Friday, November 22, 2024

ఎదురులేని మోర్గాన్ సేన

- Advertisement -
- Advertisement -

T20 World Cup: ENG beat BAN with 8 Wickets

ఎదురులేని మోర్గాన్ సేన..బంగ్లాదేశ్‌పై ఇంగ్లండ్ ఘన విజయం
రాయ్ మెరుపులు, రాణించిన బౌలర్లు
అబుదాబి: యుఎఇ వేదికగా జరుగుతున్న ట్వంటీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ 8 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌పై జయకేతనం ఎగుర వేసింది. బంగ్లాదేశ్‌కు ఇది వరుసగా రెండో ఓటమి కావడం గమనార్హం. ఇక తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ వెస్టిండీస్‌ను చిత్తుగా ఓడించిన ఇంగ్లండ్ ఈసారి బంగ్లాదేశ్‌ను మట్టికరిపించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 14.1 ఓవర్లలోనే కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. లక్షఛేదనకు దిగిన ఇగ్లండ్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్ జోస్ బట్లర్ 18 పరుగులు మాత్రమే చుసి ఔటయ్యాడు. అయితే తర్వాత వచ్చిన డేవిడ్ మలాన్‌తో కలిసి మరో ఓపెనర్ జేసన్ రాయ్ ఇన్నింగ్స్‌ను కుదుట పరిచాడు. ఇద్దరు కుదురుగా ఆడి జట్టును లక్షం దిశగా నడిపించారు. ఒకవైపు వికెట్‌ను కాపాడుకుంటూనే చెత్త బంతులను భారీ షాట్లుగా మలుస్తూ ముందుకు సాగారు. ఈ జోడీని విడగొట్టేందుకు బంగ్లా బౌలర్లు చేసిన ప్రయత్నాలు చాలా సేపటి వరకు ఫలించలేదు. మలన్ సమన్వయంతో ఆడగా, రాయ్ మార్క్ షాట్లతో చెలరేగి పోయాడు. వరుస ఫోర్లు సిక్సర్లతో ప్రత్యర్థి బౌలర్లన హడలెత్తించాడు. దూకుడుగా ఆడిన రాయ్ 38 బంతుల్లోనే ఐదు ఫోర్లు, మూడు సిక్సర్లతో 61 పరుగులు చేసి ఔటయ్యాడు. అయితే అప్పటికే ఇంగ్లండ్‌కు దాదాపు ఖరారైపోయింది. ఇక జానీ బెయిర్ స్టో 8 (నాటౌట్)తో కలిసి డేవిడ్ మలాన్ మిగతా లాంఛనాన్ని పూర్తి చేశాడు. కీలక ఇన్నింగ్స్ ఆడిన మలాన్ 25 బంతుల్లో మూడు బౌండరీలతో 28 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. దీంతో ఇంగ్లండ్ మరో 5.5 ఓవర్లు మిగిలివుండగానే విజయాన్ని అందుకుంది. రాయ్‌కు మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు లభించింది.
ఆరంభం నుంచే..
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్‌కు ఆరంభంలోనే కష్టాలు మొదలయ్యాయి. ఓపెనర్లు లిటన్ దాస్, మహ్మద్ నయీమ్ జట్టుకు శుభారంభం అందించడంలో విఫలమయ్యారు. దాస్ 9 పరుగులు చేయగా, నయీమ్ (5) కూడా నిరాశ పరిచాడు. ఇక వన్‌డౌన్‌లో వచ్చిన షకిబ్ అల్ హసన్ కూడా జట్టుకు అండగా నిలువలేక పోయాడు. 4 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. దీంతో బంగ్లాదేశ్ 26 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో సీనియర్ బ్యాట్స్‌మన్ ముష్ఫికుర్ రహీం జట్టును ఆదుకునేందుకు ప్రయత్నించాడు. అతనికి కెప్టెన్ మహ్మదుల్లా అండగా నిలిచాడు. ఇద్దరు కలిసి స్కోరును ముందుకు నడిపించాడు. కానీ మూడు ఫోర్లతో 29 పరుగులు చేసిన రహీంను లివింగ్‌స్టోన్ వెనక్కి పంపాడు. తర్వాత వచ్చిన అఫిఫ్ హుస్సేన్ (5) ఎక్కువ సేపు క్రీజులో నిలువలేక పోయాడు. కెప్టెన్ మహ్మదుల్లా (19)ను లివింగ్‌స్టోన్ ఔట్ చేశాడు. చివరల్లో వికెట్ కీపర్ నూరుల్ హసన్ (16), మెహదీ హసన్ (11), నాసూమ్ అహ్మద్ 19 (నాటౌట్) కాస్త రాణించడంతో బంగ్లాదేశ్ స్కోరు 124 పరుగులకు చేరింది. ఇంగ్లండ్ బౌలర్లలో మిల్స్ మూడు, లివింగ్‌స్టోన్, మోయిన్ అలీ రెండేసి వికెట్లు పడగొట్టారు. వోక్స్‌కు ఒక వికెట్ దక్కింది.

T20 World Cup: ENG beat BAN with 8 Wickets

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News