Friday, January 24, 2025

స్కాట్లాండ్ పెను సంచలనం.. వెస్టిండీస్‌పై చారిత్రక విజయం

- Advertisement -
- Advertisement -

T20 World Cup: Scotland won by 42 runs against WI

హోబర్ట్: టి20 ప్రపంచకప్‌లో మరో సంచలన ఫలితం నమోదైంది. సోమవారం జరిగిన గ్రూప్‌బి మ్యాచ్‌లో స్కాట్లాండ్ 42 పరుగుల తేడాతో రెండు సార్లు ప్రపంచకప్ విజేత వెస్టిండీస్‌పై చారిత్రక విజయం సాధించింది. తొలి రౌండ్‌లో భాగంగా జరిగిన ఈ మ్యాచ్‌లో పసికూన స్కాట్లాండ్ పటిష్టమైన వెస్టిండీస్‌ను చిత్తుగా ఓడించింది. ఇక ప్రపంచకప్ తొలి రోజు మరో చిన్న జట్టు నమీబియా మాజీ విజేత శ్రీలంకను మట్టికరిపించిన విషయం తెలిసిందే. ఇక వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్ 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. తర్వాత లక్ష ఛేదనకు దిగిన వెస్టిండీస్ 18.3 ఓవర్లలో 118 పరుగులకే కుప్పకూలి అవమానకర ఓటమి చవిచూసింది. ఊరిస్తున్న లక్షంతో బ్యాటింగ్ చేపట్టిన వెస్టిండీస్‌ను ఆరంభంలోనే కష్టాలు మొదలయ్యాయి. ధాటిగా ఆడిన ఓపెనర్ కైల్ మేయర్స్ 3 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 20 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆ తర్వాత బ్రాండన్ కింగ్, ఓపెనర్ ఎవిన్ లూయిస్ కొద్ది సేపు పోరాటం చేశారు. అయితే ఒక ఫోర్, మరో సిక్సర్‌తో 14 పరుగులు చేసిన లూయిస్‌ను వీల్ వెనక్కి పంపాడు. ఆ వెంటనే బ్రాండన్ కిగ్ కూడా వెనుదిరిగాడు. 3 ఫోర్లతో 17 పరుగులు చేసిన కింగ్‌ను మార్క్ వాట్ చేశాడు. ఆ తర్వాత విండీస్ మళ్లీ కోలుకోలేక పోయింది. స్కాట్‌లాండ్ బౌలర్లు వరుస క్రమంలో వికెట్లు తీస్తూ విండీస్ ఇన్నింగ్స్‌ను కుప్పకూల్చారు. జట్టును ఆదుకుంటారని భావించిన కెప్టెన్ నికోలస్ పూరన్ (4), శమర్ బ్రూక్స్ (4), రొమాన్ పొవెల్ (5) తదితరులు ఘోరంగా విఫలమయ్యారు.

ఇక జేసన్ హోల్డర్ ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. కీలక ఇన్నింగ్స్ ఆడిన హోల్డర్ 4 ఫోర్లు, ఒక సిక్స్‌తో 38 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. స్కాట్లాండ్ బౌలర్లలో మార్క్ వాట్ 4 ఓవర్లలో 12 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు తీశాడు. వీల్, మిఛెల్ లీస్క్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్‌కు ఓపెనర్లు జార్జ్ మున్సె, మిఛెల్ జాన్సన్ శుభారంభం అందించారు. ధాటిగా ఆడిన జోన్స్ 3 ఫోర్లతో 20 పరుగులు చేశాడు. ఈ క్రమంలో 55 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యంలో పాలు పంచుకున్నాడు. మరోవైపు వన్‌డౌన్‌లో వచ్చిన క్రాస్(3) విఫలమయ్యాడు. కెప్టెన్ రిచి బెర్రింగ్టన్ (16), మెక్‌లాయిడ్ (23), క్రిస్ గ్రీవ్స్ 16(నాటౌట్) కాస్త మెరుగైన బ్యాటింగ్‌ను కనబరిచారు. మరోవైపు ఓపెనర్ మున్సె అద్భుత ఇన్నింగ్స్‌తో జట్టును ఆదుకున్నాడు. విండీస్ బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న మున్సె 53 బంతుల్లో 9 ఫోర్లతో 66 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. దీంతో స్కాట్లాండ్ స్కోరు 160 పరుగులకు చేరింది. ప్రత్యర్థి జట్టు బౌలర్లలో జోసెఫ్, హోల్డర్ రెండేసి వికెట్లు తీశారు.

T20 World Cup: Scotland won by 42 runs against WI

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News