Wednesday, January 22, 2025

మెగా టోర్నీకి టీమిండియా ఎంపిక… రాహుల్ కు మొండిచేయి

- Advertisement -
- Advertisement -

సారథిగా రోహిత్, హార్దిక్‌కు వైస్ కెప్టెన్సీ
శివమ్, శాంసన్‌లకు చోటు
రాహుల్, అశ్విన్‌లకు నిరాశే

ముంబై: టి20 ప్రపంచకప్‌లో పాల్గొనే టీమిండియాను మంగళవారం ఎంపిక చేశారు. వెస్టిండీస్, అమెరికా వేదికగా జరుగనున్న ఈ మెగా టోర్నమెంట్ కోసం 15 మందితో కూడిన జట్టును బిసిసిఐ ప్రకటించింది. రోహిత్ శర్మ కెప్టెన్‌గా, హార్దిక్ పాండ్య వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. ఊహించినట్టే శివమ్ దూబె, రిషబ్ పంత్, సంజూ శాంసన్‌లకు ప్రపంచకప్ జట్టులో స్థానం లభించింది. మరోవైపు కెఎల్ రాహుల్, రవిచంద్రన్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయస్ అయ్యర్ తదితరులకు టీమిండియాలో స్థానం దక్కలేదు.

శుభ్‌మన్ గిల్, రింకూ సింగ్, ఖలీల్ అహ్మద్, అవేశ్ ఖాన్‌లను ట్రావెల్ రిజర్వ్‌గా ఎంపిక చేశారు. ఐపిఎల్‌లో రాణించిన చాలా మంది ఆటగాళ్లకు భారత జట్టులో స్థానం దక్కలేదు. సీనియర్లు రోహిత్, బుమ్రా, కోహ్లి, సిరాజ్, చాహల్, కుల్దీప్, జడేజాల వైపే సెలెక్టర్లు మొగ్గు చూపారు. అయితే మరో సీనియర్ ఆటగాడు కెఎల్ రాహుల్‌కు వరల్డ్‌కప్ టీమ్ స్థానం లభించలేదు. ఐపిఎల్‌లో రాహుల్ బాగానే ఆడుతున్నా మెగా టోర్నీకి మాత్రం ఎంపిక కాలేక పోయాడు. శాంసన్, పంత్‌లపైనే సెలెక్టర్లు నమ్మకం ఉంచడంతో రాహుల్‌కు నిరాశ తప్పలేదు. శ్రేయస్ అయ్యర్, అశ్విన్‌లకు ఊహించినట్టే స్థానం లభించలేదు. యువ సంచలనం యశస్వి జైస్వాల్‌కు మాత్రం వరల్డ్‌కప్ జట్టులో చోటు దక్కింది.

కెప్టెన్ రోహిత్‌తో కలిసి యశస్వి ఇన్నింగ్స్‌ను ప్రారంభించే అవకాశం ఉంది. ఐపిఎల్‌లో మెరుగ్గా రాణిస్తున్న గిల్, రుతురాజ్ తదితరులకు ఛాన్స్ దక్కలేదు. గిల్ మాత్రం రిజర్వ్ ఆటగాడిగా ఎంపికయ్యాడు. గాయం నుంచి పూర్తిగా కోలుకోక పోవడంతో సీనియర్ బౌలర్ మహ్మద్ షమి పేరును పరిగణలోకి తీసుకోలేదు. హైదరాబాదీ స్పీడ్‌స్టర్ మహ్మద్ సిరాజ్‌పై సెలెక్టర్లు మరోసారి నమ్మకం ఉంచారు. అతనితో పాటు బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్‌లు పేస్ బౌలింగ్ బాధ్యతలను నెరవేర్చనున్నారు. శివమ్ దూబె, హార్దిక్ పాండ్య, అక్షర్ పటేల్, జడేజాలను ఆల్‌రౌండర్లుగా ఎంపిక చేశారు. వీరి బ్యాట్‌తో పాటు బంతితోనూ జట్టుకు అండగా నిలువనున్నారు. ఇక ఐపిఎల్‌లో మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్న సీనియర్ స్పిన్నర్లు కుల్దీప్, యజువేంద్ర చాహల్‌లకు వరల్డ్‌ప్ జట్టులో స్థానం దక్కింది.

కానీ మరో సీనియర్ అశ్విన్‌కు చోటు లభించలేదు. ఐపిఎల్‌లో రాజస్థాన్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న అశ్విన్ పేలవమైన ప్రదర్శనతో నిరాశ పరుస్తున్నాడు. దీంతో అతన్ని మెగా టోర్నీకి ఎంపిక చేయలేదు. వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, శార్దూల్ ఠాకూర్ తదితరులకు కూడా నిరాశే మిగిలింది. మరోవైపు శివమ్ దూబె, అర్ష్‌దీప్, పంత్, సూర్యకుమార్ యాదవ్‌లు జాక్‌పాట్ కొట్టేశారు. కాగా, టి20 వరల్డ్‌కప్ జూన్ రెండు నుంచి జరుగనుంది. భారత్ తన తొలి మ్యాచ్‌ను జూన్ ఐదున ఐర్లాండ్‌తో ఆడనుంది. భారత్‌తో పాటు మొత్తం 20 జట్లు మెగా టోర్నీలో తలపడనున్నాయి. అమెరికాలోని మూడు. వెస్టిండీస్‌లోని ఆరు వేదికల్లో మొత్తం 55 మ్యాచ్‌లు జరుగనున్నాయి. చిరకాల ప్రత్యర్థులు భారత్‌పాకిస్థాన్‌లు ఒకే గ్రూపులో ఉన్నారు. దాయాదిల మధ్య జూన్ 9న న్యూయార్క్‌లో పోరు జరుగనుంది. కాగా, ఫైనల్ మ్యాచ్ జూన్ 29న జరుగుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News