Saturday, November 16, 2024

బంగ్లాదేశ్‌కు సవాల్

- Advertisement -
- Advertisement -

T20 world cup :tomorrow match between Bangladesh vs Oman

రేపు ఒమన్‌తో కీలక పోరు

మస్కట్: ప్రపంచకప్ అర్హత పోటీల్లో భాగంగా మంగళవారం జరిగే కీలక మ్యాచ్‌లో బంగ్లాదేశ్ ఆతిథ్య ఒమన్‌తో తలపడనుంది. స్కాట్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో అనూహ్య ఓటమి పాలైన బంగ్లాదేశ్‌కు ఈ పోరు సవాల్‌గా తయారైంది. ఇక ఆరంభ మ్యాచ్‌లో పపువా న్యూగినియాను చిత్తుగా ఓడించిన ఒమన్ ఈ మ్యాచ్‌కు సమరోత్సాహంతో సిద్ధమైంది. ఇందులో కూడా గెలిచి ప్లేఆఫ్ అవకాశాలను మరింత మెరుగు పరుచుకోవాలని భావిస్తోంది. ఇక తొలి మ్యాచ్‌లో బ్యాటింగ్ వైఫల్యం బంగ్లాదేశ్‌ను వెంటాడింది. బౌలర్లు అద్భుత ప్రదర్శనతో ప్రత్యర్థి జట్టును తక్కువ స్కోరుకే పరిమితం చేయడంలో సఫలమయ్యారు. అయితే బ్యాట్స్‌మెన్ విఫలం కావడంతో బంగ్లాదేశ్‌కు ఓటమి తప్పలేదు. అయితే ఒమన్‌తో జరిగే మ్యాచ్‌లో బ్యాటింగ్ మెరుగు పరుచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఓపెనర్లు సౌమ్య సర్కార్, లిటన్ దాస్‌లు శుభారంభం అందించక తప్పదు. తొలి మ్యాచ్‌లో వీరిద్దరూ తక్కువ స్కోరుకే ఔట్ కావడంతో తర్వాత వచ్చిన బ్యాట్స్‌మెన్ ఒత్తిడికి గురయ్యారు. ఇక సీనియర్లు షకిబ్ అల్ హసన్, ముష్ఫికుర్ రహీం, కెప్టెన్ మహ్మదుల్లా జట్టుకు అండగా నిలవాల్సిన పరిస్థితి నెలకొంది.

కిందటి మ్యాచ్‌లో షకిబ్ బౌలింగ్‌లో రాణించినా వేగంగా పరుగులు సాధించలేక పోయాడు. రహీం బ్యాటింగ్‌లో కూడా జోష్ కనిపించలేదు. కెప్టెన్ మహ్మదుల్లా కూడా వేగంగా ఆడడంలో విఫలమయ్యాడు. ఈ మ్యాచ్‌లో వీరంతా మెరుగైన బ్యాటింగ్‌తో జట్టుకు అండగా ఉండాలి. ఇక ఒమన్‌పై ఒత్తిడి తేవాలంటే బంగ్లాదేశ్ భారీ స్కోరు సాధించక తప్పదు. ప్రత్యర్థి ముందు భారీ లక్ష్యాన్ని ఉంచితే ఒత్తిడి పెంచే అవకాశం ఉంటుంది. ఇక బౌలర్లు జోరుమీదుండడం బంగ్లాదేశ్‌కు అతి పెద్ద ఊరటగా చెప్పొచ్చు. తొలి మ్యాచ్‌లో షకిబ్, మెహదీ హసన్‌లు అద్భుత బౌలింగ్‌ను కనబరిచారు. పొదుపుగా బౌలింగ్ చేయడమే కాకుండా కీలక సమయంలో వికెట్లు తీసి ప్రత్యర్థి బ్యాట్స్‌మన్‌ను కట్టడి చేశారు. ఈసారి కూడా వీరిపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. ముస్తపిఝుర్, సఫియుద్దీన్ తదితరులతో బౌలింగ్ విభాగం పటిష్టంగా కనిపిస్తోంది. బ్యాట్స్‌మెన్‌లు కూడా గాడిలో పడితే ఈ మ్యాచ్‌లో గెలవడం బంగ్లాదేశ్‌కు కష్టం కాకపోవచ్చు.

జోరుమీదుంది..

మరోవైపు ఒమన్ ఈ మ్యాచ్‌కు ఆత్మవిశ్వాసంతో సిద్ధమైంది. తొలి మ్యాచ్‌లో పపువా న్యూగినియాను పది వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది. అయితే బలమైన బంగ్లాదేశ్‌ను ఓడించాలంటే ఒమన్ అసాధారణ ఆటను కనబరచక తప్పదు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమతూకంగా కనిపిస్తున్న ఒమన్ మరో సంచలన విజయంపై కన్నేసింది. సొంత గడ్డపై ఆడుతుండడం కూడా వారికి సానుకూలంశంగా మారింది. ఆరంభ మ్యాచ్‌లో విధ్వంసక ఇన్నింగ్స్‌తో చెలరేగి జతీందర్ సింగ్ ఈసారి కూడా అదే జోరును కొనసాగించాలనే లక్షంతో ఉన్నాడు. మరో ఓపెనర్ అఖిబ్ ఇలియాస్ కూడా దూకుడుగా ఆడేందుకు సిద్ధమయ్యాడు. అతను కూడా తొలి మ్యాచ్‌లో అజేయ అర్ధ సెంచరీతో అలరించాడు.

ఇక దూకుడుగా ఆడిన జతీందర్ 4 సిక్సర్లు, ఏడు ఫోర్లతో 73 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచిన విషయం తెలిసిందే. బౌలింగ్‌లో కెప్టెన్ జిషాన్ మక్సూద్ అద్భుతంగా రాణించాడు. 20 పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఈసారి కూడా చెలరేగాలనే పట్టుదలతో ఉన్నాడు. బిలాల్, కలీముల్లా, అఖిబ్ తదితరులతో ఒమన్ బౌలింగ్ బలంగా ఉంది. బ్యాటింగ్‌లో కూడా ఒమన్ పటిష్టంగా కనిపిస్తోంది. రెండు జట్లలోనూ ప్రతిభావంతులైన ఆటగాళ్లు ఉండడంతో మ్యాచ్ ఆసక్తికరంగా సాగడం ఖాయం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News