Thursday, January 9, 2025

టి20 ప్రపంచకప్‌ 2024: కెనడాతో భారత్ చివరి మ్యాచ్..

- Advertisement -
- Advertisement -

ఫ్లోరిడా: టి20 ప్రపంచకప్‌లో భాగంగా శనివారం కెనడాతో జరిగే గ్రూప్‌ఎ లీగ్ మ్యాచ్‌కు టీమిండియా సమరోత్సాహంతో సిద్ధమైంది. భారత్ ఇప్పటికే సూపర్8కు అర్హత సాధించింది. చివరి లీగ్ మ్యాచ్‌లోనూ గెలిచి రానున్న నాకౌట్ సమరానికి ఆత్మవిశ్వాసంతో సిద్ధం కావాలని భావిస్తోంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో భారత్ సమతూకంగా కనిపిస్తోంది. టీమిండియా ఇప్పటికే వరుసగా మూడు మ్యాచుల్లో గెలిచి అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఆఖరి మ్యాచ్‌లో కూడా జయభేరి మోగించాలనే పట్టుదలతో పోరుకు సిద్ధమైంది.

కెనడా ఇప్పటి వరకు మూడు మ్యాచ్‌లు ఆడగా ఒకదాంట్లో మాత్రమే విజయం సాధించింది. చివరి మ్యాచ్‌లో భారత్ వంటి బలమైన జట్టుకు ఎలాంటి పోటీ ఇస్తుందో చెప్పలేం. ఇక టీమిండియా వరుస విజయాలతో జోరుమీదుంది. తొలి మ్యాచ్‌లో ఐర్లాండ్‌పై, రెండో మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై జయభేరి మోగించింది. ఇక యూఎస్‌ఎతో జరిగిన కిందటి మ్యాచ్‌లోనూ అలవోక విజయాన్ని అందుకుంది. కెనడాపై కూడా గెలిచి లీగ్ దశలో అజేయంగా నిలువాలనే లక్షంతో ఉంది.

అందరి కళ్లు కోహ్లిపైనే..
మరోవైపు ఈ మ్యాచ్‌లో అందరి కళ్లు స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లిపై నిలిచాయి. ఇప్పటి వరకు మూడు మ్యాచ్‌లు ఆడిన కోహ్లి మూడింటిలోనూ విఫలమయ్యాడు. ఐర్లాండ్‌పై ఒక పరుగు చేసిన విరాట్ పాకిస్థాన్, యూఎస్‌ఎలపై ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. ఈ మ్యాచ్‌లోనైనా అతను తన బ్యాట్‌కు పని చెబుతాడా లేదా అనేది అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే సత్తా కలిగిన కోహ్లి విజృంభిస్తే భారత్‌కు తిరిగే ఉండదు. మూడు మ్యాచుల్లోనూ కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన కోహ్లి ఒక్కదాంట్లో కూడా సత్తా చాటలేక పోయాడు.

వరుసగా రెండు మ్యాచుల్లో సున్నాకే వెనుదిరిగాడు. ఈ మ్యాచ్‌లోనైనా బ్యాట్‌కు పని చెబుతాడా లేదా అనేది సందేహంగా మారింది. మరోవైపు కెప్టెన్ రోహిత్ శర్మ, వికెట్ కీపర్ రిషబ్ పంత్, సూర్యకుమార్‌లు భారత్‌కు కీలకంగా మారారు. తొలి మ్యాచ్‌లో రోహిత్52 పరుగులు చేశాడు. ఇక యూఎస్‌ఎతో జరిగిన కిందటి మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ అజేయ అర్ధ శతంక సాధించాడు. ఈసారి కూడా అతనిపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. రిషబ్ పంత్ కూడా జట్టుకు కీలకంగా మారాడు. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే సత్తా కలిగిన రిషబ్ విజృంభిస్తే ప్రత్యర్థి జట్టు బౌలర్ల కష్టాలు రెట్టింపు కావడం ఖాయం.

శివమ్ దూబె, హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ తదితరులపై కూడా జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. ఇదిలావుంటే బౌలింగ్‌లో మాత్రం టీమిండియా సమతూకంగా కనిపిస్తోంది. బుమ్రా, అర్ష్‌దీప్, సిరాజ్, హార్దిక్, అక్షర్, జడేజా వంటి మ్యాచ్ విన్నర్లు జట్టులో ఉన్నారు. కాగా కెనడా కూడా భారీ ఆశలతో పోరుకు సిద్ధమైంది. ఇప్పటికే లీగ్ దశలో ఐరాండ్‌ను ఓడించిన కెనడా ఈసారి కూడా మెరుగైన ప్రదర్శన చేయాలనే లక్షంతో ఉంది. నికోలస్ కిర్టన్, వికెట్ కీపర్ శ్రేయస్ మొవ్వ, ఓపెనర్ అరోన్ జాన్స్, పర్గత్ సింగ్‌లతో కెనడా బ్యాటింగ్ బలంగా ఉంది. అయితే బలమైన భారత్‌తో పోరు కెనడాకు సవాల్ వంటిదేనని చెప్పాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News