Sunday, December 22, 2024

ఆత్మవిశ్వాసంతో భారత్.. నేడు ఇంగ్లండ్‌తో సెమీస్ సమరం

- Advertisement -
- Advertisement -

గయానా: టి20 వరల్డ్‌కప్ ట్రోఫీ సాధించాలనే పట్టుదలతో ఉన్న టీమిండియా గురువారం ఇంగ్లండ్‌తో జరిగే రెండో సెమీ ఫైనల్ సమరానికి ఆత్మవిశ్వాసంతో సిద్ధమైంది. సూపర్8లో ఆస్ట్రేలియా, అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్ వంటి బలమైన జట్లను ఓడించి భారత్ సెమీస్‌కు చేరుకుంది. వరుస విజయాలు జట్టు ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేశాయి. ఇక ఇంగ్లండ్‌తో జరిగే సెమీస్‌లోనూ గెలిచి టైటిల్ పోరుకు దూసుకెళ్లాలనే పట్టుదలతో టీమిండియా కనిపిస్తోంది. ఇంగ్లండ్ కూడా విజయమే లక్షంగా పోరుకు సిద్ధమైంది. రెండు జట్లలోనూ ప్రతిభావంతులైన ఆటగాళ్లకు కొదవలేదు. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే బౌలర్లు, బ్యాటర్లు ఇరు జట్లలోనూ ఉన్నారు. దీంతో సెమీస్ సమరం ఆసక్తికరంగా సాగే ఛాన్స్ ఉంది.

కోహ్లి ఈసారైనా..
వరుస వైఫల్యాలతో సతమతమవుతున్న సార్ ఆటగాడు విరాట్ కోహ్లి కీలకమైన ఈ మ్యాచ్‌లోనైనా తన బ్యాట్‌కు పనిచెబుతాడా లేదా అనేది అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది. ఈ వరల్డ్‌కప్‌లో ఇప్పటి వరకు ఏడు మ్యాచ్‌లు ఆడిన కోహ్లి మూడుసార్లు ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. సెమీస్ వంటి కీలక మ్యాచ్‌లో అతను రాణించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే సత్తా కలిగిన కోహ్లి ఇటీవల వరుస వైఫల్యాలు చవిచూస్తున్నాడు. దీంతో అతనిపై విమర్శల వర్షం కురుస్తోంది. ఓపెనర్‌గా కోహ్లి పూర్తిగా నిరాశపరిచాడు. ఇక ఈ మ్యాచ్‌లో అతను ఎలా రాణిస్తాడనేది సందేహమే. మరోవైపు కెప్టెన్ రోహిత్ శర్మ ఆస్ట్రేలియాపై విధ్వంసక ఇన్నింగ్స్‌తో చెలరేగడం జట్టుకు కలిసి వచ్చే అంశంగా చెప్పాలి.

ఈ మ్యాచ్‌లో కూడా జట్టు అతనిపై భారీ ఆశలు పెట్టుకుంది. రోహిత్ తన మార్క్ బ్యాటింగ్‌తో చెలరేగితే ఇంగ్లండ్ బౌలర్లకు కష్టాలు తప్పక పోవచ్చు. రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబె, హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ తదితరులతో టీమిండియా బ్యాటింగ్ చాలా బలంగా ఉంది. ఒక్క విరాట్ తప్ప మిగతా బ్యాటర్లు ఈ వరల్డ్‌కప్‌లో మెరుగ్గానే రాణిస్తున్నారు. ఇది జట్టుకు శుభపరిణామంగా చెప్పాలి. బౌలింగ్‌లోనూ భారత్ బలంగా ఉంది. బుమ్రా, అర్ష్‌దీప్, కుల్దీప్ యాదవ్, హార్దిక్, అక్షర్ పటేల్ తదితరులు మెరుగ్గా బౌలింగ్ చేస్తున్నారు. కీలకమైన సెమీస్‌లోనూ వీరిపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది.

తక్కువ అంచనా వేయలేం..
మరోవైపు ఇంగ్లండ్ టీమ్‌ను కూడా తక్కువ అంచనా వేయలేం. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఇంగ్లండ్ చాలా బలంగా ఉంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే బ్యాటర్లు, బౌలర్లు జట్టులో ఉన్నారు. కెప్టెన్ జోస్ బట్లర్ ఫామ్‌లో ఉండడం ఇంగ్లండ్‌కు అతి పెద్ద ఊరటగా చెప్పాలి. మరో ఓపెనర్ ఫిలిప్ సాల్ట్ కూడా జోరుమీదున్నాడు. జానీ బెయిర్‌స్టో, హారి బ్రూక్, మొయిన్ అలీ, లివింగ్‌స్టోన్‌లతో ఇంగ్లండ్ బ్యాటింగ్ చాలా బలంగా ఉంది. మరోవైపు జోఫ్రా ఆర్చర్, క్రిస్ జోర్డాన్, శామ్ కరన్, టోప్లే, అలీ, రషీద్‌లతో బౌలింగ్ కూడా పటిష్టంగా కనిపిస్తోంది. దీంతో భారత్‌కు ఈ మ్యాచ్‌లో గట్టి పోటీ తప్పక పోవచ్చు.

పొంచి ఉన్న వర్షం ముప్పు..
కాగా, భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగే సెమీ ఫైనల్ మ్యాచ్‌కు వర్షం ప్రమాదం పొంచి ఉంది. మ్యాచ్ జరిగే రోజు వర్షం పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో అభిమానుల్లో ఆందోళన నెలకొంది. వర్షం వల్ల మ్యాచ్ ఓవర్లను కుదిస్తే భారత్‌కు ప్రతికూలంగా మారే ఛాన్స్ ఉంది. అయితే ఎలాంటి పరిస్థితి ఎదురైనా తట్టుకుని ముందుకు సాగాలనే పట్టుదలతో టీమిండియా పోరుకు సిద్ధమైంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News