సెయింట్ విన్సెంట్: టి20 ప్రపంచకప్‌లో అఫ్గానిస్థాన్ జట్టు సెమీ ఫైనల్‌కు చేరుకుంది. ఈ క్రమంలో రషీద్ ఖాన్ సేన నయా చరిత్ర సృష్టించింది. ప్రపంచకప్ వంటి మెగా టోర్నమెంట్‌లో సెమీస్‌కు చేరడం ద్వారా కొత్త రికార్డు నెలకొల్పింది. మంగళవారం బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్ డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో 8 పరుగుల తేడాతో చిరస్మరణీయ విజయం సాధించింది. ఈ గెలుపుతో అఫ్గాన్ సెమీస్‌కు దూసుకెళ్లగా బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా జట్లు ఇంటిదారి పట్టాయి. తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 115 పరుగులు చేసింది. తర్వాత వర్షం రావడంతో బంగ్లాదేశ్ టార్గెట్‌ను 19 ఓవర్లలో 114 పరుగులుగా నిర్ధారించారు. అయితే వర్షం వల్ల పిచ్ ప్రతికూలంగా మారడంతో బంగ్లాదేశ్ ఈ స్వల్ప లక్ష్యాన్ని సయితం ఛేదించలేక పరాజయం చవిచూసింది.
బంగ్లాదేశ్ 17.5 ఓవర్లలో 105 పరుగులకే కుప్పకూలింది. స్వల్ప లక్షంతో బ్యాటింగ్ చేపట్టిన బంగ్లాదేశ్‌కు ఆరంభంలోనే కష్టాలు మొదలయ్యాయి. ఓపెనర్ తంజీద్ హసన్ ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. కొద్ది సేపటికే కెప్టెన్ నజ్ముల్ హసన్ షాంటో (5) కూడా ఔటయ్యాడు. ఆ వెంటనే స్టార్ ఆటగాడు షకిబ్ అల్ హసన్ కూడా వెనుదిరిగాడు. షకిబ్ ఖాతా కూడా తెరవలేదు. దీంతో బంగ్లాదేశ్ 23 పరుగులకే మూడు వికెట్లను కోల్పోయింది. ఒకవైపు వికెట్లు పడుతున్నా ఓపెనర్ లిటన్ దాస్ తన పోరాటాన్ని కొనసాగించాడు.
అయితే ఇతర బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. సౌమ్య సర్కార్ (10), తౌహిద్ హృదయ్ (14) మాత్రమే రెండంకెల స్కోరును అందుకున్నారు. మహ్మదుల్లా (6), రిశాద్ హుస్సేన్ (0), తంజీమ్ హసన్ సాకిబ్ (3), తస్కిన్ అహ్మద్ (2), ముస్తఫిజుర్ రహ్మాన్ (0)లు విఫలమయ్యారు. ఒంటరి పోరాటం చేసినలిటన్ దాస్ 49 బంతుల్లో ఐదు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 54 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అఫ్గాన్ బౌలర్లలో నవీనుల్ హక్ 26 పరుగులు మాత్రమే ఇచ్చి కీలకమైన నాలుగు వికెట్లను పడగొట్టాడు. కెప్టెన్ రషీద్ ఖాన్ కూడా నాలుగు వికెట్లు తీసి జట్టు విజయంలో తనవంతు పాత్ర పోషించాడు.
ఆదుకున్న గుర్బాజ్..
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్‌ను ఓపెనర్ రహ్మానుల్లా గుర్బాజ్ ఆదుకున్నాడు. బంగ్లాదేశ్ బౌలర్లను దీటుగా ఎదుర్కొని స్కోరును ముందుకు నడిపించాడు. అతనికి ఇబ్రహీం జద్రాన్ (18), అజ్మతుల్లా గుల్బదిన్ (10) అండగా నిలిచారు. గుర్బాజ్ భారీ షాట్లకు వెళ్లకుండా సమన్వయంతో బ్యాటింగ్ చేశాడు. ప్రతికూల వాతావరణం వల్ల పిచ్ బౌలింగ్‌కు అనుకూలంగా మారింది. దీంతో పరుగులు చేయడం చాలా కష్టంగా మారింది.
అయితే అద్భుత బ్యాటింగ్‌ను కనబరిచిన గుర్బాజ్ 55 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 43 పరుగులు చేశాడు. చివర్లో కెప్టెన్ రషీద్ ఖాన్ ధాటిగా ఆడాడు. 10 బంతుల్లో 3 సిక్సర్లతో అజేయంగా 19 పరుగులు సాధించాడు. దీంతో అఫ్గాన్ స్కోరు 115 పరుగులకు చేరింది. బంగ్లా బౌలర్లలో రిశాద్ హుస్సేన్ మూడు వికెటలు పడగొట్టాడు. కాగా, అఫ్గాన్ స్వల్ప లక్ష్యాన్ని సయితం కాపాడుకుని సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. సెమీస్‌లో దక్షిణాఫ్రికాతో అఫ్గాన్ తలపడుతుంది.
అంబరాన్నంటిన సంబరాలు..
అఫ్గానిస్థాన్ టీమ్ టి20 ప్రపంచకప్‌లో సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లడంతో జట్టు ఆటగాళ్లు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. మైదానం మొత్తం కలియ తిరుగుతూ సందడి చేశారు. అఫ్గాన్ క్రికెట్ చరిత్రలోనే ఇది అత్యంత పెద్ద విజయంగా చెప్పాలి. గతంలో ఎన్నడూ కూడా అఫ్గాన్ ఐసిసి టోర్నీల్లో సెమీస్‌కు చేరలేదు. తొలిసారి ఈ ఘనత సాధించడంతో అఫ్గాన్ ఆటగాళ్ల ఆనందానికి అవధులు లేకుండ పోయింది.
మ్యాచ్ గెలిచిన వెంటనే ఆటగాళ్లు పెద్ద ఎత్తున సంబరాల్లో మునిగి తేలారు. కెప్టెన్ రషీద్ ఖాన్, సీనియర్ మహ్మద నబితో సహా గుర్బాజ్, గుల్బదిన్, అజ్మతుల్లా, నవీనుల్ హక్‌లతో పాటు సహాయక సిబ్బంది కూడా సంబరాల్లో పాల్గొన్నారు. మరోవైపు అఫ్గాన్‌లో కూడా పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు. తాలిబన్ ప్రభుత్వ పెద్దలు సయితం వేడుకల్లో పాల్గొన్నారు. అఫ్గాన్ టీమ్ సెమీస్‌కు చేరడంతో దేశంలో సందడి వాతావరణం నెలకొంది. మరోవైపు బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్ చూసేందుకు పలు ప్రధాన నగరాల్లో పెద్ద పెద్ద టివి స్క్రీన్‌లను ఏర్పాటు చేశారు. మ్యాచ్ ముగిసిన వెంటనే వేలాది మంది అభిమానులు ఇళ్ల నుంచి బయటకు వచ్చి సంబరాల్లో మునిగి పోయారు.