Sunday, January 19, 2025

75 మందితో టి టిడిపి జాబితా సిద్ధం!

- Advertisement -
- Advertisement -

ములాఖత్‌లో బాబుతో కలిసి అభ్యర్థుల ప్రకటన
అభ్యర్థుల ప్రకటన రోజునే మేనిఫెస్టో విడుదల కూడా
బాబు వచ్చి ప్రకటన చేస్తాడనే ఇన్నాళ్లు నిరీక్షణ

మన తెలంగాణ / హైదరాబాద్ : అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాపై తెలంగాణ తెలుగుదేశం పార్టీ ముమ్మర కసరత్తు చేస్తోంది. ఇప్పటి వరకు 70 నుండి 75 మంది జాబితా సిద్ధం అయిందని, రేపో మాపో ములాఖత్‌లో అధినేత చంద్రబాబును కలిసి అభ్యర్థులను ప్రకటిస్తామని తెలంగాణ తెలుగుదేశం పార్టీ స్పష్టం చేస్తోంది. మూడు రోజుల క్రితం వరకు తొలి జాబితాలో 30 మంది పేర్లను ఖరారు చేసుకున్నామని, రెండో జాబితాలో మరో సారి బాబును కలిసి ఈ సారి మొత్తం 75 మంది పేర్లను ప్రకటిస్తామని చెబుతోంది. తమ పార్టీ నుండి తాజాగా పోలిట్ బ్యూరో సభ్యులు రావుల చంద్రశేఖర రెడ్డి బిఆర్‌ఎస్‌లో చేరడంపైనా ఆ పార్టీ ఆచీతూచి స్పందిస్తూ త్వరలోనే స్పందిస్తామని చెబుతోంది. తమ అధినేత చంద్రబాబు విడుదలపై గత కొద్ది రోజులుగా ఆ పార్టీ నేతలు ఆశగా ఎదురు చూస్తున్నారు. అయితే ఏసిబి కోర్టు ఒక వైపు ఆయన విడదలపై ఆలస్యం చేస్తుండగా సుప్రీం కోర్టు కూడా వచ్చే నెల 9కి కేసును వాయిదా వేసింది. దీంతో రెండో సారి ములాఖత్‌కు వెళ్లి కలిసి అభ్యర్థుల ప్రకటన వచ్చేలా చూడాలని టి టిడిపి కార్యాచరణ రూపొందించుకుంటోంది. నామినేషన్లు దాఖలుకు ఇంకా సమయం ఉందని, ఈ లోగానే చంద్రబాబును కలిసి అభ్యర్థుల పేర్లు ప్రకటించుకుంటామని టి టిడిపి అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ పేర్కొంటున్నారు.
అభ్యర్థుల ప్రకటన రోజే మేనిఫెస్టో కూడా
కాగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల పేర్లను అధినేత చంద్రబాబు ఓకే చేసిన రోజునే పార్టీ మేనిఫెస్టోను కూడా ప్రకటించాలని ఆ పార్టీ నిర్ణయం తీసుకుంది. బిఆర్‌ఎస్, బిజెపి , కాంగ్రెస్ సహా పలు పార్టీలు తమ మేనిఫెస్టోలను ప్రకటించిన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ కూడా ఆ స్థాయిలోనే మేనిఫెస్టో ఉండేలా చూసుకుంటోంది. రైతులు, కూలీలు, యువత, గ్రామీణ ప్రాంత వారికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తున్నట్లు ఆ పార్టీ నేతలు చెబుతుండడం గమనార్హం. ఉమ్మడి రాష్ట్రంలో టిడిపి ప్రకటించిన మేనిఫోస్టోను కూడా ఒక సారి పరిగణనలోకి తీసుకున్నాకే తుది జాబితాను సిద్ధం చేసి అధినేతతో ఓకే చేయించుకుంటామని టి టిడిపి ప్రకటిస్తోంది. బిఆర్‌ఎస్ సహా అన్ని పార్టీలను ఈ సారి ధీటుగా ఎదుర్కొంటామని టి టిడిపి చెబుతోంది.
బాబు వచ్చి ప్రకటన చేస్తాడనే ఇన్నాళ్లు…
కాగా ఏదో రకంగా అధినేత చంద్రబాబు జైలు నుండి బయటికి వస్తే ఆయన చేతుల మీదుగానే అభ్యర్థుల ప్రకటన వచ్చేలా చేస్తామని గత కొద్ది రోజులుగా చెబుతున్న టి టిడిపి ప్రస్తుతం ఇంకొన్ని రోజులు వేచి చూద్దామా? లేక ఆలస్యమైతే పార్టీ టికెట్ ఆశిస్తున్న ఆశావహులు ఇతర పార్టీల వైపు చూస్తారా? అన్న సందేహంలో ఆ పార్టీ సతమతమవుతోంది. పార్టీ సీనియర్ నేత, పోలిట్ బ్యూరో సభ్యులు రావుల చంద్రశేఖర రెడ్డి బిఆర్‌ఎస్‌లో చేరుతారని కలలో కూడా అనుకోలేదని, అధినేత చంద్రబాబును కొందరు ఓ కేసులో ఇరికించడంతో రావుల లాంటి వారు పార్టీ పరిస్థితిపై బెంగపెట్టుకుంటున్నారని కొందరు కామెంట్లు చేస్తుండడం గమనార్హం. మొత్తంగా 30 మంది అభ్యర్థులను ఒక సారి ప్రకటించి, మిగతా వారిని రెండో జాబితాలో ప్రకటిస్తారని కొందరు చెబుతుండగా.. కాదు కాదు.. తొలి విడతగానే 70 లేదా 75 మందిపేర్లను చంద్రబాబు తొలి విడతలోనే ప్రకటిస్తారని మరి కొందరు చెబుతున్నారు. ఏతా వాతా మొత్తంగా 75 మంది పోటీ చేయడమైతే పక్కా అని ఇంకొందరు చెబుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News