హీరోయిన్ తాప్సీ పన్ను.. హిట్, ఫట్ విషయాలను పక్కన పెడితే నటిగా మంచి గుర్తింపు మాత్రం సంపాదించుకుంది. మోడలింగ్ రంగం నుంచి వచ్చిన ఈ సొట్టబుగ్గల చిన్నది ‘ఝుమ్మంది నాదం’ సినిమాతో టాలీవుడ్‌కు హీరోయిన్‌గా పరిచయ మై, ఆ తర్వాత తెలుగు, తమిళంలో వరుస చిత్రాల్లో నటించింది. తాజాగా హీరోయిన్ తాప్సీ పన్ను గొప్ప మనసు చాటుకుంది. దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. ఇలాంటి సమయంలో గుడిసెల్లో ఉండే పేదలు ఎంత ఇబ్బంది పడతారో ఊహించింది తాప్సీ. అందుకే తన వంతు సాయంగా కొందరికి కూలర్లు, ఫ్యాన్స్ పంచింది. ఈ వేసవి నుంచి ఉపశమనం అందించేందుకు ముంబయి మురికివాడల్లో నివసిస్తున్న కొంతమంది పేదలకు టేదలకు ఫ్యాన్లు, మినీ కూలర్లు అందించింది ఈ భామ. భర్త మథియాస్ బోతో కలిసి ఈ ఛారిటీ కార్యక్రమంలో పాల్గొంది.
తాప్సీ చూపించిన ఈ చొరవకు ఓ కంపెనీ సాయం అందించింది. “మనం తరచుగా ఫ్యాన్ లేదా కూలర్ వంటి ప్రాథమిక సౌకర్యాలను తేలిగ్గా తీసుకుంటాం, కానీ ఈ భరించలేని వేడిలో, చాలా మందికి చిన్న గాలి కూడా ఒక వరంలా అనిపిస్తుంది. ఈ చొరవలో భాగం కావడం నన్ను చాలా కదిలించింది. ఫ్యాన్లు, కూలర్లు ఇవ్వడం గురించి మాత్రమే కాదు, ఇది ప్రజలతో కలిసి నిలబడటం, వాళ్ల బాధను తగ్గించడానికి మన వంతు ప్రయత్నం చేయడం ఆనందాన్నిచ్చింది”అని తాప్సీ ఈ సందర్భంగా పేర్కొంది. తాప్సీ ఫ్యాన్లు, కూలర్లు అందిస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్స్ తాప్సీ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. అందమైన నటి మాత్రమే కాదు అందమైన మనసున్న మనిషి అంటూ పొగుడుతున్నారు. త్వరలోనే ‘గాంధారి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఈ బ్యూటీ.