Friday, November 22, 2024

టీ20 ప్రపంచకప్: కివీస్‌కు ఇంగ్లండ్ షాక్

- Advertisement -
- Advertisement -

బ్రిస్బేన్: సెమీస్ రేసులో నిలువాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ అదరగొట్టింది. ప్రపంచకప్ సూపర్12లో భాగంగా మంగళవారం న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ 20 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో ఇంగ్లండ్ సెమీ ఫైనల్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. తర్వాత లక్షఛేదనకు దిగిన న్యూజిలాండ్ నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్లకు 159 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. క్లిష్టమైన లక్షంతో బ్యాటింగ్ చేపట్టిన న్యూజిలాండ్‌కు ఆశించిన స్థాయిలో శుభారంభం లభించలేదు. ఓపెనర్లు డెవోన్ కాన్వే (3), ఫిన్ అలెన్ (16) విఫలమయ్యారు. అయితే వన్‌డౌన్‌లో వచ్చిన గ్లెన్ ఫిలిప్స్‌తో కలిసి కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఇన్నింగ్స్‌ను కుదుటపరిచాడు. ఇద్దరు జాగ్రత్తగా ఆడుతూ జట్టును లక్షం దిశగా నడిపించారు. విలియమ్సన్ సమన్వయంతో ఆడగా ఫిలిప్స్ దూకుడును ప్రదర్శించాడు. ఈ జోడీని విడగొట్టేందుకు ఇంగ్లండ్ బౌలర్లు చాలా సేపటి వరకు నిరీక్షించాల్సి వచ్చింది. అయితే 3 ఫోర్లతో 40 పరుగులు చేసిన విలియమ్సన్‌ను బెన్ స్టోక్స్ వెనక్కి పంపాడు. కొద్ది సేపటికే జేమ్స్ నిషమ్ (6), డారిల్ మిఛెల్ (3) కూడా ఔటయ్యారు. ఆ వెంటనే గ్లెన్ ఫిలిప్స్ కూడా పెవిలియన్ చేరాడు. కీలక ఇన్నింగ్స్ ఆడిన ఫిలిప్స్ 36 బంతుల్లోనే 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 62 పరుగులు చేశాడు. అతను కీలక సమయంలో ఔట్ కావడంతో కివీస్‌కు ఓటమి తప్పలేదు. ప్రత్యర్థి జట్టు బౌలర్లలో వోక్స్, శామ్ కరన్ రెండేసి వికెట్లు తీశారు.
బట్లర్, హేల్స్ జోరు
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్‌కు ఓపెనర్లు జోస్ బట్లర్, అలెక్స్ హేల్స్ శుభారంభం అందించారు. ఇద్దరు కివీస్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ స్కోరును పరిగెత్తించారు. కీలక ఇన్నింగ్స్ ఆడిన హేల్స్ ఏడు ఫోర్లు, సిక్సర్‌తో 52 పరుగులు చేశాడు. ఈ క్రమంలో తొలి వికెట్‌కు 81 పరుగుల భాగస్వామ్యంలో పాలుపంచుకున్నాడు. కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన బట్లర్ 47 బంతుల్లోనే ఏడు ఫోర్లు, రెండు సిక్సర్లతో 73 పరుగులు సాధించాడు. మిగతావారిలో లివింగ్‌స్టోన్(20) ఒక్కడే రాణించాడు. కివీస్ బౌలర్లు చివరి ఓవర్లలో అద్భుతంగా రాణించడంతో ఇంగ్లండ్ స్కోరు 179 పరుగులకే పరిమితమైంది.

T20 World Cup 2022: NZ beat ENG by 20 runs

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News