Monday, December 23, 2024

మెగా టోర్నీకి సర్వం సిద్ధం

- Advertisement -
- Advertisement -

మెగా టోర్నీకి సర్వం సిద్ధం
నేటి నుంచి టి20 ప్రపంచకప్
గిలాంగ్: ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న ట్వంటీ20 ప్రపంచకప్‌కు ఆదివారం తెరలేవనుంది. నవంబరు 13 వరకు జరిగే ఈ మెగా టోర్నమెంట్‌లో 16 జట్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. ఆదివారం నుంచి క్వాలిఫయింగ్ పోటీలు జరుగనున్నాయి. మొత్తం 8 జట్లు అర్హత పోటీల్లో తలపడనున్నాయి. శ్రీలంక, నమీబియా, వెస్టిండీస్, యుఎఇ, నెదర్లాండ్స్, స్కాట్లాండ్, జింబాబ్వే, ఐర్లాండ్ జట్లు సూపర్12లో చోటు కోసం పోటీ పడనున్నాయి. ఇందులో తొలి నాలుగు స్థానాల్లో నిలిచే జట్లు సూపర్12కు అర్హత సాధిస్తాయి. మరోవైపు డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా, మాజీ విజేతలు భారత్, పాకిస్థాన్‌లతో పాటు ఇంగ్లండ్, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్ జట్లు నేరుగా సూపర్12 బెర్త్‌ను దక్కించుకున్నాయి. క్వాలిఫయింగ్ విభాగంలో మొత్తం 12 మ్యాచ్‌లు జరుగనున్నాయి.  అక్టోబర్ 21న అర్హత పోటీలు ముగుస్తాయి. ఇక అక్టోబర్ 22న ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగే పోరుతో సూపర్12 సమరానికి తెరలేస్తోంది.
అందరి దృష్టి ఆ మ్యాచ్‌పైనే
ఇక అక్టోబర్ 23న చిరకాల ప్రత్యర్థులు భారత్‌-పాకిస్థాన్ జట్ల మధ్య జరిగే మ్యాచ్ ప్రపంచకప్‌కే ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఈ మ్యాచ్‌కు సంబంధించిన టికెట్లు కొద్ది నిమిషాల్లోనే అమ్ముడు పోయాయి. ఈ దాయాదిల మ్యాచ్‌ను చూసేందుకు ఇరు దేశాల అభిమానులు పెద్ద సంఖ్యలో ఆస్ట్రేలియాకు చేరుకోనున్నారు. కిందటి టి20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ చేతిలో ఎదురైన పరాజయానికి బదులు తీర్చుకోవాలనే పట్టుదలతో భారత్ కనిపిస్తోంది. మరోవైపు పాకిస్థాన్ కూడా మ్యాచ్‌లో గెలిచేందుకు అన్ని అస్త్రాలు సిద్ధం చేసుకుంది.
ఫేవరెట్‌గా ఆస్ట్రేలియా
మరోవైపు ఈ ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా ఫేవరెట్‌గా కనిపిస్తోంది. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతున్న ఆస్ట్రేలియా సొంత గడ్డపై కూడా ట్రోఫీని ముద్దాడాలనే పట్టుదలతో ఉంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో కంగారూలు చాలా బలంగా ఉన్నారు. దీనికి తోడు స్వదేశంలో పోరు జరుగుతుండడం ఆస్ట్రేలియాకు మరింత సానుకూల అంశంగా చెప్పొచ్చు. ఇక ఇంగ్లండ్, టీమిండియా, పాకిస్థాన్, సౌతాఫ్రికా, న్యూజిలాండ్ జట్లు కూడా బలంగానే ఉన్నాయి. ఇటీవల జరిగిన ముక్కోణపు సిరీస్‌లో విజేతగా నిలిచిన పాకిస్థాన్ కూడా ప్రపంచకప్‌లో సంచనాలు సృష్టించాలని భావిస్తోంది. ఇక స్టార్ ఆటగాళ్లతో కూడిన టీమిండియా కూడా ట్రోఫీపై కన్నేసింది. అయితే కీలక ఆటగాళ్లు దూరం కావడం భారత్‌కు కాస్త ప్రతికూలంగా మారింది. జస్‌ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా వంటి మ్యాచ్ విన్నర్లు ప్రపంచకప్‌కు అందుబాటులో లేకుండా పోయారు. అంతేగాక దీపక్ చాహర్ కూడా గాయంతో జట్టుకు దూరమయ్యాడు. ఇక ఇటీవల కాలంలో టీమిండియాను బౌలింగ్ సమస్య వెంటాడుతోంది. కీలక సమయాల్లో బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకుంటున్నారు. ఇది జట్టును కలవరానికి గురిచేస్తోంది. అంతేగాక బ్యాటింగ్‌లో కూడా నిలకడగా లోపించింది. ఇలాంటి స్థితిలో ఈ ప్రపంచకప్ భారత్‌కు సవాల్ వంటిదేనని చెప్పక తప్పదు. మరోవైపు ఇంగ్లండ్, కివీస్‌లకు కూడా ట్రోఫీ సాధించే అవకాశాలు బాగానే ఉన్నాయి. బౌన్స్‌కు సహకరించే ఆస్ట్రేలియా పిచ్‌లు ఈ జట్లకు వరంగా మారనున్నాయి. మొత్తం మీద ఈసారి వరల్డ్ కప్ హోరాహోరీగా సాగడం ఖాయంగా కనిపిస్తోంది. కాగా ఆదివారం జరిగే తొలి మ్యాచ్‌లో శ్రీలంక, నమీబియా జట్లు తలపడనున్నాయి. రెండో మ్యాచ్‌లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ)నెదర్లాండ్స్ పోటీ పడతాయి.

T20 World Cup 2022 Starts with SL vs NAM Match on Sunday

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News