Friday, November 22, 2024

కంగారెత్తించారు..

- Advertisement -
- Advertisement -

T20 World Cup:Australia victory over South Africa

చెలరేగిన బౌలర్లు, రాణించిన స్మిత్, సౌతాఫ్రికాపై ఆస్ట్రేలియా ఘన విజయం

అబుదాబి: టి20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా శుభారంభం చేసింది. దక్షిణాఫ్రికాతో శనివారం జరిగిన సూపర్12 తొలి సమరంలో ఆస్ట్రేలియా ఐదు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 118 పరుగులు మాత్రమే చేసింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా 19.4 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. బౌలింగ్‌కు సహకరించిన పిచ్‌పై స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు కూడా ఆస్ట్రేలియా తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది.

ఆరంభంలోనే..

సునాయాసమైన లక్షంతో బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియాకు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్‌గా దిగిన కెప్టెన్ అరోన్ ఫించ్ (0) ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. నోర్జే అతన్ని వెనక్కి పంపాడు. ఇక మరో ఓపెనర్ డేవిడ్ వార్నర్ కూడా నిరాశ పరిచాడు. తన పేలవమైన ఫామ్‌ను వార్నర్ ఈ మ్యాచ్‌లోనూ కొనసాగించాడు. 3 ఫోర్లతో 14 పరుగులు చేసి రబడా బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. ఆ వెంటనే మిఛెల్ మార్ష్ కూడా ఔటయ్యాడు. 17 బంతుల్లో ఒక ఫోర్‌తో 11 పరుగులు చేసి మహారాజ్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. దీంతో ఆస్ట్రేలియా 38 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో చిక్కుకుంది.

ఆదుకున్న స్మిత్..

ఈ దశలో ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లే బాధ్యతను సీనియర్ ఆటగాళ్లు స్టీవ్ స్మిత్, గ్లెన్ మాక్స్‌వెల్ తమపై వేసుకున్నారు. ఇద్దరు సౌతాఫ్రికా బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ స్కోరును ముందుకు తీసుకెళ్లారు. సమన్వయంతో ఆడుతూ వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. భారీ షాట్ల జోలికి వెళ్లకుండా ఒకటి రెండు పరుగులు తీస్తూ స్కోరును నడిపించారు. కీలక ఇన్నింగ్స్ ఆడిన స్మిత్ 3 ఫోర్లతో 35 పరుగులు చేసి నోర్జే బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఆ వెంటనే మాక్స్‌వెల్ కూడా వెనుదిరిగాడు. ఒక ఫోర్‌తో 18 పరుగులు చేసిన అతన్ని షమ్సి అద్భుత బంతితో క్లీన్‌బౌల్డ్ చేశాడు. దీంతో ఆస్ట్రేలియా 81 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. కానీ మార్కస్ స్టోయినిస్, మాథ్యూవేడ్ కుదురుగా ఆడుతూ మరో వికెట్ పడకుండానే ఆస్ట్రేలియాకు విజయం సాధించి పెట్టారు. ధాటిగా ఆడిన స్టోయినిస్ 16 బంతుల్లో మూడు ఫోర్లతో అజేయంగా 24 పరుగులు చేశాడు. మరోవైపు మాథ్యూవేడ్ రెండు బౌండరీలతో 15 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. దీంతో ఆస్ట్రేలియా మరో రెండు బంతులు మిగిలివుండగానే విజయాన్ని అందుకుంది.

మార్‌క్రామ్ ఒంటరి పోరాటం..

అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికాను తక్కువ స్కోరుకే పరిమితం చేయడంలో ఆస్ట్రేలియా సఫలమయ్యారు. కంగారూ బౌలర్లు సమష్టిగా రాణించి ప్రత్యర్థి జట్టు భారీ స్కోరు చేయకుండా కట్టడి చేశారు. హాజిల్‌వుడ్ ఆరంభంలోనే రెండు వికెట్లు తీసి సౌతాఫ్రికాను కష్టాల్లోకి నెట్టాడు. డికాక్ (7), డుసెన్ (2)ల వికెట్లను అతను పడగొట్టాడు. ఇక సఫారీ జట్టులో ఐడైన్ మార్‌క్రామ్ ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. సహచరులు ఒక్కొక్కరే పెవిలియన్ చేరుతున్నా మార్‌క్రామ్ మాత్రం కుదురుగా ఆడుడూ జట్టుకు అండగా నిలిచాడు. కీలక ఇన్నింగ్స్ ఆడిన మార్‌క్రామ్ 3 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 40 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా ఇనలిచాడు. మిగతావారిలో డేవిడ్ మిల్లర్ (16), రబడా 19 (నాటౌట్) కాస్త రాణించారు. ఇక ఆస్ట్రేలియా బౌలర్లలో హాజిల్‌వుడ్, మాక్స్‌వెల్, జంపా రెండేసి వికెట్లు పడగొట్టారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News