స్కాట్లాండ్ జోరుకు బ్రేక్.. అఫ్గానిస్థాన్ రికార్డు విజయం
చెలరేగిన ముజీబ్, రషీద్, రాణించిన టాపార్డర్
షార్జా: ట్వంటీ20 ప్రపంచకప్‌లో అఫ్గానిస్థాన్ శుభారభం చేసింది. సోమవారం స్కాట్లాండ్‌తో జరిగిన గ్రూప్2 మ్యాచ్‌లో అఫ్గాన్ 130 పరుగుల తేడాతో రికార్డు విజయాన్ని సొంతం చేసుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసి అఫ్గాన్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన స్కాట్లాండ్ 10.2 ఓవర్లలో కేవలం 60 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయం చవిచూసింది. ఇక క్వాలిఫయింగ్ మ్యాచుల్లో వరుసగా మూడు మ్యాచుల్లో గెలిచి జోరుమీదున్న స్కాట్లాండ్‌కు అఫ్గాన్ కోలుకోలేని షాక్ ఇచ్చింది. క్లిష్టమైన లక్షంతో బ్యాటింగ్‌కు దిగిన స్కాట్లాండ్ ఆరంభంలో బాగానే ఆడింది. ఓపెనర్ జార్జ్ మెరుగైన బ్యాటింగ్‌ను కనబరిచాడు. అయితే సాఫీగా సాగుతున్న స్కాట్లాండ్ ఇన్నింగ్స్‌కు ముజీబుర్ రహ్మాన్ తొలి దెబ్బ తీశాడు. ఓపెనర్ కైల్ కొయెట్జర్ (10)ను ముజీబ్ ఔట్ చేశాడు. ఆ వెంటనే కాలమ్ మెక్‌లాయిడ్, రిచీ బెర్రింగ్టన్‌లను కూడా వెనక్కి పంపాడు. ఇద్దరు కూడా ఖాతా తెరవకుండానే ఔటయ్యారు.ఇక వికెట్ కీపర్ మాథ్యూ క్రాస్ (౦)ను నవీనుల్ ముల్క్ పెవిలియన్ పంపించాడు. ఇక మున్సె రెండు ఫోర్లు, మరో 2 సిక్సర్లతో 25 పరుగులు చేసి ముజీబ్ బౌలింగ్‌లోనే ఔటయ్యాడు. ఆ తర్వాత రషీద్ ఖాన్ వెంటవెంటనే నాలుగు వికెట్లు పడగొట్టాడు. దీంతో స్కాట్లాండ్ ఇన్నింగ్స్ 60 పరుగులకే ముగిసింది. అఫ్గాన్ బౌలర్లలో రషీద్ నాలుగు, ముజీబ్ ఐదు వికెట్లు పడగొట్టాడు.
జజాయి, నజీబుల్లా మెరుపులు..
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గాన్‌కు ఒపెనర్లు మహ్మద్ షాజాద్, హజ్రతుల్లా జజాయి శుభారంభం అందించారు. ధాటిగా ఆడిన జజాయి మూడు సిక్స్‌లు, మూడు ఫోర్లతో 44 పరుగులు చేశాడు.షాజాద్ రెండు ఫోర్లు, సిక్స్‌తో 22 పరుగులు సాధించాడు. ఇక గుర్బాజ్ 4 సిక్సర్లు, ఫోర్‌తో 46 పరుగులు చేయగా, నజీబుల్లా మూడు సిక్స్‌లు, ఐదు బౌండరీలతో వేగంగా 59 పరుగులు చేశాడు. దీంతో అఫ్గాన్ స్కోరు 190 పరుగులకు చేరింది.
T20 World Cup 2021: AFG beat SCO With 130 Runs