విశ్వ సమరానికి సర్వం సిద్ధం.. నేటి నుంచి టి20 వరల్డ్ కప్
తొలి మ్యాచ్‌లో ఒమాన్‌తో పపువా న్యూ గునియా ఢీ
అల్ అమరాత్:పురుషుల ట్వంటీ20 ప్రపంచకప్‌కు ఆదివారం తెరలేవనుంది. ఒమాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ) వేదికగా పొట్టి ప్రపంచకప్ జరుగనుంది. ఆదివారం నుంచి క్వాలిఫయింగ్ మ్యాచ్‌లు జరుగనున్నాయి. శనివారం నుంచి సూపర్12 మ్యాచ్‌లు జరుగుతాయి. అర్హత మ్యాచుల్లో 8 జట్లు పోటీ పడుతున్నాయి. ఈ జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్‌ఎలో ఐర్లాండ్, నెదర్లాండ్స్, శ్రీలంక, నమీబియా జట్లు ఉన్నాయి. గ్రూప్‌ఎలో ఆతిథ్య ఒమాన్‌తో పాటు పపువా న్యూ గునియా, బంగ్లాదేశ్, స్కాట్లాండ్ జట్లు ఉన్నాయి. క్వాలిఫయింగ్ దశలో మొత్తం 12 మ్యాచ్‌లు జరుగుతాయి. ప్రతి గ్రూప్ నుంచి అగ్రస్థానంలో నిలిచి రెండేసి జట్లు సూపర్12కు అర్హత సాధిస్తాయి. ఇక మరో 8 జట్లు నేరుగా ఈ దశకు చేరుకున్నాయి. ఇందులో పాల్గొనే జట్లను రెండు గ్రూపులుగా విడదీశారు. గ్రూప్1లో ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఇంగ్లండ్, వెస్టిండీస్ జట్లతో పాటు అర్హత మ్యాచుల్లో గెలిచే రెండు జట్లు ఉంటాయి. ఇక గ్రూప్2లో రెండు క్వాలిఫయింగ్ జట్లతో పాటు భారత్, పాకిస్థాన్, అఫ్గానిస్థాన్, న్యూజిలాండ్ జట్లకు చోటు కల్పించారు. సూపర్12 మ్యాచ్‌లకు దుబాయితో పాటు అబుదాబి, షార్జా నగరాలు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. సూపర్-12లో ప్రతి గ్రూప్ నుంచి రెండేసి జట్లు సెమీఫైనల్‌కు చేరుకుంటాయి. ఫైనల్ పోరు నవంబర్ 14న ఆదివారం దుబాయిలో జరుగుతుంది. ఇక క్వాలిఫయింగ్‌తో పాటు సూపర్12 దశలో మొత్తం 42 మ్యాచ్‌లు జరుగుతాయి. ఇక నాకౌట్‌లో మూడు మ్యాచ్‌లు నిర్వహిస్తారు.
భారీ ఏర్పాట్లు..
ఇక ట్వంటీ20 ప్రంపంచకప్ కోసం భారత క్రికెట్ బోర్డు భారీ ఏర్పాట్లు చేసింది. నిజానికి ఈ వరల్డ్‌కప్ భారత్‌లోనే జరగాల్సి ఉంది. అయితే కరోనా కేసులు తగ్గక పోవడంతో టోర్నమెంట్‌ను ఒమాన్, యుఎఇలకు మార్చారు. క్వాలిఫయింగ్ మ్యాచ్‌లకు ఒమాన్, సూపర్12తో పాటు నాకౌట్ మ్యాచ్‌లకు యుఎఇ ఆతిథ్యం ఇస్తోంది. ఇందు కోసం భారత క్రికెట్ బోర్డు రెండు దేశాలకు చెందిన క్రికెట్ బోర్డులతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇక వరల్డ్‌కప్‌లో పరిమిత సంఖ్యలో అభిమానులకు ప్రవేశం కల్పిస్తున్నారు. కొవిడ్ నిబంధనలకు లోబడి కొంత మందికి మాత్రమే మ్యాచ్‌లను చూసేందుకు అనుమతి ఇస్తారు. కాగా, ఈ వరల్డ్‌కప్‌లో చిరకాల ప్రత్యర్థులు పాకిస్థాన్‌భారత్‌లు ఒకే గ్రూప్‌లో చోటు దక్కించుకున్నాయి. ఇరు జట్ల మధ్య అక్టోబర్ 24న పోరు జరుగనుంది. దుబాయి ఈ మ్యాచ్‌కు వేదికగా నిలువనుంది. ఇక గ్రూప్2లో టీమిండియాకు రెండు జట్లతోనే గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉంది. పాకిస్థాన్, న్యూజిలాండ్‌లు మాత్రమే బలమైన జట్లుగా ఉన్నాయి. అఫ్గానిస్థాన్‌తో పాటు క్వాలిఫయింగ్ మ్యాచ్‌ల ద్వారా అర్హత సాధించే జట్లను ఓడించడం టీమిండియాకు పెద్ద కష్టం కాకపోవచ్చు. అయితే గ్రూప్1లో మాత్రం హోరాహోరీ సమరం ఖాయంగా కనిపిస్తోంది. డిఫెండింగ్ చాంపియన్ వెస్టిండీస్, మాజీ విజేత ఇంగ్లండ్‌లతో పాటు సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా వంటి అగ్రశ్రేణి జట్లు ఈ గ్రూప్‌లో ఉన్నాయి. దీంతో నాకౌట్‌కు అర్హత సాధించేందుకు గ్రూప్‌లోని జట్లు తీవ్రంగా శ్రమించక తప్పదు. మరోవైపు బంగ్లాదేశ్, శ్రీలంక జట్లు ప్రపంచకప్‌కు నేరుగా అర్హత సాధించడంలో విఫలమయ్యాయి. క్వాలిఫయింగ్ మ్యాచుల్లో మెరుగైన ప్రదర్శన చేస్తేనే ఈ జట్లకు సూపర్-12కు అర్హత సాధించే అవకాశాలుంటాయి.
T20 World Cup 2021 Begins with Oman vs New Guinea