Saturday, November 9, 2024

దాయాదుల ‘సమరం’

- Advertisement -
- Advertisement -

T20 World cup: Today India clashes with Pakistan

నేడు పాకిస్థాన్‌తో భారత్ ఢీ

దుబాయి: ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఎంతో అతృతతో ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. ప్రపంచ క్రికెట్‌లోనే చిరకాల ప్రత్యర్థులుగా పేరు తెచ్చుకున్న భారత్‌పాకిస్థాన్ జట్ల మధ్య ఆదివారం పోరు జరుగనుంది. ట్వంటీ20 ప్రపంచకప్ సూపర్-12 సమరంలో భాగంగా చిరకాల ప్రత్యర్థుల మధ్య పోటీ నెలకొంది. దుబాయి వేదికగా జరిగే గ్రూప్2 మ్యాచ్ కోసం రెండు జట్లు సమరోత్సాహంతో సిద్ధమయ్యాయి. ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై టీమిండియాకు అజేయ రికార్డు ఉంది. ఇప్పటి వరకు వరల్డ్‌కప్‌లలో రెండు జట్ల మధ్య 12 మ్యాచ్‌లు జరగగా అన్నింటిలో భారతే విజయం సాధించింది. ఈసారి కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగించాలనే పట్టుదలతో భారత్ పోరుకు సిద్ధమైంది. ఇక పాకిస్థాన్ కూడా గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది.

ఈసారి పాత రికార్డును తిరగరాసి భారత్‌పై తొలి విజయాన్ని అందుకోవాలనే పట్టుదలతో పాకిస్థాన్ కనిపిస్తోంది. రెండు జట్లలోనూ ప్రతిభావంతులైన ఆటగాళ్లకు కొదవలేదు. అంతేగాక దుబాయి పిచ్‌పై భారత్‌కంటే పాకిస్థాన్‌కు మంచి పట్టు ఉంది. చాలా కాలంగా దుబాయిని పాకిస్థాన్ హోం గ్రౌండ్‌గా ఉపయోగిస్తుండడమే దీనికి ప్రధాన కారణం. ఇక రెండేళ్లుగాఐపిఎల్ టోర్నమెంట్ ఇక్కడే జరగడం, వరల్డ్‌కప్‌కు ఎంపికైన చాలా మంది టీమిండియా క్రికెటర్లు ఈ పిచ్‌లపై డజన్ల కొద్ది మ్యాచ్‌లు ఆడడం భారత్‌కు పెద్ద ఊరటనిచ్చే అంశంగా చెప్పాలి. ఆదివారం రాత్రి జరిగే దాయాదిల పోరు కోసం రెండు దేశాల క్రికెట్ అభిమానులు ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ఈ మ్యాచ్‌లో గెలిచి రానున్న పోటీలకు మరింత ఆత్మవిశ్వాసంతో సిద్ధం కావాలనే లక్షంతో ఇండియాపాకిస్థాన్ జట్లు ఉన్నాయి. ఇక బలబలాల్లో సమతూకంగా కనిపిస్తున్న ఇరు జట్ల మధ్య జరిగే పోరు చివరి వరకు ఆసక్తిగా సాగడం ఖాయం.

ఓపెనర్లే కీలకం..

ఇక ఈ మ్యాచ్‌లో టీమిండియాకు ఓపెనర్లు కీలకంగా మారారు. రోహిత్ శర్మతో కలిసి కెఎల్.రాహుల్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించడం ఖాయంగా కనిపిస్తోంది. వార్మప్ మ్యాచుల్లో ఇద్దరు మెరుగ్గా ఆడడం భారత్‌కు కలిసి వచ్చే అంశంగా మారింది. రెండు ప్రాక్టీస్ మ్యాచుల్లోనూ రాహుల్ దూకుడుగా ఆడాడు. ఇక ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో ఆడిన రోహిత్ శర్మ కూడా దూకుడైన బ్యాటింగ్‌తో అలరించాడు. పాకిస్థాన్‌తో జరిగే కీలక మ్యాచ్‌లో సత్తా చాటేందుకు ఇద్దరు సిద్ధమయ్యారు. ఇద్దరిలో ఏ ఒక్కరూ నిలదొక్కుకున్న టీమిండియాకు శుభారంభం ఖాయం.

కోహ్లికి పరీక్ష..

కొంతకాలంగా పేలవమైన బ్యాటింగ్‌తో సతమతమవుతున్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లికి ఈ మ్యాచ్ కీలకంగా మారింది. చిరకాల ప్రత్యర్థితో జరిగే మ్యాచ్‌లో మెరుగైన బ్యాటింగ్‌ను కనబరచాల్సిన పరిస్థితి కోహ్లికి నెలకొంది. ఈ మ్యాచ్‌లో రాణించడం ద్వారా మళ్లీ ఫామ్‌ను అందిపుచ్చుకోవాలనే పట్టుదలతో అతనున్నాడు. అయితే బలమైన బౌలింగ్ లైనప్ కలిగిన పాకిస్థాన్‌పై భారీ స్కోరు సాధించడం అనుకున్నంత తేలికేం కాదు. కానీ ఎంతటి పెద్ద బౌలర్‌కైనా చుక్కలు చూపించే సత్తా కోహ్లికి మాత్రమే ఉంది. తన మార్క్ బ్యాటింగ్‌తో చెలరేగితే అతన్ని అడ్డుకోవడం పాక్ బౌలర్లకు శక్తికి మించిన పనిగానే అవుతుందనడంలో సందేహం లేదు. ఇక యువ ఆటగాళ్లు సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్‌లపై కూడా జట్టు భారీ ఆశలే పెట్టుకుంది. ఐపిఎల్‌లో సూర్యకుమార్ ఆశించిన స్థాయిలో రాణించలేక పోయాడు. కానీ చివర్లో ధాటిగా ఆడడం కాస్త ఊరటనిచ్చే అంశంగా చెప్పాలి. వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఫామ్‌లో ఉన్నాడు. ఐపిఎల్‌తో పాటు వార్మప్ మ్యాచుల్లో బాగానే ఆడాడు. ఈసారి కూడా మెరుగైన బ్యాటింగ్‌తో జట్టుకు అండగా నిలువాలనే పట్టుదలతో కనిపిస్తున్నాడు.

అందరి కళ్లు హార్దిక్‌పైనే..

మరోవైపు ఈ ప్రపంచకప్‌లో అందరి కళ్లు స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యపైనే నిలిచాయి. కొంతకాలంగా హార్దిక్ పేలవమైన ఆటతో నిరాశ పరుస్తున్నాడు. ఫిట్‌నెస్ లేమీతో బాధపడుతున్న హార్దిక్ కేవలం బ్యాటింగ్‌కే పరిమితమవుతున్నాడు. ఇక పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌లో అతనికి తుది జట్టులో అవకాశం ఇస్తారా లేదా అనేది సందేహమే. శార్దూల్ ఠాకూర్ రూపంలో భారత్‌కు మరో మెరుగైన అస్త్రం అందుబాటులో ఉంది. ఇటీవల ముగిసిన ఐపిఎల్‌లో శార్దూల్ అసాధారణ రీతిలో రాణించాడు. దీంతో హార్దిక్ స్థానంలో అతన్ని బరిలోకి దించినా ఆశ్చర్యం లేదు. ఇక జస్‌ప్రిత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, రవీంద్ర జడేజా, షమిలకు తుది జట్టులో స్థానం ఖాయంగా కనిపిస్తోంది. ఇక అశ్విన్‌ను ఆడిస్తారా లేదా అనేది ఇంకా తేలలేదు.

తక్కువ అంచన వేయలేం..

దాయాది పాకిస్థాన్‌ను కూడా తక్కువ అంచన వేయలేం. భారత్‌తో పోటీ అంటేనే చెలరేగి ఆడడం పాక్ క్రికెటర్ల అనవాయితీ. ఈ మ్యాచ్‌లో కూడా చివరి వరకు పోరాడేందుకు సిద్ధమయ్యారు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో పాకిస్థాన్ బలంగానే ఉంది. కెప్టెన్ బాబర్ ఆజమ్ కొంతకాలంగా నిలకైడన బ్యాటింగ్‌ను కనబరుస్తున్నాడు. ఫార్మాట్ ఏదైనా పరుగుల వరద పారిస్తున్నాడు. ఈసారి కూడా జట్టు అతనిపై భారీ ఆశలు పెట్టుకుంది. ఇక ఫకర్ జమాన్, మహ్మద్ రిజ్వాన్, హఫీజ్, హైదర్ అలీ, షోయబ్ మాలిక్ తదితరులతో పాకిస్థాన బ్యాటింగ్ చాలా బలంగా ఉంది. అంతేగాక షాహెన్ షా ఆఫ్రిది, హసన్ అలీ, ఇమాద్ వసీం, హరిస్ తదితరులతో బౌలింగ్ విభాగం కూడా పటిష్టంగా కనిపిస్తోంది. దీంతో పాకిస్థాన్‌ను ఏ మాత్రం తేలిగ్గా తీసుకున్న టీమిండియా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు.

జట్ల వివరాలు:

భారత్: విరాట్ కోహ్లి (కెప్టెన్), రోహిత్ శర్మ, కెఎల్.రాహుల్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, హార్దిక్ పాండ్య, రాహుల్ చాహర్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమి, భువనేశ్వర్ కుమార్, జస్‌ప్రిత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి.

పాకిస్థాన్: బాబర్ ఆజమ్ (కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్, మహ్మద్ హఫీజ్, ఫకర్ జమాన్, ఇమాద్ వసీం, షాదాబ్ ఖాన్, షోయబ్ మాలిక్, షాహెన్ షా ఆఫ్రిది, హసన్ అలీ, హరిస్, హైదర్ అలీ.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News