- 24 గంటలూ నిఘా
- ప్రతి అంగుళం మేర సిసిటివి కెమెరా కన్ను
- ఢిల్లీ ఎన్‌ఐఎ భవనంలో ఆ సెల్
న్యూఢిల్లీ: ఢిల్లీలోని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ) ప్రధాన కార్యాలయంలో ఒక చిన్న, పకడ్బందీ భద్రత ఉన్న గది ఇప్పుడు కొన్ని ఏళ్లలో దేశంలనే అత్యంత ఉన్నత స్థాయి ఉగ్ర దర్యాప్తుల్లో ఒకదాని కేంద్రంగా ఉన్నది. 14/14 కొలతలతో ఉన్న, సిసిటివి నిఘా, 24 గంటలూ కాపలా ఉండే ఆ సెల్‌లోనే 2008 ముంబయి ఉగ్ర దాడుల కీలక నిందితుడు తహవ్వుర్ హుస్సేన్ రాణా నిర్బంధంలో ఉన్నాడు. యునైటెడ్ స్టేట్స్ అప్పగించగా గురువారం ఢిల్లీ చేరుకున్న తరువాత రాణాను ఎన్‌ఐఎ నిర్బంధంలోకి తీసుకున్నది. రాణా రాకతో అభేద్య కోటగా మారిన సిజిఒ సముదాయంలోని ఎన్‌ఐఎ భవనం కింది అంతస్తులోనే ఆ సెల్ ఉన్నది. అదనపు ఢిల్లీ పోలీస్, పారా మిలిటరీ సిబ్బందిని వెలుపల మోహరించారు. అనుమతి లేకుండా ఏ ఒక్కరినీ లోనికి అనుమతించడం లేదు, తుదకు మీడియా సిబ్బందిని కూడా అనుమతించలేదు. రాణా రాకకు ముందు గురువారం రాత్రి పాటియాలా హౌస్ కోర్టు ప్రాంగణంలో నుంచి భద్రత కారణాలపై మీడియా సిబ్బందిని బయటకు పంపారు. రాణా సెల్‌లో అనేక అంచెల డిజిటల్ భద్రత వ్యవస్థలు ఏర్పాటు చేశారు. వాటిలో ప్రతి అంగుళాన్ని పసిగట్టే సిసిటివి కెమెరాలు ఉన్నాయి. 12 మంది నిర్దేశిత ఎన్‌ఐఎ అధికారులను మాత్రమే లోనికి వెళ్లనిస్తారు. గదిలో నేలపై ఒక పరుపు ఉన్నది. సెల్ లోపలే ఒక బాత్‌రూమ్ ఉన్నది. అంటే అతని కదలికలను పరిమితం చేశారన్న మాట. కనీసావసరాలు భోజనం, తాగు నీరు, మందులు అన్నిటినీ అతనికి లోపలే అందజేస్తారు. 64 ఏళ్ల పాకిస్తానీ సంతతి కెనడా జాతీయుడు రాణా యుఎస్ నుంచి అప్పగింత విమానంలో గురువారంఢిల్లీ చేరుకున్నాడు. కొన్ని గంటల అనంతరం అతనిని పాటియాలా హౌస్‌లోని ప్రత్యేక ఎన్‌ఐఎ న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టారు. కోర్టు గదిలో నుంచి అత్యవసరం కాని సిబ్బంది అందరినీ పంపివేశారు. ప్రత్యేక ఎన్‌ఐఎ ధర్మాసనానికి సారథ్యం వహిస్తున్న న్యాయమూర్తి చందర్ జిత్ సింగ్ అతనికి 18 రోజుల ఎన్‌ఐఎ కస్టడీని మంజూరు చేశారు. ఎన్‌ఐఎ 20 రోజుల కస్టడీ కోరింది. న్యాయవాది లేకుండా హాజరైన రాణాకు న్యాయమూర్తి అతనికి ఢిల్లీ లీగల్ సర్వీసెస్ అథారిటీ ద్వారా న్యాయ సహాయం అందజేయనున్నట్లు తెలియజేశారు. అతనికి ప్రాతినిధ్యం వహించేందుకు న్యాయవాది పీయూష్ సచ్‌దేవాను ఆ తరువాత నియమించారు.