Monday, December 23, 2024

నాకౌట్ సమరానికి సర్వం సిద్ధం!

- Advertisement -
- Advertisement -

నాకౌట్ సమరానికి సర్వం సిద్ధం!
ఆత్మవిశ్వాసంతో న్యూజిలాండ్
సమరోత్సాహంతో పాకిస్థాన్
నేడు తొలి సెమీ ఫైనల్
మధ్యాహ్నం 1.30 గంటల నుంచి
సిడ్నీ: ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టి20 ప్రపంచకప్ తుది అంకానికి చేరుకుంది. ఇప్పటికే లీగ్ మ్యాచ్‌లు ముగిసాయి. ఇక మిగిలింది నాకౌట్ మ్యాచ్‌లే. మరో మూడు మ్యాచ్‌లు మాత్రమే జరుగనున్నాయి. సిడ్నీలో బుధవారం జరిగే తొలి సెమీ ఫైనల్లో పాకిస్థాన్‌తో న్యూజిలాండ్ తలపడనుంది. ఇక అడిలైడ్‌లో గురువారం జరిగే రెండో సెమీస్ పోరులతో ఇంగ్లండ్‌తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. ఈ మ్యాచుల్లో గెలిచే జట్లు ఆదివారం మెల్‌బోర్న్‌లో జరిగే ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. ఇక గ్రూప్1 నుంచి న్యూజిలాండ్‌, ఇంగ్లండ్‌లు సెమీస్ బెర్త్‌ను దక్కించుకున్నాయి. మరో గ్రూప్ నుంచి చిరకాల ప్రత్యర్థులు భారత్‌పాకిస్థాన్‌లు సెమీస్‌కు దూసుకొచ్చాయి. సూపర్12 దశలో భారత్, న్యూజిలాండ్ జట్లు తమ తమ గ్రూపుల్లో అగ్రస్థానంలో నిలిచాయి. ఇక పాకిస్థాన్, ఇంగ్లండ్‌లు అనూహ్యంగా సెమీస్ బెర్త్‌ను సొంతం చేసుకున్నాయి.
ఫేవరెట్‌గా కివీస్
ఇక పాకిస్థాన్‌తో జరిగే తొలి సెమీ ఫైనల్లో న్యూజిలాండ్ ఫేవరెట్‌గా కనిపిస్తోంది. ఆస్ట్రేలియా వంటి బలమైన జట్టును చిత్తుగా ఓడించడంతో కివీస్ ఆత్మవిశ్వాసం రెట్టింపు అయ్యింది. అయితే పాకిస్థాన్ కూడా లీగ్ దశలో పటిష్టమైన సౌతాఫ్రికాను చిత్తుగా ఓడించింది. దీంతో ఇరు జట్లు కూడా నాకౌట్ దశకు ఆత్మవిశ్వాసంతో సిద్ధమయ్యాయి. కానీ పాకిస్థాన్‌తో పోల్చితే న్యూజిలాండ్ కాస్త బలంగా కనిపిస్తోంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఆ జట్టు సమతూకంగా ఉంది. తాజాగా కెప్టెన్ విలియమ్సన్ కూడా ఫామ్‌లోకి రావడం కివీస్‌కు అతి పెద్ద ఊరటగా చెప్పొచ్చు. అంతేగాక డెవొన్ కాన్వే, గ్లెన్ ఫిలిప్స్, ఫిన్ అలెన్, డారిల్ మిఛెల్, నిషమ్ వంటి అగ్రశ్రేణి బ్యాటర్లు జట్టులో ఉన్నారు. ఫిలిప్స్ ఇప్పటికే సెంచరీతో సత్తా చాటాడు. ఆస్ట్రేలియాపై కాన్వే మెరుపులు మెరిపించాడు. ఇక ఐర్లాండ్‌తో జరిగిన కిందటి మ్యాచ్‌లో విలియమ్సన్ దూకుడైన బ్యాటింగ్‌ను కనబరిచాడు. ఇలా కీలక ఆటగాళ్లందరూ ఫామ్‌లో ఉండడం కివీస్‌కు సానుకూల పరిణామంగా చెప్పాలి. అంతేగాక సౌథి, బౌల్ట్, ఫెర్గూసన్, సాంట్నర్, సోధి వంటి మ్యాచ్ విన్నర్ బౌలర్లు జట్టులో ఉన్నారు. దీంతో ఈ మ్యాచ్‌లో కివీస్‌కే గెలుపు అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి.
తక్కువ అంచనా వేయలేం..
మరోవైపు పాకిస్థాన్ కూడా గెలుపే లక్షంగా పోరుకు సిద్ధమైంది. సౌతాఫ్రికా, బంగ్లాదేశ్ జట్లపై వరుస విజయాలు సాధించడంతో పాకిస్థాన్ ఆత్మవిశ్వాసం రెట్టింపు అయ్యింది. ఆరంభంలో వరుసగా రెండు మ్యాచుల్లో ఓడినా తర్వాత వరుసగా మూడింటిలో గెలిచి పాకిస్థాన్ సెమీస్‌కు చేరుకుంది. ఇక కివీస్‌పై మెరుగైన రికార్డు కలిగి ఉండడం కూడా పాక్‌కు కలిసి వచ్చే అంశంగా చెప్పాలి. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో పాకిస్థాన్ సమతూకంగా కనిపిస్తోంది. బాబర్ ఆజమ్, మహ్మద్ రిజ్వాన్, ఇఫ్తికార్ అహ్మద్, నవాజ్, షాదాబ్ ఖాన్, షాన్ మసూద్, హారిస్ వంటి విధ్వంసక బ్యాటర్లు జట్టులో ఉన్నారు. అయితే ఓపెనర్లు ఆజమ్, రిజ్వాన్‌లు పేలవమైన ఫామ్‌తో సతమతమవుతుండడం జట్టును కలవరానికి గురిచేస్తోంది. ఈ మ్యాచ్‌లోనైనా వీరిద్దరూ తమ బ్యాట్‌ను పనిచెప్పాల్సిన అవసరం ఉంది. అప్పుడే పాకిస్థాన్‌కు గెలుపు అవకాశాలు మెరుగవుతాయి.

T20 World Cup: NZ vs PAK Semi Final today

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News