అహ్మదాబాద్: గుజరాత్‌లోని డాంగ్ జిల్లాలో సెల్ఫీలు తీసుకున్నవారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయడానికి ఆదేశాలు జారీ అయ్యాయి. కొంతకాలంగా ఆ జిల్లాలో సెల్ఫీల వల్ల ప్రమాదాలు జరిగి పలువురు మరణించడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. మూడేళ్ల నుంచి సెల్ఫీలపై తమ జిల్లాలో కఠిన ఆంక్షల్ని అమలు చేస్తున్నామని అదనపు కలెక్టర్ టిడి దామర్ తెలిపారు. డాంగ్‌లో జలపాతాలు, ఎత్తైన కొండలు ఉండటంతో వర్షాకాలంలో పర్యాటకుల తాకిడి అధికంగా ఉంటుంది. గతంలో ఔత్సాహికులు కొందరు సెల్ఫీలు తీసుకోవడం, ప్రమాదవశాత్తూ మరణించడంలాంటి సంఘటనలు నమోదయ్యాయి. దాంతో, సెల్ఫీలపై ఆంక్షలు విధించారు. ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టడంతో పర్యాటకుల రాక ప్రారంభమైందని అధికారులు తెలిపారు. 2011 నుంచి 2017 వరకు ప్రపంచవ్యాప్తంగా సెల్ఫీల కారణంగా 259మంది చనిపోగా, వారిలో సగం మంది భారతీయులేనని అమెరికా నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది.