Saturday, November 16, 2024

కివీస్‌తో పాక్ ఢీ..

- Advertisement -
- Advertisement -

T20 World Cup 2021: PAK vs NZ Match Today

దుబాయి: ట్వంటీ20 ప్రపంచకప్‌లో భాగంగా షార్జా వేదికగా మంగళవారం జరిగే మ్యాచ్‌లో పాకిస్థాన్‌-న్యూజిలాండ్ తలపడనున్నాయి. గ్రూప్2లో భాగంగా ఈ మ్యాచ్ జరగనుంది. ఇక చిరకాల ప్రత్యర్థి భారత్‌తో జరిగిన ఆరంభ మ్యాచ్‌లో పాకిస్థాన్ రికార్డు విజయాన్ని సొంతం చేసుకుంది. దీంతో న్యూజిలాండ్‌తో జరిగే మ్యాచ్‌కు సమరోత్సాహంతో సిద్ధమైంది. మరోవైపు కివీస్‌కు ఈ ప్రపంచకప్‌లో ఇదే తొలి మ్యాచ్. దీంతో ఈ మ్యాచ్‌లో గెలిచి ట్రోఫీ వేటకు శ్రీకారం చుట్టాలని కివీస్ తహతహలాడుతోంది. ఇక భారత్‌పై విజయంతో పాకిస్థాన్ ఆత్మవిశ్వాసం రెట్టింపు అయ్యింది. ఆ మ్యాచ్‌లో బ్యాటింగ్, బౌలింగ విభాగాల్లో పాక్ అసాధారణ ఆటను కనబరిచింది. టీమిండియా వంటి బలమైన జట్టును పది వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది. ఈ మ్యాచ్‌లో కూడా మెరుగైన ప్రదర్శన చేయాలనే పట్టుదలతో ఉంది. బాబర్ ఆజమ్, మహ్మద్ రిజ్వాన్, మహ్మద్ హఫీజ్, ఫకర్ జమాన్, షోయబ్ మాలిక్, ఆసిఫ్ అలీ వంటి ప్రతిభావంతులైన బ్యాట్స్‌మన్ జట్టుకు అందుబాటులో ఉన్నారు. అంతేగాక షాహిన్ అఫ్రిది, ఇమాద్ వసీం, హరీస్ రవూఫ్, షాదాబ్ ఖాన్, హసన్ అలీ వంటి మ్యాచ్ విన్నర్లతో బౌలింగ్ విభాగం కూడా బలంగా ఉంది. దీంతో ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. మరోవైపు న్యూజిలాండ్‌లోనూ స్టార్ ఆటగాళ్లకు కొదవలేదు. కెప్టెన్ విలియమ్సన్‌తో పాటు గుప్టిల్, సిఫర్ట్, డేవోన్ కాన్వే, టాడ్ ఆస్ట్‌లే, నిషమ్, సాంట్నర్ వంటి స్టార్ బ్యాట్స్‌మెన్ జట్టులో ఉన్నారు. అంతేగాక టిమ్ సౌథి, బౌల్ట్, ఫెర్గూసన్, జెమీసన్ తదితరులతో బౌలింగ్ కూడా బలంగా ఉంది. దీంతో మ్యాచ్ ఆసక్తికరంగా సాగడం ఖాయం.

ఇరు జట్లకు కీలకం..

మంగళవారం జరిగే మరో కీలక మ్యాచ్‌కు దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ సిద్ధమయ్యాయి. తమ తమ తొలి మ్యాచుల్లో ఘోర పరాజయాలు చవిచూసిన రెండు జట్లకు ఈ మ్యాచ్ కీలకంగా మారింది. ఇందులో గెలిచి వరల్డ్‌కప్‌లో తొలి విజయాన్ని అందుకోవాలనే పట్టుదలతో ఉన్నాయి. ఇంగ్లండ్‌తో జరిగిన ఆరంభ మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ వెస్టిండీస్ 55 పరుగులకే కుప్పకూలింది. ఇక ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి మ్యాచ్‌లో కూడా సౌతాఫ్రికా స్వల్ప స్కోరుకే పరిమితమైంది. ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 118 పరుగులు మాత్రమే చేసింది. దీంతో ఇరు జట్లు కూడా తమ తొలి మ్యాచుల్లో ఓటమి పాలుకాక తప్పలేదు. ఇక విండీస్ అయితే తన టి20 చరిత్రలోనే అత్యంత చెత్త బ్యాటింగ్ ప్రదర్శన చేసింది. లూయిస్, సిమ్మన్స్, హెట్‌మెయిర్, పూరన్, రసెల్, గేల్, పొలార్డ్, బ్రావో వంటి దిగ్గజాలు ఉన్న విండీస్ ఎవరూ ఊహించని రీతిలో 55 పరుగులకే కుప్పకూలింది. ఒక్క గేల్ తప్ప ఎవరూ కూడా కనీసం రెండంకెల స్కోరును కూడా అందుకోలేక పోయారు. దీన్ని బట్టి విండీస్ బ్యాటింగ్ ఏ స్థాయిలో సాగిందో ఊహించుకోవచ్చు. ఇక సౌతాఫ్రికాతో జరిగే మ్యాచ్ వారికి సవాలుగా మారింది. ఈ మ్యాచ్‌లో భారీ స్కోరు సాధించి ఆత్మవిశ్వాసాన్ని తిరిగి పొందాలనే పట్టుదలతో ఉంది. ఓపెనర్లతో పాటు కీలక ఆటగాళ్లందరూ తమ బ్యాట్‌కు పని చెప్పక తప్పదు. పొలార్డ్, గేల్, బ్రావో, రసెల్ తదితరులు తమ స్థాయికి తగ్గ ఆటను కనబరచాలి. అంతేగాక పూరన్, లూయిస్, హెట్‌మెయిర్‌లు కూడా మెరుపులు మెరిపించాలి. బౌలింగ్‌లో రాంపాల్, బ్రావో, అకిల్, మెక్‌కాయ్ తదితరులు తమవంతు పాత్ర పోషించాలి. అప్పుడే ఈ మ్యాచ్‌లో విండీస్ గెలుపు అవకాశాలు మెరుగవుతాయి.
పరీక్షలాంటిదే..

ఇక సౌతాఫ్రికాకు కూడా ఈ మ్యాచ్ పరీక్షగా మారింది. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో బౌలర్లు బాగానే రాణించారు. అయితే ప్రత్యర్థి ముందు ఉంచిన లక్షం మరి చిన్నదిగా ఉండడంతో సౌతాఫ్రికాకు ఓటమి తప్పలేదు. ఈ మ్యాచ్‌లో మాత్రం బ్యాటింగ్ గాడిలో పడాల్సిందే. ఓపెనర్లు డికాక్, బవుమాలతో పాటు డుసెన్, క్లాసెన్, డేవిడ్ మిల్లర్ తదితరులు మెరుగైన బ్యాటింగ్‌ను కనబరచాలి. ఈ మ్యాచ్‌లో మార్‌క్రామ్, డుసెన్‌లు జట్టుకు కీలకంగా మారారు. బౌలర్లు కూడా మరింత మెరుగ్గా రాణించాలి. అప్పుడే సౌతాఫ్రికా ఈ మ్యాచ్‌లో గెలిచే ఛాన్స్ ఉంటుంది.

T20 World Cup 2021: PAK vs NZ Match Today

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News