Monday, December 23, 2024

జూలై మొదటి వారంలో టి టిడిపి బస్సు యాత్ర

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : తెలుగుదేశం పార్టీ పునర్ నిర్మాణం.. పూర్వ వైభవం లక్ష్యంగా జూలై మొదటి వారంలో బస్సు యాత్రను ప్రారంభించనున్నట్లు ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ వెల్లడించారు. పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి నాయకులతో రూట్మ్యాప్ ఖరారుపై చర్చించిన తర్వాత బస్సు యాత్ర షెడ్యూల్ను ప్రకటిస్తామని చెప్పారు. గురువారం ఎన్టీఆర్ భవన్లో మల్కాజ్‌గిరి , మహబూబాబాద్ పార్లమెంటు నియోజకవర్గాల ముఖ్య నాయకులతో జ్ఞానేశ్వర్ సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కాసాని జ్ఞానేశ్వర్ మాట్లాడుతూ.. సాధారణ ఎన్నికలు ఎంతో దూరంలో లేవని, పార్టీ శ్రేణులను ఏకతాటిపైకి తీసుకువచ్చి గెలుపు కోసం శ్రమించాలని పార్టీ నేతలను ఆదేశించారు. ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో విజయం సాధించడం ద్వారా పార్టీకి పూర్వవైభవం తీసుకువచ్చేందుకు జూలై మొదటివారంలో టిడిపి ఆధ్వర్యంలో బస్సు యాత్రను చేపడుతున్నామన్నారు. టిఆర్‌ఎస్ బిఆర్‌ఎస్ గా మారినాక అధికార పార్టీ పట్ల ప్రజా వ్యతిరేకత బాగా పెరుగుతోందని, రాబోయే రోజుల్లో ఆ పార్టీ గెలిచే అవకాశాల్లేవన్నారు. టిడిపి నాయకులు, కార్యకర్తలు అంతటా సమిష్టిగా కృషి చేస్తే బస్సు యాత్ర విజయవంతం అవుతుందన్నారు.

తెలంగాణ వ్యాప్తంగా బస్సు యాత్ర విజయవంతమైతే పార్టీకి మంచి ఊపు రావడం తధ్యమని, తద్వారా వచ్చే ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపుకు దోహదపడతుందన్నారు. వాస్తవానికి తెలంగాణలో టీడీపీ ఇప్పటికీ బలోపేతంగా ఉందన్నారు. పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు ప్రజా తీర్పును, కేడర్ నమ్మకాన్ని వమ్ము చేసి అధికార పార్టీలోకి ఫిరాయించి మోసం చేశారని విమర్శించారు. వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాల కోసం ముఖ్య నేతలు పార్టీని వీడటంతో కొన్నేళ్లుగా నిస్తేజంలో ఉన్న పార్టీ శ్రేణులు ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమం ద్వారా ఉత్సాహంతో ఉరకలేస్తున్నాయని అన్నారు.

తాను టి టిడిపి పగ్గాలు చేపట్టిన తర్వాత క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడానికి 96 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమం ప్రారంభించి పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహాం నింపామన్నారు. పార్టీ కేడర్ సమరోత్సాహాంతో ఖమ్మంలో బహిరంగసభను పెద్ద ఎత్తున విజయవంతం చేశారని, అదే ఊపులో హైదరాబాద్‌లో పార్టీ అవిర్భావ సదస్సు సైతం దిగ్విజయం కావడంతో తెలంగాణ వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీకి మరలా ప్రజల మద్దతు పెరుగుతూ వస్తోందని జ్ఞానేశ్వర్ అన్నారు. వచ్చే ఎన్నికలకు సన్నద్ధమయ్యేందుకు రాష్ట్ర, పార్లమెంటు, నియోజకవర్గ, మండల, డివిజన్ స్థాయిల్లో పార్టీ కమిటీలను పునర్ వ్యవస్థీకరించడం జరుగుతుందన్నారు. పార్లమెంటు అధ్యక్షులు, అసెంబ్లీ కో-ఆర్డినేటర్ల నియామకం తర్వాత వీలైనంత త్వరగా మండల, డివిజన్ కమిటీల నియామకం పూర్తిచేయాలని ఆదేశించారు. అలాగే అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పూర్తి స్థాయిల్లో ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు. పార్టీ నుంచి బయటకు వెళ్లి తిరిగి వచ్చేందుకు సిద్ధంగా ఉన్న ఇతర పార్టీల నాయకులను సైతం పార్టీలో చేర్చుకునేందుకు సిద్ధంగా ఉండాలని పార్టీ నేతలకు కాసాని సూచించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News