Sunday, April 13, 2025

తీహార్ జైలుకు రాణా

- Advertisement -
- Advertisement -

ప్రత్యేక విమానంలో యుఎస్
నుంచి రాణా తరలింపు
గట్టి బందోబస్తు మధ్య
పాలం విమానాశ్రయంలో
దిగిన విమానం
కట్టుదిట్టమైన భద్రత
మధ్య జైలుకు ఎట్టకేలకు
చిక్కిన ముంబై పేలుళ్ల
కుట్రదారుడు

న్యూఢిల్లీ : ముంబై ఉగ్రదాడుల కేసు నిందితుడు తహవూర్ హుస్సేన్ రాణాను దేశానికి తీసుకువచ్చే ప్రక్రియ పూర్తయింది. ఈ విషయంపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ) గురువారం అధికారిక ప్రకటన వెలువరించింది. రాణాను విజయవంతంగా భారత్‌కు తీసుకువచ్చామని , అరెస్టు చేసి, తీహార్ జైలుకు ముందుగా తరలించామని ఎన్‌ఐఎ తెలిపింది. జైలు నుంచే వీడియో కాన్ఫరెన్స్ ద్వా రా రాణాను ఎన్‌ఐఎ కోర్టులో హాజరుపర్చారు. తీహార్ జైలులోని హై సెక్యూరిటీ విభాగంలోనే ఇకపై ఆయన వి చారణ జరుగుతుంది. ఇక ఆయనపై సమగ్ర విచారణకు రంగం సిద్ధం అయింది. 2008 నాటి ముంబై నరమేథం ఘటనలో ఇప్పుడు దర్యాప్తు సంస్థలు నిర్ణీత లక్షం చేరుకున్నాయని ఎటువంటి ప్రతిబంధకాలు తలెత్తలేదని ప్రకటనలో వివరించారు. అమెరికాలో ఉంటున్న రాణాను చట్టపరమైన అవరోధాలు తొలిగిన తరువాత ప్రత్యేక విమానంలో ఇక్కడి పాలంవిమానాశ్రయానికి తీసుకువచ్చారు.

కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ప్రత్యేక బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో తీసుకువెళ్లారు. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తీసుకున్న చొరవ ఫలితం ఇది. ఈ విషయంలో తమతో పాటు అమెరికాకు చెందిన న్యాయశాఖ, యుఎస్ స్కె మార్షల్, ఇతర దర్యాప్తు సంస్థలు కీలక పాత్ర పోషించాయని వివరించారు. అమెరికా ఉన్నతాధికారులు కూడా తగు విధంగా స్పందించారు.మొత్తం మీద ఆపరేషన్ సక్సెస్ , ఇక విచారణ పరిధి ఉందని తెలిపారు. ఢిల్లీలో రాణాను ముందుగా ఎక్కడికి తరలిస్తారనేది ఎన్‌ఐఎ కానీ ఇతర సంస్థలు కానీ వెల్లడించలేదు. రాణా ఢిల్లీకి చేరుకున్నాడని తెలియగానే స్థానిక పాటియాలా కోర్టు వద్ద హడావిడి నెలకొంది. సీనియర్ అడ్వకేట్ దయాన్ కృష్ణన్, ప్రత్యేక పిపి నరేందర్ మాన్ ఎన్‌ఐఎ తరఫున వాదన విన్పించేందుకు న్యాయస్థానానికి వచ్చారు. పాటియాల కోర్టు వద్ద విలేకరులను పోలీసు బలగాలు అనుమతించలేదు. కనీసం ఫోటోలు కూడా తీసుకోనివ్వలేదు.

ప్రధాని మోడీ దౌత్యం ..ట్రంప్ ప్రకటన
ప్రధాని నరేంద్ర మోడీ ఈ ఏడాది ఫిబ్రవరిలో అమెరికా పర్యటనకు వెళ్లినప్పుడు రాణా తరలింపు , అప్పగింత విషయాన్ని ట్రంప్ వద్ద ప్రస్తావించారు. తరువాత ఈ విషయంపై కదలిక ఏర్పడింది.ఫిబ్రవరి 14వ తేదీన జరిగిన సంయుక్త విలేకరుల సమావేశంలో రాణా అప్పగింతకు తాము అంగీకరిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. దీనితో ఆయన భారత్ రప్పింత ఏర్పాట్లు జరిగాయి. అమెరికా, ఇండియా సంబంధిత నేరస్తుల తరలింపు చట్టం పరిధిలో భాగంగా రాణా తరలింపు జరిగింది. అప్పటివరకూ లాస్ ఏంజెల్స్‌లోని మెట్రోపాలిటన్ డిటెన్షన్ సెంటర్‌లో ఉన్న రాణాను తరలించారు. భారత్‌లో చట్ట ప్రక్రియను ఎదుర్కొనేందుకు రాణాను భారత్‌కు అప్పగిస్తున్నామని అప్పట్లో ట్రంప్ తెలిపారు. ఈ పరిణామం మోడీ దౌత్య విజయంగా మారింది. తనను భారత్‌కు అప్పగించరాదని న్యాయపరంగా న్న అవకాశాలన్నింటిని రాణా వాడుకున్నారు. హెబియస్ కార్పస్ పిటిషన్ కూడా వేశారు. అయితే అన్ని కూడా తిరస్కరణకు గురయ్యాయి.

లష్కరే, హర్కతుల్‌తో లింక్‌లు
రాణాకు నిషేధిత లష్కరే తోయిబా, హర్కతుల్ జిహాదీ ఇస్లామీ నేత అయిన డేవిడ్ కోల్‌మెన్ హెడ్లీతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. లష్కరే, హర్కతుల్ సంస్థలను భారతదేశం ఉగ్రవాద సంస్థలుగా నిర్థారించింది. ముంబై ఉగ్రవాద దాడులలో మొత్తం 166 మంది దుర్మరణం చెందారు. వీరిలో అమెరికా, బ్రిటన్ , ఇజ్రాయెల్ జాతీయులు కూడా ఉన్నారు. అప్పట్లో ఈ ఉగ్రదాడి భయానక ఘటనగా మారింది. 10 మంది పాకిస్థానీ జాతీయులతో కూడిన ఉగ్రవాదుల బృందం జనవాసాలను టార్గెట్ చేసుకుని దాడులకు దిగింది. ఇందులో రాణా కూడా ఉన్నారు. రాణా పాకిస్థానీ జాతీయుడు అని భారత దర్యాప్తు సంస్థలు తెలిపాయి. అయితే ఇప్పుడు రాణా తరలింపు నేపథ్యంలో పాకిస్థాన్ స్పందించింది. రాణాతో తమకు సంబంధం లేదని, అంతకు ముందెప్పుడో ఆయన పౌరుడు కావచ్చు. అయితే ఆయన కెనడాకు వెళ్లాడు.

తిరిగి పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోలేదు. ఇక పాకిస్థానీ పాస్‌పోర్టు ఆయనకు ఉందనే విషయంపై స్పందిస్తూ ఇది అధికారిక పాస్‌పోర్టు కాదని, ఇక దీనిపై మాట్లాడేందుకు ఏమీ లేదని పాక్ విదేశాంగశాఖ గురువారం అధికారిక ప్రకటన వెలువరించింది. అయితే రాణా గతంలో పాకిస్థాన్ సైన్యం వైద్య విభాగంలో పనిచేశాడు. 1990లో గుట్టుచప్పుడు కాకుండా కెనడాకు తరలివెళ్లాడు. అక్కడ సొంతంగా కన్సల్టెన్సీ సంస్థను ఏర్పాటు చేసుకున్నాడు. తరువాత అమెరికాలోని చికాగోకు వెళ్లి తమ కార్యకలాపాలు సాగించారని నిర్థారణ అయింది. వీసా కన్సల్టెన్సీ సంస్థ ద్వారానే రాణా అప్పట్లో కీలక ఉగ్రవాది రాణా భారత్‌లో ఉగ్రదాడులు నిర్వహించుకునేందుకు వెన్నుదన్నుగా నిలిచాడు. భారత్‌లో పలు చోట్ల తమ దాడులకు రాణా మారువేషాలలో భారత్‌లో పర్యటించారు. ఉత్తరప్రదేశ్‌లోని హపూర్, ఆగ్రా, ఢిల్లీ, కొచ్చి , అహ్మదాబాద్, ముంబైలలో పర్యటించి దాడికి అనువైన కేంద్రంగా వాణిజ్య రాజధాని ముంబైని ఎంచుకున్నట్లు దర్యాప్తు సంస్థలు నిర్థారించాయి

. భార్య సమ్రాజ్ రాణా అక్తర్‌తో కలిసి 2008లోనే ఆయన భారత్‌లో పర్యటించినట్లు వెల్లడైంది. ఈ క్రమంలోనే అతి తెలివిగా తన దాడులకు వ్యూహరచన చేసుకున్నాడు. ఈ పనిలో ఆయనకు పాకిస్థాన్ తోడ్పాటు అందించింది. ఇక రాణా విచారణ ఎక్కడ జరుగుతుందనేది స్పష్టం కాలేదు. ఎన్‌ఐఎ కోర్టు పరిధిలోనే జరుగుతుందని భావించారు. కానీ ప్రత్యేక సెల్ ఏర్పాటు కానుందనే వార్తలు వెలువడ్డాయి. రాణా సంబంధిత పాస్‌పోర్టులు ఇతర కీలక పత్రాల సమగ్ర పరిశీలన జరుగుతుంది. ఇక విచారణ తరువాత ప్రత్యేకించి పాకిస్తాన్ నుంచి అందిన సాయం విషయంపై ఆరా తీస్తారు.రాణా పాకిస్థాన్‌లోని పంజాబ్‌లోని చిచావత్నిలో 1961 జనవరిలో జన్మించారు, వృత్తిరీత్యా వైద్యుడు. కెనడా పౌరసత్వం కూడా పొందాడు. తరువాత ఎక్కువగా చికాగోలో నివసించేవాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News