సిడ్నీ: టి20 ప్రపంచకప్‌లో సౌతాఫ్రికా తొలి విజయాన్ని నమోదు చేసింది. గురువారం జరిగిన గ్రూప్2 మ్యాచ్‌లో 104 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌ను చిత్తుగా ఓడించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. తర్వాత లక్ష ఛేదనకు దిగిన బంగ్లాదేశ్ 16.3 ఓవర్లలో 101 పరుగులకే కుప్పకూలింది. క్లిష్టమైన లక్షంతో బ్యాటింగ్ చేపట్టిన బంగ్లాదేశ్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్ నజ్ముల్ (9)ను నోర్జే ఔట్ చేశాడు. ధాటిగా ఆడిన మరో ఓపెనర్ సౌమ్య సర్కార్ రెండు సిక్సర్లతో 15 పరుగులు చేసి వెనుదిరిగాడు. ఈ వికెట్ కూడా నోర్జేకే దక్కింది. ఒక జట్టును ఆదుకుంటారని భావించిన కెప్టెన్ షకిబ్ (1), ఆఫిఫ్ హుస్సేన్ (1), మెహదీ హసన్ (11), మొసద్దిక్ (0), నూరుల్ హసన్(2) నిరాశ పరిచారు. ఒంటరి పోరాటం చేసిన లిటన్ దాస్ 34 పరుగులు చేశాడు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికాను ఓపెనర్ క్వింటన్ డికాక్, రొసొ ఆదుకున్నారు. ధాటిగా ఆడిన డికాక్ ఏడు పోర్లు, మూడు సిక్సర్లతో 63 పరుగులు చేశాడు. మరోవైపు విధ్వంసక బ్యాటింగ్‌తో ఆకట్టుకున్న రిలీ రొసొ 56 బంతుల్లోనే 8 భారీ సిక్సర్లు, ఏడు బౌండరీలతో 109 పరుగులు సాధించాడు. దీంతో సౌతాఫ్రికా స్కోరు 205 పరుగులకు చేరింది.
T20 World Cup: SA beat BAN by 104 Runs