అడిలైడ్: టి20 ప్రపంచకప్ సూపర్12లో భాగంగా బుధవారం జరిగే కీలక మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో భారత్ తలపడనుంది. సెమీ ఫైనల్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే ఈ మ్యాచ్‌లో కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి ఇరు జట్లకు నెలకొంది. సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో ఓటమి పాలైన టీమిండియా ఈసారి విజయమే లక్షంగా పెట్టుకుంది. బంగ్లాదేశ్‌ను ఓడించి తిరిగి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాలని భావిస్తోంది. ఇక జింబాబ్వేతో జరిగిన కిందటి మ్యాచ్‌లో విజయం సాధించిన బంగ్లాదేశ్ ఆత్మవిశ్వాసంతో పోరుకు సిద్ధమైంది. అయితే పటిష్టమైన టీమిండియాను ఓడించాలంటే అసాధారణ ఆటను కనబరచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమతూకంగా కనిపిస్తున్న భారత్ ఈ మ్యాచ్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.
రాహుల్ ఈసారైనా?
ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచుల్లోనూ సింగిల్ డిజిట్‌కే పరిమితమైన ఓపెనర్ కెఎల్ రాహుల్ కనీసం ఈసారైనా రాణిస్తాడా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. పేలవమైన బ్యాటింగ్‌తో నిరాశ పరుస్తున్న రాహుల్‌ను తప్పించాలని మాజీ క్రికెటర్లు, అభిమానులు సూచిస్తున్నారు. అయితే మరో ఓపెనర్ లేక పోవడంతో రాహుల్‌ను ఆడించక తప్పడం లేదు. మరోవైపు పలు అవకాశాలు లభిస్తున్నా రాహుల్ మాత్రం దాన్ని సద్వినియోగం చేసుకోలేక పోతున్నాడు. కీలకమైన బంగ్లాదేశ్ మ్యాచ్‌లోనైనా అతను తన బ్యాట్‌కు పనిచెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కెప్టెన్ రోహిత్ శర్మకు కూడా ఈ మ్యాచ్ కీలకంగా మారింది. జట్టును ముందుండి నడిపించాల్సిన బాధ్యత అతనిపై ఉంది. రోహిత్ తన బ్యాట్‌ను ఝులిపిస్తే టీమిండియా బ్యాటింగ్ సమస్యలు చాలా వరకు తీరిపోతాయి.
ఆ ఇద్దరిపైనే భారం
మరోవైపు ఈ మ్యాచ్‌లో టీమిండియా ఆశలన్నీ విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్‌పైనే ఆధారపడ్డాయి. ఇద్దరు ఫామ్‌లో ఉండడం జట్టుకు కలిసి వచ్చే అంశంగా చెప్పాలి. ఇద్దరు నిలకడైన బ్యాటింగ్‌తో జట్టుకు అండగా నిలుస్తున్నారు. అయితే సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో కోహ్లి తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరాడు. దీని ప్రభావం జట్టు బ్యాటింగ్‌పై స్పష్టంగా కనబడింది. ఈ మ్యాచ్‌లో సూర్యకుమార్ ఒక్కడే పోరాటం చేశాడు. కొంతకాలంగా అసాధారణ బ్యాటింగ్‌తో అలరిస్తున్న సూర్య ఈ మ్యాచ్‌లో కూడా చెలరేగాలనే లక్షంతో ఉన్నాడు. ఇక కిందటి మ్యాచ్‌లో గాయం బారిన పడిన దినేశ్ కార్తీక్ ఈ మ్యాచ్‌లో ఆడతాడా లేదా అనేది సందేహంగా మారింది. అతని స్థానంలో రిషబ్ పంత్ బరిలోకి దిగడం ఖాయంగా కనిపిస్తోంది. కాగా, అక్షర్ పటేల్, దీపక్ హుడాలలో ఎవరికీ తుది జట్టులో స్థానం లభిస్తుందో చెప్పలేం. కిందటి మ్యాచ్‌లో బరిలోకి దిగిన హుడా ఖాతా తెరవకుండానే ఔటయ్యాడు. ఈ మ్యాచ్‌లో అతనికి ఛాన్స్ దొరకడం కష్టంగానే కనిపిస్తోంది. ఇదిలావుండగా ఈ మ్యాచ్‌లో హార్దిక్ పాండ్య, భువనేశ్వర్ కుమార్, షమి, అశ్విన్‌లు జట్టుకు కీలకంగా మారారు. వీరు తమ పాత్రను సమర్థంగా పోషిస్తే ఈ మ్యాచ్‌లో భారత్‌కే గెలుపు అవకాశాలు అధికంగా ఉంటాయి.
భారీ ఆశలతో
ఇక ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ కూడా భారీ ఆశలతో బరిలోకి దిగుతోంది. బంగ్లాదేశ్ జట్టులో ప్రతిభావంతులైన క్రికెటర్లకు కొదవలేదు. లిటన్ దాస్, నజ్ముల్ హుస్సేన్, తస్కిన్ అహ్మద్, ముస్తఫిజుర్ రహ్మాన్‌లతో పాటు కెప్టెన్ షకిబ్ ఉండనే ఉన్నారు. వీరిలో ఏ ఇద్దరు రాణించినా టీమిండియాకు ఇబ్బందులు ఖాయం. రెండు జట్లలోనూ ప్రతిభావంతులైన ఆటగాళ్లు ఉండడంతో మ్యాచ్ ఆసక్తికరంగా సాగడం తథ్యంగా కనిపిస్తోంది.
T20 World Cup 2022: IND vs BAN T20 Match Today