Saturday, December 21, 2024

వర్ష బాధిత గ్రామాలలో అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోండి

- Advertisement -
- Advertisement -

ముఖ్యమంత్రికి కూనంనేని సాంబశివరావు లేఖ

హైదరాబాద్ : ఇటీవల భారీవర్షాలు కురిసిన క్రమంలో వర్ష బాధిత గ్రామాల్లో అంటు వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కెసిఆర్‌కు ఆయన శుక్రవారం లేఖ రాశారు.

ఇప్పటికే వర్షాలకు 18 మంది మృత్యువాతపడగా, 10 మంది గల్లతయ్యారని, వందలాది పశువులు వరదలలో కొట్టుకపోయాయన్నారు. వరదలు, భారీ వర్షాల కారణంగా చెత్తపేరకపోయి అపరిశుభ్ర పరిస్థితులకు దారితీస్తున్నదని, ఫలితంగా డెంగ్యూ, మలేరియా, చికెన్‌గున్యా, డయేరియా లాంటి అంటు వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉన్నదని వైద్యులు హెచ్చరిస్తున్నారన్నారు. వర్షాకాలంలో బాక్టీరియా, వైరస్‌లు ఎక్కువగా వ్యాప్తి చెందడం, దోమలు పెరుగుదల, కలుషుత నీరు కారణాలతో ప్రజలు అనారోగ్య బారినపడుతున్నారని, అపరిశుభ్ర పరిసరాలను శుభ్రం చేయడంలో అటు గ్రామపంచాయతీ సిబ్బందే కీలకపాత్ర వహిస్తారని ఆయన గుర్తు చేశారు. గ్రామపంచాయతీ సిబ్బంది సమ్మెలో కొనసాగుతుండడంతో గ్రామాలలో అపరిశుభ్రం పెరిగి అంటు వ్యాధులు విజృంబించే ప్రమాదం పొంచి ఉన్నదన్నారు. గ్రామ పంచాయతీలో పనిచేసే కార్మికులు నిరుపేద కుటుంబాలకు చెందినవారని, వారు జీతాల పెంపుదల కోసం మాత్రమే సమ్మె బాట పట్టారన్నారు. వారి సమ్మె ప్రభుత్వం మీద వ్యతిరేకతగా భావించాల్సిన అవసరం లేదన్నారు.

రాష్ట్ర వ్యాపితంగా 12,769 గ్రామపంచాయతీలలో స్వీపర్లు, పంప్ ఆపరేటర్లు, ఎలక్ట్రిషీయన్లు, డ్రైవర్లు, కారోబార్లు, బిల్ కలెక్టర్స్, నర్సరీలు, వైకుంఠధామాలు పనిచేస్తున్న సుమారు 50,000 మంది ఉద్యోగులు తమ విధులు నిర్వర్తిస్తున్నారన్నారు. తమ ప్రాణాలను పణంగా పెట్టి శుభ్రం చేసి ప్రజల ప్రాణాలను కాపాడుతున్నారన్నారు. పంచాయతీ కార్మికుల పని విధానం వలన రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర స్థాయిలో గుర్తింపులు, అవార్డులు కూడా రావడం జరిగింది. ప్రధానంగా 20,30 సంవత్సరాల నుండి పనులు చేస్తున్న వీరికి ఉద్యోగాల క్రమబద్దీకరణ లేకపోవడం, పనికి గుర్తింపు ఇవ్వకపోడం, కనీస వేతనం అమలు చేయకపోవడం, పి.ఎఫ్. ఇ.ఎస్.ఐ, ప్రమాద బీమా లాంటి కల్పించడం లేదు. ఇందుకుగాను 2023 జూలై 6వ తేదీ నుండి సమ్మె బాట పట్టనున్నట్లు గ్రామపంచాయతీ ఉద్యోగులు తెలియజేస్తున్నారు.

జీవో నెంబర్ 51తో మల్టీపర్పస్ విధానాన్ని ప్రవేశపెట్టి, ఉద్యోగులు అన్ని రకాల పనులు చేయాలని ఒత్తిడి చేస్తున్నారని, దానితో నైపుణ్యం లేని పనులు చేయించడంతో అనేక ప్రమాదాలు జరిగి కార్మికులు మృత్యువాత పడుతున్నారు. గ్రామపంచాయతీ కార్మికులను పర్మినెంట్ చేయాలని, ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని, ట్రైజరీ ద్వారా వేతనాలు ఇవ్వాలని, కనీస వేతనం రూ. 19,500/ౠ ఇవ్వాలని, జీవో 51ని రద్దు చేసి మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని తదితర న్యాయమైన డిమాండ్లు ప్రభుత్వం ముందు పెడుతున్నారు. కావున వర్షాకాలంలో గ్రామాలలో పారిశుద్ధ్య, అనారోగ్య సమస్యలు తలెత్తకుండా గ్రామపంచాయతీలో పనిచేస్తున్న ఉద్యోగుల సమ్మెను తక్షణమే పరిష్కరించి, వారి ఉద్యోగాలను క్రమబద్దీకరించి, వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతున్నానని తన లేఖలో పేర్కొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News