Wednesday, January 22, 2025

నేడే దాయా’ఢీ’

- Advertisement -
- Advertisement -

T20 World Cup 2022: IND vs PAK T20 Match today

మెల్‌బోర్న్: టి20 ప్రపంచకప్ సూపర్12లో భాగంగా ఆదివారం జరిగే మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో టీమిండియా తలపడనుంది. కిందటి ప్రపంచకప్‌లో పాకిస్థాన్ చేతిలో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలనే పట్టుదలతో భారత్ పోరుకు సిద్ధమైంది. ఇక పాకిస్థాన్ ఈసారి కూడా పాత ఫలితాన్నే పునరావృతం చేయాలనే లక్షంతో కనిపిస్తోంది. ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టి20 ప్రపంచకప్‌కే ఈ మ్యాచ్ ప్రత్యేక ఆకర్షణగా మారింది. దాయాదుల మధ్య జరిగే పోరుకు సర్వం సిద్ధమై ంది. మెల్‌బోర్న్ వేదికగా జరిగే మ్యాచ్‌కు సంబ ంధించిన టికెట్ల్లలన్నీ అమ్ముడు పోయాయి. దీంతో కిక్కిరిసిన స్టేడియంలో జరిగే సమరం క్రికెట్ ప్రేమీకులను కనువిందు చేయనుంది. అయితే ఈ మ్యాచ్‌కు వరుణుడి ప్రమాదం పొంచి ఉంది. ఆదివారం వర్షం కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ అంశం ఇరు దేశాల అభిమానులను కాస్త కలవరానికి గురిచేస్తోంది. అయితే నిర్వాహకులు మాత్రం ఎలాంటి ఆటంకం లేకుండా మ్యాచ్ సాఫీగా సాగుతుందనే నమ్మకంతో ఉన్నారు.
ఓపెనర్లే కీలకం
ఈ మ్యాచ్‌లో టీమిండియాకు ఓపెనర్లు రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్‌లు కీలకంగా మారారు. ఇటీవల జరిగిన సిరీస్‌లలో వీరిద్దరూ మెరుగైన బ్యాటింగ్‌ను కనబరచడం జట్టుకు కలిసి అంశ ంగా చెప్పాలి. కెప్టెన్ రోహిత్ శర్మపై జట్టును ముందుండి నడిపించాల్సిన బాధ్యత నెలకొంది. రాహుల్‌తో కలిసి మెరుగైన ఆరంభం ఇస్తే జట్టుకు భారీ స్కోరు కష్టమేమీ కాదు. ఇక వైస్ కెప్టెన్ రాహుల్ కూడా తనవంతు పాత్రను సమర్థంగా పోషించక తప్పదు. ఇద్దరు కనీసం సగం ఓవర్ల వరకు క్రీజులో నిలదొక్కుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదే జరిగితే ఈ మ్యాచ్‌లో భారత్‌కు భారీ స్కోరు ఖాయం.
అందరి కళ్లు కోహ్లిపైనే
మరోవైపు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి కూడా జట్టుకు కీలకంగా మారాడు. కొంతకాలంగా తన స్థాయికి తగ్గ బ్యాటింగ్‌ను కనబరచడంలో కోహ్లి విఫలమవుతున్నాడు. ఇలాంటి స్థితిలో వరల్డ్‌కప్ వంటి మెగా టోర్నీలో అతను ఎలా బ్యాటింగ్ చేస్తాడనేది అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది. కోహ్లి తన స్థాయికి తగ్గ బ్యాటింగ్‌ను కనబరిస్తే టీమిండియా బ్యాటింగ్ కష్టాలు చాలా వరకు తీరిపోతాయి. ఇక సూర్యకుమార్ రూపంలో భారత్‌కు మరో మెరుగైన అస్త్రం ఉండనే ఉంది. కొంతకాలంగా సూర్యకుమార్ టి20 ఫార్మాట్‌లో పరుగుల వరద పారిస్తున్నాడు. ఆసియాకప్‌తో సహా ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాలతో జరిగిన సిరీస్‌లలో నిలకడైన బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఈ వరల్డ్‌కప్‌లో కూడా మెరుపులు మెరిపించాలనే పట్టుదలతో ఉన్నా డు. దినేశ్ కార్తీక్, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యలతో భారత బ్యాటింగ్ చాలా బలంగా ఉంది. ఈ ప్రపంచకప్‌లో ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య పాత్ర చాలా కీలకంగా మారింది. అటు బ్యాట్‌తో ఇటు బంతితో మెరుగైన ప్రదర్శన చేయాల్సిన పరిస్థితి అతనికి నెలకొంది.
బౌలింగే అసలు సమస్య
టీమిండియాను బౌలింగ్ సమస్య వెంటాడుతోంది. కీలక బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా గాయంతో ప్రపంచకప్‌కు దూరం కావడంతో బౌలింగ్ కాస్త బలహీనంగా మారింది. అయితే సీనియర్ బౌలర్ మహ్మద్ షమి చేరికతో బౌలింగ్ విభాగం పటిష్టంగానే కనిపిస్తోంది. ఆస్ట్రేలియాతో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో షమి ఒకే ఓవర్‌లో మూడు వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. ఈ మ్యాచ్‌లో కూడా జట్టు అతనిపై భారీ ఆశలు పెట్టుకుంది. భువనేశ్వర్ కుమార్, అర్ష్‌దీప్, అశ్విన్, చాహల్ తదితరులతో బౌలింగ్ విభాగం బాగానే ఉంది. బౌలర్ల తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తే ఈ మ్యాచ్‌లో టీమిండియాకే గెలుపు అవకాశాలు అధికంగా ఉంటాయి.
పోరాటానికి మరో పేరు
ఇక దాయాది పాకిస్థాన్‌ను కూడా తక్కువ అంచనా వేయలేం. భారత్‌తో జరిగే ప్రతి మ్యాచ్‌లోనూ సర్వం ఒడ్డి పోరాడడం పాకిస్థాన్ అలవాటుగా మార్చుకుంది. కిందటి వరల్డ్‌కప్‌లో పాకిస్థాన్ పది వికెట్ల తేడాతో భారత్‌ను చిత్తుగా ఓడించింది. ఈసారి కూడా విజయం సాధించాలనే పట్టుదలతో కనిపిస్తోంది. మహ్మద్ రిజ్వాన్, కెప్టెన్ బాబర్ ఆజమ్, ఫకర్ జమాన్, ఖుష్‌దిల్ షా, ఇఫ్తికార్ అహ్మద్, ఆసిఫ్ అలీ, షాదాబ్ ఖాన్ తదితరులతో బ్యాటింగ్ బలంగా ఉంది. అంతేగాక నసీమ్ షా, షహీన్ అఫ్రిది హారిస్ రవూఫ్, మహ్మద్ నవాజ్ వంటి మ్యాచ్ విన్నర్ బౌలర్లు కూడా జట్టులో ఉన్నారు. దీంతో ఈ మ్యాచ్‌లో టీమిండియా గట్టి పోటీ ఎదురు కావడం ఖాయంగా కనిపిస్తోంది.

T20 World Cup 2022: IND vs PAK T20 Match today

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News