అడిలైడ్: ప్రపంచకప్ సూపర్ 12 చివరిరోజు నెదర్లాండ్స్ జట్టు దక్షిణాఫ్రికాకు కోలుకోలేని షాక్ ఇచ్చింది. దాదాపు సెమీస్ బెర్త్ ఖరారు చేసుకున్న దక్షిణాఫ్రికా జట్టును ఓడించి సంచలనం సృష్టించింది. ఈ ఓటమితో సఫారీ జట్టు మెగాటోర్నీ నుంచి వైదొలిగింది. సూపర్ 12లో పటిష్ఠ భారత జట్టును ఓడించిన దక్షిణాఫ్రికా జట్టు పసికూన నెదర్లాండ్స్ చేతిలో ఓటమితో అవమానకరంగా టోర్నీ నుంచి నిష్క్రమించింది. నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన సఫారీ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్ 20ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో దక్షిణాఫ్రికా 145 పరుగులు వద్ద నిలిచిపోయి ఓటమిపాలైంది. దీంతో నెదర్లాండ్స్ 13పరుగుల తేడాతో గెలుపొందింది.
సెమీస్‌లో కివీస్‌తో పాక్ పోరు
ఇక, బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ 5వికెట్ల తేడాతో గెలిచి సెమీఫైనల్‌కు చేరింది. పాక్ పేసర్ షాహిన్ అఫ్రిది విజృంభించడంతో బంగ్లాజట్టు విలవిలలాడింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లా జట్టు 20ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 127 పరుగులు చేసింది. ఓపెనర్ షాంటో అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు. బంగ్లాజట్టు నిర్దేశించిన లక్ష్యాన్ని పాక్ 18.1ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి చేధించింది. రిజ్వాన్ (32), హరీస్(31), షాన్ మసూద్(24 నాటౌట్)గా నిలిచారు. 4వికెట్లు పడగొట్టిన అఫ్రిది ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.
T20 World Cup: NED Won by 13 runs against SA