అఫ్గానిస్థాన్ ఓటమి.. పాక్‌కు మూడో విజయం
రాణించిన బాబర్, ఆసిఫ్ మెరుపులు
దుబాయి: ప్రపంచకప్‌లో పాకిస్థాన్ వరుసగా మూడో విజయం నమోదు చేసింది. శుక్రవారం ఆసక్తికరంగా సాగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ ఐదు వికెట్ల తేడాతో అఫ్గానిస్థాన్‌ను ఓడించింది. ఈ గెలుపుతో పాక్ సెమీస్ బెర్త్‌ను దాదాపు ఖరారు చేసుకుందనే చెప్పాలి. ముందుగా బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్ 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్ 19 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది.
ఆదుకున్న బాబర్..
ఊరిస్తున్న లక్షంతో బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ 8 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. అప్పటికీ పాక్ స్కోరు 12 పరుగులు మాత్రమే. ఈ దశలో ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లే బాధ్యతను కెప్టెన్ బాబర్ ఆజమ్ తనపై వేసుకున్నాడు. అతనికి ఫకర్ జమాన్ అండగా నిలిచాడు. భారీ షాట్ల జోలికి వెళ్లకుండా ఇద్దరు సమన్వయంతో ఆడారు. ఒకవైపు వికెట్‌ను కాపాడుకుంటూనే చెత్త బంతులను మాత్రమే బౌండరీలుగా మలిచారు. ఇద్దరు కలిసి రెండో వికెట్‌కు 63 పరుగులు జోడించారు. కీలక ఇన్నింగ్స్ ఆడిన జమాన్ రెండు ఫోర్లు, సిక్స్‌తో 30 పరుగులు చేసి ఔటయ్యాడు. తర్వాత వచ్చిన మహ్మద్ హఫీజ్ నిరాశ పరిచాడు. జట్టును ఆదుకుంటాడని భావించిన హఫీజ్ 10 పరుగులు మాత్రమే చేసి వెనుదిరిగాడు. మరోవైపు కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన బాబర్ ఆజమ్ 47 బంతుల్లో నాలుగు ఫోర్లతో 51 పరుగులు చేసి రషీద్ వేసిన అద్భుత బంతికి క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. ఆ వెంటనే షోయబ్ మాలిక్ కూడా ఔటయ్యాడు. ధాటిగా ఆడిన మాలిక్ ఒక ఫోర్, సిక్స్‌తో 19 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు.
ఇక ఇన్నింగ్స్ 18 ఓవర్‌ను నవీనుల్ హక్ అద్భుతంగా వేశాడు. రెండు పరుగులు మాత్రమే ఇచ్చి కీలకమైన మాలిక్ వికెట్‌ను పడగొట్టాడు. దీంతో మ్యాచ్‌లో ఒక్కసారిగా ఉత్కంఠ నెలకొంది. కానీ కరీం జన్నత్ వేసిన 19వ ఓవర్‌లో ఆసిఫ్ అలీ ఆకాశమే హద్దుగా చెలరేగి పోయాడు. వరుస సిక్సర్లతో స్కోరును పరిగెత్తించాడు. విధ్వంసక బ్యాటింగ్‌ను కనబరిచిన ఆసిఫ్ ఏడు బంతుల్లోనే 25 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఈ క్రమంలో జన్నత్ బౌలింగ్‌లో ఏకంగా నాలుగు సిక్సర్లు బాది 24 పరుగులు పిండుకున్నాడు. దీంతో పాక్ మరో ఓవర్ మిగిలివుండగానే విజయాన్ని అందుకుంది. ఆసిఫ్‌కు మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు లభించింది. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గాన్ ఆరంభంలోనే కీలక వికెట్లను కోల్పోయి కష్టాల్లో చిక్కుకుంది. అయితే ఆఖర్లో కెప్టెన్ మహ్మద్ నబి, గుల్బదిన్‌లు మెరుగైన బ్యాటింగ్‌ను కనబరచడంతో అఫ్గాన్ స్కోరు 147 పరుగులకు చేరింది. నబి ఐదు ఫోర్లతో 35 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. మరోవైపు గుల్బదిన్ 4 ఫోర్లు, సిక్స్‌తో అజేయంగా 35 పరుగులు చేశాడు.
T20 World Cup 2021: PAK Beat AFG with 5 wickets