Thursday, January 23, 2025

టి టిడిపి అభ్యర్థులు వారం రోజుల్లో ఫైనల్ ?!

- Advertisement -
- Advertisement -

ఇప్పటికే కీలక నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఖరారు..
ఇతర పార్టీల్లో టిక్కెట్లు రాని వారికి తమ పార్టీలో అవకాశం ?

మన తెలంగాణ / హైదరాబాద్ : వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు అధికార పార్టీ బిఆర్‌ఎస్ తమ అభ్యర్థులను ప్రకటించడంతో రాజకీయ పార్టీల దృష్టి ప్రస్తుతం తమ తమ పార్టీ అభ్యర్థుల ఎంపికపైనే కేంద్రీకృతమవుతోంది. అటు ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థుల ఖరారుపై నిన్న, మొన్నటి నుండి ‘ వడపోత’ కార్యక్రమాల్లో నిమగ్నమవగా టి టిడిపి కూడా తమ అభ్యర్థుల పేర్లపై ముమ్మర కసరత్తు చేస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీగా తెలుగుదేశం పార్టీకి ఒక చరిత్ర ఉంది. రాష్ట్ర ఆవిర్భావం అనంతరం కాస్త పార్టీ నేతలు అక్కడా ఇక్కడా చేరిపోవడంతో టిడిపి దాదాపు తెరమరుగు అయ్యింది. ఈ క్రమంలో అధినేత చంద్రబాబు నాయుడు నూతన నాయకత్వానికి పార్టీ పగ్గాలు చేతికి ఇచ్చి తెలంగాణలో తిరిగి పూర్వవైభవం తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు తన సహజ స్వభావానికి భిన్నంగా దూకుడైన రాజకీయం చేస్తున్నారు. తెలంగాణలో అభ్యర్థుల ప్రకటనకు సంబంధించి కాసానిని తన ఇంటికి పిలుచుకుని అభ్యర్థుల ఎంపికపై పావులు కదుపుతున్నారు. అటు కాసాని కూడా ఇప్పటి వరకు 50 నియోజకవర్గాల సమీక్షలు నిర్వహించి అభ్యర్థుల జాబితాలను త్వరలోనే తమరి దృష్టికి తీసుకువస్తామని అధినేత చంద్రబాబుకు తెలిపారు.
వారం రోజుల్లో టి టిడిపి అభ్యర్థుల ఫైనల్ !
బిఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు తమ అభ్యర్థు ప్రకటనపై ముందుకు వెళ్లున్న క్రమంలో టి టిడిపి కూడా తమ అభ్యర్థుల పేర్లను కేవలం వారం రోజుల్లోనే ఫైనల్ చేయబోతోంది. ఇప్పటి వరకు 50 మంది పేర్లను అధినేత చంద్రబాబుకు పంపిన ఆ పార్టీ మిగతా అభ్యర్థులను కూడా ఎవరిని ఎంపిక చేస్తే బావుంటుందని అధినేతనే అడిగినట్లు చెబుతున్నారు. ఈ క్రమంలో అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల ఎంపిక కోసం అధినేత చంద్రబాబు నాయుడు ఏడు గురు సభ్యులతో టి టిడిపి కమిటీని నియమించారు. ఈ కమిటీలో తెలంగాణ పార్టీ అధ్యక్షులు కాసానితో పాటు పోలిట్ బ్యూరో సభ్యులు రావుల చంద్రశేఖర రెడ్డి, కంభం పాటి రామమోహన రావు, అరవింద్ కుమార్ గౌడ్, బక్కని నర్సింహులు, పార్టీ సీనియర్ నేతలు నర్సిరెడ్డి, కాశీనాథ్‌లు ఉన్నారు. ఎన్నికల్లో పోటీకి ఆసక్తి చూపే వారి నుండి దరఖాస్తుల స్వీకరించి పరిశీలన చేసిన తరువాత వారి పేర్లను జాతీయ అధ్యక్షునికి నివేదించనున్నారు. దాని ఆధారంగానే చంద్రబాబు నాయుడు ఈ మేరకు టి టిడిపి తరఫున ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల పేర్లను వారం రోజుల్లోనే ప్రకటన చేయనున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఇతర పార్టీల నుండి టిక్కెట్లు రాని వారికి ఛాన్స్
ఉప్పల్‌లో బిఆర్‌ఎస్ టిక్కెట్ రాని భేతి సుభాష్ రెడ్డి లాంటి వారు ఏడు మంది వరకు అధికార పార్టీలో ఉన్నారని, వీరు ప్రస్తుతం ఇతర పార్టీల్లో చేరే ఛాన్స్ ఎక్కువగా ఉండడంతో వారిని తమ పార్టీలోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని టి టిడిపి వర్గాలు చెబుతున్నాయి. తెలుగుదేశం పార్టీ, ఎన్‌టిఆర్ ఆశయాలకు అనుగుణంగా పని చేసే వారైతేనే తప్ప వారిని చేర్చుకోబోమని, తీరా ఎన్నికై మళ్లీ తిరిగి అధికార పార్టీలో చేరితే కూడా ఏమీ చేయలేమని, ఇప్పటికే తమ పార్టీ నుండి ఎన్నికైన ఇద్దరు ఎంఎల్‌ఏలు అధికార పార్టీకి మారిపోయారని వారు గుర్తు చేస్తున్నారు. భేతి సుభాష్ రెడ్డికి ఇతర పార్టీల్లో కంటే కూడా టి టిడిపిలో చేరేందుకే ఎక్కువ ఛాన్స్ ఉంటుందని..బిజెపిలోకి మారాలన్నా.. అక్కడ ఇప్పటికే మాజీ ఎంఎల్‌ఏ ఎన్‌విఎస్‌ఎస్ ప్రభాకర్ లాంటి వారు ఉన్నారని టి టిడిపి నేతలు చెబుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News