ప్రముఖ తబలా విద్వాంసుడు ఉస్తాద్ జాకీర్ హుస్సేన్(73) కన్నుమూత. అనారోగ్య కారణాలతో అమెరికా, శాన్ ఫ్రాన్సిస్కోలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మరణించినట్లు కుటుంబ సభ్యులు సోమవారం వెల్లడించారు. తీవ్రమైన గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న హుస్సేన్‌ను అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కో ఆసుపత్రిలో చేర్పించారు. గత రెండు వారాలుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో ఐసీయూకి తరలించినట్లు అతని స్నేహితుడు ఫ్లూటిస్ట్ రాకేష్ చౌరాసియా తెలిపారు. ఈ క్రమంలోనే ఇవాళ తెల్లవారుజామున హుస్సేన్ చనిపోయినట్లు తెలిపారు.
కాగా, జాకీర్ హుస్సేన్.. ఆరు దశాబ్దాల పాటు సాగిన తన కెరీర్‌లో అనేక మంది ప్రఖ్యాత భారతీయ, అంతర్జాతీయ కళాకారులతో కలిసి పనిచేశారు. తన కెరీర్‌లో మొత్తం నాలుగు గ్రామీ అవార్డులను అందుకున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన 66వ గ్రామీ అవార్డుల్లోనే మూడు అవార్డులను ఆయన సొంతం చేసుకున్నారు.