Wednesday, December 18, 2024

శామ్ కరన్ మాయ.. అఫ్గాన్‌పై ఇంగ్లండ్ గెలుపు

- Advertisement -
- Advertisement -

T20 World Cup: ENG Won by 5 wickets against AFG

పెర్త్: అఫ్గానిస్థాన్‌తో జరిగిన సూపర్12 మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఐదు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. గ్రూప్1లో భాగంగా శనివారం పెర్త్‌లో ఈ మ్యాచ్ జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్ 19.4 ఓవర్లలోనే 112 పరుగులకే ఆలౌటైంది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 18.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. సునాయాస లక్షంతో బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌కు అఫ్గాన్ బౌలర్లు ముప్పుతిప్పలు పెట్టారు. కచ్చితమైన లైన్ అండ్ లెన్త్‌తో బౌలింగ్ చేస్తూ ఇంగ్లండ్ బ్యాటర్లను కట్టడి చేశారు. ఓపెనర్‌గా దిగిన కెప్టెన్ జోస్ బట్లర్ 3 ఫోర్లతో 18 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆ వెంటనే మరో ఓపెనర్ అలెక్స్ హెల్ (19) కూడా వెనుదిరిగాడు. కొద్ది సేపటికే బెన్ స్టోక్స్ (2) కూడా పెవిలియన్ చేరాడు. మరోవైపు డేవిడ్ మలన్ (18) సమన్వయంతో ఆడాడు. లియామ్ లివింగ్‌స్టోన్ 3 ఫోర్లతో 29 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. దీంతో ఇంగ్లండ్ విజయాన్ని అందుకుంది. అఫ్గాన్ బౌలర్లలో రషీద్ ఖాన్, కెప్టెన్ నబి, ముజీబుర్ రహ్మాన్ పొదుపుగా బౌలింగ్ చేసినా జట్టును గెలిపించలేక పోయారు.
కరన్ మ్యాజిక్
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గాన్‌ను ఇంగ్లండ్ బౌలర్లు తక్కువ స్కోరుకే ఆలౌట్ చేయడంలో సఫలమయ్యారు. స్పీడ్‌స్టర్ శామ్ కరన్ అద్భుత బౌలింగ్‌తో అఫ్గాన్ ఇన్నింగ్స్ పతనాన్ని శాసించాడు. 3.4 ఓవర్లలో 10 పరుగులు మాత్రమే ఇచ్చి ఐదు వికెట్లను పడగొట్టాడు. స్టోక్స్, మార్క్‌వుడ్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ఇక అఫ్గాన్ బ్యాటర్లలో ఇబ్రాహీం జర్దాన్ (32), ఉస్మాన్ ఘని (30) మాత్రమే కాస్త రాణించారు. మిగతావారు ఘోరంగా విఫలం కావడంతో అఫ్గానిస్థాన్ ఇన్నింగ్స్ 112 పరుగుల వద్దే ముగిసింది.

T20 World Cup: ENG Won by 5 wickets against AFG

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News