పెర్త్: వరుస ఓటములతో సతమతమవుతున్న పాకిస్థాన్‌కు ఆదివారం పసికూన నెదర్లాండ్స్‌తో జరిగే మ్యాచ్ సవాల్‌గా మారింది. సెమీ ఫైనల్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే ఈ మ్యాచ్‌లో భారీ తేడాతో గెలవాల్సిన పరిస్థితి పాకిస్థాన్‌కు నెలకొంది. టి20 ప్రపంచకప్ సూపర్12 మ్యాచుల్లో పాకిస్థాన్ ఇప్పటి వరకు ఖాతా తెరవనే లేదు. తొలి మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి భారత్ చేతిలో ఓటమి పాలైంది. చివరి బంతి వరకు తీవ్రంగా పోరాడినా పాకిస్థాన్ ఈ మ్యాచ్‌లో పరాజయం తప్పలేదు. ఇక జింబాబ్వేతో జరిగిన కిందటి మ్యాచ్‌లో కూడా పాకిస్థాన్‌కు ఇలాంటి ఫలితమే ఎదురైంది. స్వల్ప లక్ష్యాన్ని సయితం ఛేదించలేక ఒక పరుగు తేడాతో ఓటమి చవిచూసింది. ఇలాంటి స్థితిలో నెదర్లాండ్స్‌తో జరిగే మ్యాచ్ పాకిస్థాన్‌కు చాలా కీలకంగా తయారైంది. కీలక ఆటగాళ్లు మహ్మద్ రిజ్వాన్, బాబర్ ఆజమ్‌లు ఫామ్‌ను కోల్పోవడం జట్టుకు ఇబ్బందికరంగా మారింది. జింబాబ్వే మ్యాచ్‌లో వీరిద్దరు విఫలమయ్యారు. ఇఫ్తికార్ అమ్మద్, షాదాబ్ ఖాన్, హైదర్ అలీ తదితరులు కూడా తమ స్థాయికి తగ్గ బ్యాటింగ్‌ను కనబరచ లేక పోతున్నారు. షాన్ మసూద్ ఒక్కడే కాస్త రాణిస్తున్నాడు. అయితే నెదర్లాండ్స్‌తో జరిగే మ్యాచ్‌లో పాకిస్థాన్‌కే గెలుపు అవకాశాలు అధికంగా ఉన్నాయి. కానీ నెదర్లాండ్స్‌ను కూడా తక్కువ అంచనా వేసే పరిస్థితి లేదు. విక్రమ్‌జీత్ సింగ్, మాక్స్ డౌడ్, బాస్ డి లీడ్, కొలిన్ అకర్‌మాన్, టామ్ కూపర్, టిమ్ ప్రింగల్, కెప్టెన్ ఎడ్వర్డ్‌లతో నెదర్లాండ్స్ బలంగా ఉంది. పాకిస్థాన్ ఏ మాత్రం నిర్లక్షంగా ఆడిన భారీ మూల్యం చెల్లించుకోవడం ఖాయం.
T20 World Cup 2022: PAK vs NED Match Today