హైదరాబాద్ : వ్యవసాయ రంగంలో యువత అవకాశాలను అందిపుచ్చుకోవలని ఎన్‌ఐపిహెచ్‌ఎం డైరెక్టర్ జనరర్ డా.సాగర్ హనుమాన్ సింగ్ అన్నారు.ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో వారం రోజుల పాటు నిర్వహించిన అగ్రి యూత్ సమ్మిట్ -2023 సోమవారం ముగిసింది. రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాల ఆడిటోరియంలో జరిగిన ముగింపు కార్యక్రమానికి డైరక్టర్ జనరల్ డాక్టర్ సాగర్ హనుమాన్ సింగ్ ముఖ్య అతిధి గా హాజరై ప్రసంగించారు. మారుతున్న పరిస్థితులలో వ్యవసాయ రంగంలో అనేక అవకాశాలు అందుబాటులోకి వస్తున్నాయని వాటిని వ్యవసాయ పట్టభద్రులు అంది పుచ్చుకోవాలని ఆయన సూచించారు. వ్యవసాయ విద్యని అభ్యసించడం అదృష్టంగా భావించి ఉద్యోగాలు ఆశించే వారుగా కాకుండా ,ఉద్యోగాలు కల్పించే వారుగా ఎదగాలని అన్నారు. పంటల యాజమాన్యం, సస్య రక్షణ,యాంత్రీ కరణ అంశాలలో వినూత్నమైన ఆలోచనలతో వ్యాపార కార్యక్రమాలు చేపట్టేందుకు ఆసక్తి చూపాలన్నారు. ప్లాంట్ హెల్త్ క్లినిక్ లు ఏర్పాటు చేసే విధంగా విద్యార్థులకి అవగాహన కల్పించాలని హనుమాన్ సింగ్ విశ్వ విద్యాలయ అధికారులకి సూచించారు. తద్వారా విద్యార్థులకి ఉపాధి అవకాశాలు కలగటంతో పాటు రైతాంగానికి సేవలు అందే వీలు కలుగుతుందన్నారు.
ఆధునిక సమాచార పరిజ్ఞానాన్ని వినియోగించుకొని రైతులకి కృత్రిమ మేధ, మెషిన్ లెర్నింగ్, డ్రోన్ ల ద్వారా సేవలు అందించడం పై దృష్టి పెట్టాలని కార్యక్రమానికి అధ్యక్షత వహించిన రిజిస్ట్రార్ డాక్టర్ వెంకట రమణ సూచించారు. అగ్రి యూత్ సమ్మిట్ -2023 సందర్బంగా విద్యార్థుల కి వివిధ అంశాల పై పోటీ లు నిర్వహించారు. వాటి లో గెలుపొందిన వారికి బహుమతులు, సర్టిఫికెట్స్ ని హనుమాన్సింగ్, రిజిస్ట్రార్, ఇతర అధికారులు అందచేశారు. ఈ కార్యక్రమం వివరాలని డీన్ ఆఫ్ స్టూడెంట్స్ అఫైర్స్ డాక్టర్ జె. సత్యనారాయణ వివరించారు. ఈ కార్యక్రమం లో విశ్వవిద్యాలయ అధికారులు డాక్టర్ సీమ, డాక్టర్ జమునా రాణి, డాక్టర్ నరేంద్ర రెడ్డి, డాక్టర్ రాధిక తదితరులు పాల్గొన్నారు.