ముంబై: ప్రపంచకప్ వంటి మెగా టోర్నమెంట్ కోసం జట్టు ఎంపికలో సెలెక్షన్ కమిటీ వ్యవహరించిన తీరుపై టీమిండియా మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ విస్మయం వ్యక్తం చేశాడు. జట్టు ఎంపికలో పారదర్శకత లోపించిందని వాపోయాడు. మహ్మద్ షమి, శ్రేయస్ అయ్యర్, దీపక్ చాహర్ వంటి స్టార్లను స్టాండ్‌బైలుగా ఎంపిక చేయడాన్ని తప్పుపట్టాడు. దీపక్ హుడాతో పోల్చితే శ్రేయస్ అయ్యర్ చాలా మెరుగైన బ్యాట్స్‌మన్ అనడంలో ఎలాంటి సందేహం లేదన్నాడు. టి20 ఫార్మాట్‌లో అయ్యర్ అందివచ్చిన అవకాశాలను చక్కగా సద్వినియోగం చేసుకున్నాడన్నాడు. అయినా అతన్ని ప్రపంచకప్ వంటి కీలక టోర్నీకి స్టాండ్‌బైగా ఎంపిక చేయడం తనను ఎంతో ఆశ్చర్యానికి గురిచేసిందన్నాడు. టి20 ఫార్మాట్‌లో అయ్యర్ స్ట్రయిక్‌రేట్ కూడా బాగుందన్నాడు. అయినా అతనిపై సెలెక్టర్లు చిన్నచూపు చూడడం సరికాదన్నాడు. అంతేగాక ఆసియాకప్‌లో పెద్దగా రాణించని అక్షర్ పటేల్, రిషబ్ పంత్, కెఎల్ రాహుల్, అశ్విన్‌లను ప్రపంచకప్ జట్టులో స్థానం కల్పించడం సముచితం కాదన్నాడు. మరోవైపు టీమిండియాలోనే ప్రధాన బౌలర్‌గా పేరున్న షమీను కూడా ప్రపంచకప్ జట్టులో చోటు కల్పించక పోవడం బాధాకరమన్నాడు. వరల్డ్‌కప్ కోసం ఎంపిక చేసిన బౌలర్లతో పోల్చితే షమీ చాలా మెరుగైన బౌలర్ అనే విషయాన్ని సెలెక్టర్లు మరచిపోవడం విడ్డూరమన్నాడు. ఇక దీపక్ చాహర్‌ను కూడా స్టాండ్‌బైగా ఎంపిక చేయడంపై ఆవేదన వ్యక్తం చేశాడు. టీమ్ సెలక్షన్ తీరుపై ట్విటర్ వేదికగా అజారుద్దీన్ విమర్శలు గుప్పించాడు.
T20 World Cup: Azharuddin Criticize BCCI Select team