తైవాన్ లోని పలు ప్రాంతాల్లో సోమవారం రాత్రి నుంచి మంగళవారం తెల్లవారు జాము వరకు పదుల సంఖ్యలో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. వీటిలో ఒకటి అత్యధికంగా రిక్డర్ స్కేలుపై 6.3తీవ్రతగా హుయాలియన్ నగరం సమీపాన 10.7 కిమీ లోతులో నమోదయ్యింది. ఇక్కడ ఫుల్ హోటల్ పాక్షికంగా దెబ్బతింది. దీంతో రాత్రంతా ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని భయంగా గడిపారు. అయితే స్వల్పనష్టం తప్ప ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు ప్రకటించారు. అత్యల్ప జనాభా కలిగిన గ్రామీణ ప్రాంతం హువాలియన్‌లో ఏప్రిల్ 3న 7.2 తీవ్రతతోభారీ భూకంపం
సంభవించి కనీసం 14 మంది ప్రాణాలు కోల్పోయారు. అప్పటి నుంచి ఈ 20 రోజుల్లో అక్కడ వెయ్యిసార్లు భూ ప్రకంపనలు నమోదయ్యాయి. రాజధాని తైపీతోసహా తైవాన్ తూర్పు, పశ్చిమ , ఉత్తర ప్రాంతాల్లో భూ ప్రకంపనలు కొనసాగాయని అధికారులు పేర్కొన్నారు. సోమవారం మధ్యాహ్నం నుంచి ప్రారంభమైన భూకంపాలు సుమారు 180 వరకు ఉంటాయని తైవాన్ సెంట్రల్ వెదర్ అడ్మినిస్ట్రేషన్ తెలిపింది. హుయాలియన్‌లో చుట్టుపక్కల ప్రాంతాల్లో స్కూళ్లు, ఆఫీస్‌లు మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించింది.