Tuesday, December 24, 2024

డిప్లొమా కోర్సుల ఫీజుల నియంత్రణపై నిర్ణయం తీసుకోవాలి : హైకోర్టు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : డిప్లొమా కోర్సుల ఫీజుల నియంత్రణపై నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. డిప్లొమా కోర్సులను టీఎస్‌ఏఎఫ్‌ఆర్‌సీ పరిధిలోకి తేవాలని గతేడాది సాంకేతిక విద్యాశాఖ ప్రతిపాదనలు తీసుకొచ్చింది. సాంకేతిక విద్యా శాఖ ప్రతిపాదనలపై గతేడాది ఫిబ్రవరి నుంచి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకో లేదు. కౌన్సెలింగ్ ప్రారంభమైనందున ఫీజులు పెంచాలని హైకోర్టులో ఐదు ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజీలు పిటిషన్ దాఖలు చేశాయి. దీనిపై శక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది.

ఫీజుల నియంత్రణపై వివరణ ఇవ్వాలని ఆదేశించినా విద్యాశాఖ కార్యదర్శి స్పందించకపోవడంతో హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ నేరుగా వచ్చి వివరణ ఇవ్వాలని ధర్మాసనం ఆదేశించింది. వారంలోగా విద్యా శాఖ నిర్ణయం తీసుకుంటుందని హైకోర్టుకు ప్రభుత్వ న్యాయవాది తెలియజేశారు.

విద్యాశాఖ కార్యదర్శి వ్యక్తిగత హాజరుకు మినహాయింపు ఇవ్వాలని ప్రభుత్వ న్యాయవాది కోరారు. అయితే విద్యాశాఖ కార్యదర్శి ఏ నిర్ణయం తీసుకునే అవకాశం కనిపించడం లేదని హైకోర్టు వ్యాఖ్యానించింది. పాలిటెక్నిక్ కాలేజీలు కోరినట్లుగా ఫీజుల పెంపునకు అనుమతించక తప్పడం లేదని న్యాయస్థానం పేర్కొంది. ఫీజును రూ.40వేలకు పెంచేందుకు ఐదు పాలిటెక్నిక్ కాలేజీలకు అనుమతిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. టీఎస్‌ఏఎఫ్‌ఆర్‌సీ పరిధిలోకి తేవాలన్న ప్రతిపాదనలపై వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రభుత్వం తక్కువగా ఫీజు ఖరారు చేస్తే విద్యార్థులకు వెనక్కి ఇవ్వాలని కాలేజీలకు హైకోర్టు షరతు విధించింది. ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజీల ఫీజులపై తదుపరి విచారణను హైకోర్టు ఈనెల 26కి వాయిదా వేసింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News