Tuesday, December 24, 2024

ఎవరూ గెలిచినా చరిత్రే.. నేడు సౌతాఫ్రికాతో అఫ్గాన్ సెమీస్ పోరు

- Advertisement -
- Advertisement -

ట్రినిడాడ్: టి20 ప్రపంచకప్ సెమీ ఫైనల్ సమరానికి సర్వం సిద్ధమైంది. గురువారం ఉదయం ట్రినిడాడ్ వేదికగా జరిగే తొలి సెమీ ఫైనల్లో అఫ్గానిస్థాన్‌తో సౌతాఫ్రికా తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచే జట్టు ఫైనల్‌కు దూసుకెళుతోంది. ఇప్పటి వరకు ఇరు జట్లు ఒక్కసారి కూడా ప్రపంచకప్‌లో ఫైనల్‌కు చేరలేదు. కానీ ఈసారి తుది పోరుకు దూసుకెళ్లే ఛాన్స్ ఇరు జట్లకు ఉంది. ఇందులో ఏ జట్టుకు అదృష్టం వరిస్తుందో చెప్పలేం. ఈ వరల్డ్‌కప్‌లో ఇటు అఫ్గానిస్థాన్ అటు సౌతాఫ్రికా అసాధారణ ఆటతో అలరించాయి. ఏ మాత్రం అంచనాలు లేని అఫ్గాన్ చిరస్మరణీయ ప్రదర్శనతో తొలిసారి ప్రపంచకప్‌లో సెమీ ఫైనల్‌కు అర్హత సాధించింది.

ఈ క్రమంలో న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ వంటి బలమైన జట్లను అఫ్గాన్ మట్టికరిపించింది. సౌతాఫ్రికాతో జరిగే మ్యాచ్‌లోనూ సత్తా చాటేందుకు సిద్ధమైంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో రెండు జట్లు సమతూకంగా కనిపిస్తున్నాయి. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే ఆటగాళ్లకు ఇరు జట్లలోనూ కొదవలేదు. అఫ్గాన్ ఈ వరల్డ్‌కప్‌లో అంచనాలకు మించి రాణించింది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి పెద్ద జట్లను అలవోకగా ఓడించింది. చివరి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై స్వల్ప లక్ష్యాన్ని సయితం కాపాడుకుని విజయాన్ని అందుకుంది.

ఈ గెలుపు అఫ్గాన్ ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసింది. సౌతాఫ్రికా మరింత మెరుగ్గా రాణించేందుకు ఈ విజయం దోహదం చేస్తుందనడంలో సందేహం లేదు. బ్యాటింగ్‌లో రహ్మనుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్ తదితరులు దూకుడుగా ఆడుతున్నారు. గుర్బాజ్ ఈ వరల్డ్‌కప్‌లో ఏకంగా 281 పరుగలు చేసి అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. జద్రాన్ 229 పరుగులతో మూడో స్థానంలో నిలిచాడు. గుల్బదిన్ నైబ్, మహ్మద్ నబి, అజ్మతుల్లా, కరీం జన్నత్ తదితరులతో అఫ్గాన్ బ్యాటింగ్ బలంగా ఉంది. అంతేగాక రషీద్ ఖాన్, నవీనుల్ హక్, ఫజల్‌హక్ ఫరూకి, నైబ్ వంటి మ్యాచ్ విన్నర్ బౌలర్లు జట్టులో ఉన్నారు. దీంతో ఈ మ్యాచ్‌లో అఫ్గాన్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.

సమరోత్సాహంతో..
మరోవైపు ఈ వరల్డ్‌కప్‌లో సౌతాఫ్రికా అద్భుత ఆటతో అలరిస్తోంది. లీగ్ దశలో ఆడిన నాలుగు మ్యాచుల్లోనూ సఫారీ టీమ్ జయకేతనం ఎగుర వేసింది. సూపర్8లోనూ అజేయంగా నిలిచింది. ఆడిన మూడు మ్యాచుల్లోనూ జయభేరి మోగించింది. ఇంగ్లండ్, వెస్టిండీస్ వంటి బలమైన జట్లను ఓడించి సెమీస్‌కు అర్హత సాధించింది. ఇక అఫ్గాన్‌తో జరిగే పోరులోనూ చెలరేగేందుకు సిద్ధమైంది.

డికాక్, హెండ్రిక్స్, కెప్టెన్ మార్‌క్రమ్, క్లాసెన్, మిల్లర్, జాన్సన్ వంటి అగ్రశ్రేణి ఆటగాళ్లు జట్టులో ఉన్నారు. వీరిలో ఏ ఇద్దరూ నిలదొక్కుకున్నా జట్టుకు విజయం కష్టమేమీ కాదు. ఇక జాన్సన్, మహారాజ్, షంసి, రబడా, నోర్జేలతో బౌలింగ్ కూడా బలంగా ఉంది. అఫ్గాన్‌తో పోల్చితే సౌతాఫ్రికాలో అనుభవజ్ఞులైన ఆటగాళ్లు ఉన్నారు. దీంతో ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికాకే గెలుపు అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News