది కానుంది. ప్రపంచంలో రెండో పెద్ద ఇంక్యుబేటర్‌గా టి-హబ్ నిలవనుంది. ఈ విషయాన్ని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ ఆదివారం తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. చాలా కాలంగా ఎంతో ఆత్రుతతో ఎదురుచూస్తున్న ఈ ఇంక్యుబేటర్ నూతన భవనం నిర్మాణం దాదాపుగా పూర్తి కావొచ్చిందని ఆయన పేర్కొన్నారు. 3.5 లక్షల చదరపు అడుగుల విశాలమైన విస్తీర్ణంలోని టి-హబ్ నూతన భవనం నిర్మింతమైందన్నారు. ఇది సుమారు 2వేలకు పైగా అంకురాలకు కేంద్రంగా నిలవనుందన్నారు. రెండవ దశ టిహబ్ అందుబాటులోకి రావడం ద్వారా రాష్ట్ర ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్ మరింత బలపడుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అంకురాలకు చేయూతనిచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా టిహబ్ విహబ్, డేటా సెంటర్, టి..వర్క్ వంటి వినూత్న ఇంక్యుబేటర్లను ఏర్పరిచిందన్నారు. ఇటీవల పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ సైతం రాష్ట్ర ఇన్నోవేషన్ ఎకోసిస్టంలో భాగమైన టిహబ్, రాష్ట్ర డేటా సెంటర్‌ను సందర్శించి సంతృప్తిని వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.