Sunday, January 19, 2025

భారత్ కు ‘ఎదురుందా?’

- Advertisement -
- Advertisement -

T20 match between India vs West Indies

కోల్‌కతా: వెస్టిండీస్‌తో బుధవారం జరిగే తొలి ట్వంటీ 20 మ్యాచ్‌కు టీమిండియా సమరోత్సాహంతో సిద్ధమైంది. ఇటీవల ముగిసిన వన్డే సిరీస్‌ను 30తో క్లీన్‌స్వీప్ చేసిన రోహిత్ శర్మ సేన జోరుమీదుంది. మూడు మ్యాచ్‌ల టి 20 సిరీస్‌లోనూ అదే సంప్రదాయాన్ని కొనసాగించాలనే పట్టుదలతో ఉంది. అయితే కీలక ఆటగాళ్లు గాయం వల్ల దూరం కావడం టీమిండియాకు కాస్త ఇబ్బంది కలిగించే అంశంగా చెప్పాలి. ఇక గాయంతో చివరి రెండు వన్డేలకు దూరమైన వెస్టిండీస్ కెప్టెన్ కీరన్ పోలార్డ్ టి20 సిరీస్ బరిలోకి దిగనున్నాడు. ప్రస్తుతం అతను గాయం నుంచి పూర్తిగా కోలుకున్నాడు. అతను తొలి టి20లో ఆడతాడని విండీస్ జట్టు యాజమాన్యం సంకేతాలు ఇచ్చింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.

రోహితే కీలకం..

ఇక ఈ సిరీస్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ జట్టుకు కీలకంగా మారాడు. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే సత్తా కలిగిన రోహిత్ చెలరేగితే విండీస్ బౌలర్లకు కష్టాలు ఖాయం. రాహుల్ గాయం బారిన పడడంతో రోహిత్ కలిసి ఇషాన్ కిషన్ లేదా రుతురాజ్ గైక్వాడ్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించే అవకాశాలున్నాయి. విండీస్‌తో జరిగిన తొలి వన్డేలో ఇషాన్ కిషన్ ఓపెనర్‌గా దిగిన విషయం తెలిసిందే. అయితే తర్వాతి మ్యాచుల్లో అతనికి ఛాన్స్ రాలేదు. మరోవైపు రుతురాజ్‌ను ఓపెనర్‌గా ఆడించినా ఆశ్చర్యం లేదు.

అందరి కళ్లు విరాట్‌పైనే

మరోవైపు వన్డే సిరీస్‌లో ఘోరంగా విఫలమైన స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లికి ఈ మ్యాచ్ కీలకంగా మారింది. తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టాల్సిన ఒత్తిడి అతనిపై నెలకొంది. కొంతకాలంగా విరాట్ వరుస వైఫల్యాలతో సతమతమవుతున్నాడు. కనీసం టి20 సిరీస్‌లోనైనా సత్తా చాటాలనే పట్టుదలతో ఉన్నాడు. అత్యంత నిలకడైన ఆటకు మరో పేరుగా చెప్పుకునే కోహ్లి కొంత కాలంగా ఆశించిన స్థాయిలో రాణించలేక పోతున్నాడు. అతని వైఫల్యం జట్టుపై బాగానే ప్రభావం చూపుతోంది. ఈసారి కూడా విఫలమైతే రానున్న రోజుల్లో కోహ్లి ఇబ్బందులు మరింత పెరగడం ఖాయం.

తక్కువ అంచనా వేయలేం..

టి20 ఫార్మాట్‌లోనే అత్యంత ప్రమాదకర జట్టుగా పేరున్న వెస్టిండీస్‌ను కూడా తక్కువ అంచనా వేయలేం. విధ్వంసక బ్యాట్స్‌మెన్‌లకు విండీస్‌లో కొదవలేదు. బ్రాండన్ కింగ్, డారెన్ బ్రావో, నికోలస్ పూరన్, ఫాబియన్ అలెన్, షాయ్‌లతో విండీస్ బ్యాటింగ్ చాలా బలంగా ఉంది. అంతేగాక పొలార్డ్, రోస్టన్ ఛేజ్, జేసన్ హోల్డర్ వంటి అగ్రశ్రేణి ఆల్‌రౌండర్లు కూడా జట్టులో ఉన్నారు. వీరికి తోడు డొమినిక్ డ్రేక్స్, అకిల్ హుస్సేన్, హేడెన్ వాల్ష్, ఓడియన్ స్మిత్ వంటి మ్యాచ్ విన్నర్ బౌలర్లు ఉన్న విషయం తెలిసిందే. దీంతో విండీస్ కూడా భారీ ఆశలతో సిరీస్‌కు సిద్ధమైంది.

రిషబ్‌పై భారీ ఆశలు..

సిరీస్‌కు వైస్ కెప్టెన్‌గా ఎంపికైన వికెట్ కీపర్ రిషబ్‌పంత్ కూడా జట్టుకు కీలకంగా మారాడు. విధ్వంసక బ్యాటింగ్‌కు మరో పేరుగా పిలిచే రిషబ్ తన మార్క్ బ్యాటింగ్‌తో చెలరేగితే జట్టుకు భారీ స్కోరు కష్టమేమీ కాదు. అయితే నిలకడలేమి రిషబ్‌కు ప్రధాన అవరోధంగా మారింది. ఆ లోపాన్ని సరిదిద్దు కోవాల్సిన బాధ్యత అతనిపై ఎంతైనా ఉంది. ఇక సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్‌లలో ఎవరికీ తుది జట్టులో స్థానం దక్కుతుందో తేలడం లేదు. చివరి వన్డేలో శ్రేయస్ అద్భుతంగా ఆడాడు. అంతకుముందు మ్యాచ్‌లో సూర్యకుమార్ జట్టుకు అండగా నిలిచాడు. దీంతో తుది జట్టులో స్థానం కోసం ఇద్దరి మధ్య తీవ్ర పోటీ నెలకొంది. కాగా, వెంకటేశ్ అయ్యర్, దీపక్ హుడా, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్ వంటి ఆల్‌రౌండర్లు జట్టుకు అందుబాటులో ఉన్నారు. అంతేగాక సిరాజ్, భువనేశ్వర్, హర్షల్ పటేల్, చాహల్, అవేశ్ ఖాన్‌లతో బౌలింగ్ విభాగం కూడా పటిష్టంగా ఉంది. దీంతో ఈ మ్యాచ్‌లో టీమిండియాకే గెలుపు అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News